MMRI ఆధ్వర్యంలో ‘‘ నక్సల్స్ నరమేధం – మేధోమథనం సదస్సు పార్ట్-3
రాజ్యాంగాన్ని నమ్మని వారికి రాజ్యాంగ హక్కులు ఎలా వర్తిస్తాయని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోరాడే వారికి మానవ హక్కుల గురించి మాట్లాడే హక్కు ఎవరిచ్చారని, అసలు ఎలా ఆపాదిస్తున్నారని సీనియర్ పాత్రికేయులు, నేషనలిస్ట్ హబ్ సీఈవో సాయికృష్ణ ప్రశ్నించారు.MMRI సంస్థ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్శిటీలోని PGRRCDE ఆడిటోరియంలో ”నక్సల్స్ నరమేధం – మేధో మథనం” అన్న పేరుతో జరుగుతున్న సదస్సులో ప్రసంగించారు. పార్లమెంటరీ, ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటు హక్కు అనేది అత్యంత కీలకమని, దానినే బహిష్కరిస్తామనే వారికి రాజ్యాంగం, పార్లమెంట్ అని పదే పదే ప్రస్తావించడం అత్యంత విరుద్ధమని అన్నారు. దీని విషయంలో తర్కం లేని మాటలు మాట్లాడుతున్నారని అన్నారు.

1958 నుంచి 62 మధ్య కాలంలో మావో సేటుంగ్ గ్రేట్ లీఫ్ ఫార్వడ్ అన్న నినాదం తెచ్చారని, అడవులను నరికేయాలని స్వయంగా మావో సేటుంగ్ పిలుపునిచ్చారని వెల్లడించారు. కానీ ఇప్పటి మావోయిస్టులు తరుచూ అటవీ సంపద, అడవుల రక్షణ, వన సంపద గురించి మాట్లాడుతుంటారని, అదో విడ్డూరమని దెప్పిపొడిచారు.అలాగే ఫోర్ బెస్ట్ క్యాంపెన్ అని ఓ పిలుపునిచ్చారని దీని ద్వారా పిచ్చుకలు, ఎలుకలు, ఈగలు, దోమలను చంపాలని ఓ తెలివి తక్కువ ఆలోచన చేశారని, దీని ద్వారా పంట ఉత్పాదకత పెంచాలని పిలుపునిచ్చారని పేర్కొన్నారు. కానీ.. అదే సోకాల్డ్ వామపక్ష మేధావులు ఇప్పుడు అడవుల సంరక్షణ గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.దీంతో ఉత్పాదకత తగ్గి, జీవ వైవిధ్యం పూర్తిగా దెబ్బతిందని, చైనాలో దారుణ పరిస్థితి నుంచి బయటపడడానికి చాలా సమయం పట్టిందన్నారు.
అలాగే మరో ఉదాహరణను వివరిస్తూ.. ప్రకృతి, మానవుల మధ్య ఓ సమతౌల్యత వుండాలన్నది అప్పట్లో చైనాలో వుండేదని, కానీ చైనాలో మావోయిజం వచ్చిన తర్వాత ప్రకృతిని ఆక్రమించే సిద్ధాంతాన్ని తెచ్చాడని పేర్కొన్నారు.అక్కడి నుంచే చైనాలో వాతావరణ ఇబ్బందులు వచ్చాయని, పారిశ్రామికీకరణ పెరిగిపోయిందన్నారు. దున్నేవాడిదే భూమి అని ఇక్కడ కమ్యూనిస్టులు అంటున్నారని, కానీ.. చైనాలో మాత్రం భూమి మొత్తం కమ్యూనిస్టు ప్రభుత్వం గుప్పిట్లో వుందన్నారు. అలాంటి వారు హక్కులు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారని