చీకటి జీవితాలలో వెలుగు నింపిన జంట
పొట్టకూటి కోసం చిన్నతనంలోనే బిక్షాటన చేయాల్సి వచ్చిన మీఠా రామ్ అనే వ్యక్తి తన బాల్యంలోని చీకటి ్ఞపకాలను తలుచుకున్నపుడల్లా ఎదో తెలియని ఆందోళన చెందుతారు. గుజరాత్ లోని మెహసానాలో తన 8 ఏళ్ల అన్నయ్య, 6 ఏళ్ల తమ్ముడు, తల్లితో కలిసి రోడ్డు పక్కన పేవ్‌మెంట్ పైన పడుకున్న రోజులను గుర్తుచేసుకుంటూ, ఆకాశంలోకి చూస్తూ సమాధానాలు లేని ప్రశ్నల గురించే ఆలోచిస్తూ గడిపిన ఆ నిద్రలేని రాత్రులను గుర్తుచేసుకుంటారు. ప్రతి ఉదయం నేరాలు, మాదకద్రవ్యాల సుడి నుండి తప్పించుకుంటూ తాను తన సోదరుడి చిన్న చేతిలో ఒక గిన్నెను ఉంచి అందులో కొంతమంది తిట్లు మరికొంత మంది కొన్ని నాణేలతో రోజు గడిపేవారు. ఒకప్పుడు భిక్షాటన చేసే రెండు చేతులు భిల్వారాలోని దేవ్ నారాయణ్ హోటల్‌లో రుచికరమైన వంటలు తయారు చేస్తూ అందరి కడుపు నింపుతున్నాయంటే ఆయన ఇది ఇప్పటికీ నమ్మలేకపొతున్నారు.
తన జీవితంలోని ఈ అద్భుతమైన మార్పునకు 66 ఏళ్ల సంఘ స్వయంసేవక్ శ్రీ జయంతిభాయ్, ఆయన సతీమణి అరుణా బెన్‌లు కారణమని మీఠారామ్ గారు చెప్పడానికి ఎప్పుడూ వెనుకాడరు. గుజరాత్‌కు చెందిన ఈ వృద్ధ దంపతులు వరదలు, భూకంపాలు, కరోనా వంటి అనేక విపత్తులలో చాలా రోజులుగా విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో ఉంటూ అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. సాధారణంగా ఏ వయసులో అయితే ప్రజలు సహాయంకోసం ఎదురుచూస్తారో ఆ వయసులో జయంతిభాయ్, అరుణా బెన్ దంపతులు గుజరాత్ మెహసానాలో ‘‘చైల్డ్ బెగ్గర్ ఫ్రీ ఎడ్యుకేటెడ్ సొసైటీ’’ కార్యక్రమాన్ని ఆరంభించారు. 2000 సంవత్సరం నుంచి మెహసానాలో నడుస్తున్న ఈ ప్రకల్పం కింద నేడు దాదాపు 245 గుఢారాలను నిర్మించామని జయంతి భాయ్ చెప్పారు. ఒకప్పుడు బిక్షాటన చేసి పొట్ట నింపుకొనే ఈ పిల్లలు ఇప్పుడు సొసైటీ సహకారంతో ఈ గుడారాల్లోనే ఉంటూ చదువు పూర్తి చేస్తున్నారు. వారి బస, చదువుకు ఎటువంటి రుసుము ఉండదు. ఇక్కడ నివసించే చిన్నారుల జీవితాలకు దిశానిర్దేశం చేయడంతో పాటు నేర చరిత, భిక్షాటనల నుండి దూరంగా ఉంచుతూ స్వయం సమృద్ధితో ఎదగడానికి సహాయసహకా రాలు అందచేస్తున్నారు.
గుజరాత్‌కు చెందిన ప్రాంత సేవా ప్రముఖ్ అశ్విన్ జడేజా ఇలా అన్నారు. ‘‘1984 నుండి 1992 వరకు, పాలన్‌పూర్‌లోని ఆర్.ఎస్.ఎస్ నగర కార్యకర్తగా ఉన్న శ్రీ జయంతిభాయ్ పటేల్ 2000 వరకు చిన్న తరహా పరిశ్రమల శాఖలో లఘు ఉద్యోగ్ భారతిలో పనిచేశారు. పాలన్‌పూర్‌లోని వివిధ్ లక్ష్య విద్యా మందిర్ విద్యాలయానికి అధ్యక్షుడిగా ఉన్న ఆయన పిల్లల పట్ల చాలా సున్నితంగా ఉండేవారు. ఆరావళి పర్వత శ్రేణులలో నివసించే వనవాసి పిల్లలు బాణాలు, విల్లులతో వివస్త్రలుగా తిరుగుతూ ఉండటం చూసి సేవాదృక్పథం కలిగిన ఈ దంపతుల హృదయం చలించిపోయింది. ఆ సమయంలో ప్రతి సోదరి నుండి నెలకు రూ.10 తీసుకొని సుమారు 500 మంది సోదరీమణులతో ఒక మండలి ఏర్పాటు చేసి మురికివాడలలో పిల్లలకు బాల సంస్కార కేంద్రాలను ప్రారంభించారని అరుణా బెన్ చెప్పారు. ఆ కేంద్రం నేడు పాలన్‌పూర్‌లోని ఉత్తర గుజరాత్ పబ్లిక్ వెల్ఫేర్ ట్రస్ట్‌గా పేర్గాంచింది. ప్రస్తుతం, ఇక్కడి హాస్టల్‌లో సుమారు 250 మంది వనవాసీ పిల్లలు ఉచితంగా సమగ్ర వికాసం పొందుతున్నారు.’’
నిజమైన స్వయంసేవక్ నేత్రాలు ఎల్లప్పుడూ సేవ చేయడం కోసం వెతుకుతూనే ఉంటాయి. 2000వ సంవత్సరంలో మెహసానాకు వచ్చిన తర్వాత, జయంతీభాయి రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై బిక్షాటన చేసే పిల్లలను చూసి ఆయన మనస్సు కలత చెందింది. ఆకలి కడుపు చేతులు చాచమని బలవంతం చేస్తుంది, లేకుంటే భిక్షాటన చేసి ఆనందించేదెవరు? ఇలాంటి కొన్ని ప్రశ్నలను ఛేదించి, 6 నుండి 15 సంవత్సరాల వయస్సు గల వివిధ నగరాలు, రాష్ట్రాల నుండి 18 మంది పిల్లలపై ఒక సర్వే నిర్వహించారు. సంప్రదింపుల ద్వారా, జిల్లా కలెక్టర్ ఆమోదంతో, ప్రభుత్వ భూమిలో 16 గుఢారాలు నిర్మాణం చేశారు. అక్కడ 45 మంది పిల్లలు వారి తల్లిదండ్రులతో నివసించడం ప్రారంభించారు. వారికి చదువుపై అవగాహన కల్పించేందుకు తగిన పాఠశాలల్లో చేర్పించారు. నేడు, భిక్షాటనను విడిచి పెట్టి ప్రతి సంవత్సరం ఈ గుడారాల నుండి 300 మందికి పైగా పిల్లలు పాఠశాలకు వెళుతున్నారు. వారికి కొత్త స్కూల్ యూనిఫాం, బ్యాగులు, పుస్తకాలను జయంతిభాయ్, అరుణా బెన్ అందజేస్తున్నారు. సంవత్సరానికొకసారి ఎడ్యుకేషనల్ టూర్ కి కూడా తీసుకువెళతారు. గత 20 ఏళ్లుగా అమలవుతున్న ఈ పథకం వల్ల మీఠారాం లాంటి యువకులు, యువతులు కుక్‌లు, డ్రైవర్లు, ప్లంబర్లుగా, వివిధ ఫ్యాక్టరీలలో పనిచేస్తూ తమ కాళ్లపై తాము నిలబడి 200 మంది యువతకు స్ఫూర్తి, ధైర్యాన్ని అందించారు. తమను తాము నిలబెట్టుకుంటూ ఇతరులకు సాయపడుతూ స్వయంశక్తిగా వారు మారారు.
నేడు 10 కంటే ఎక్కువ కుటుంబాలు సొంత ఇంట్లో నివసిస్తున్నారు ఇక 22 కుటుంబాలు ఈ దిశగా కదులుతున్నాయి. సేవాభావం ఉన్న వ్యక్తికి ప్రతి రంగం స్ఫూర్తిదాయకం. ప్రతి సంవత్సరం 20,000 కంటే ఎక్కువ చెట్లను బహిరంగ ప్రదేశాల్లో నాటడం, మొదటి నుండి చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడం లాంటి స్ఫూర్తిదాయకమైన పనులు చేయడం వలన 2016లో, శ్రీ జయంతిభాయ్ పటేల్‌ను గుజరాత్ ప్రభుత్వం ‘‘గ్రీన్ బ్రిగేడియర్’’ అవార్డుతో అలంకరించింది.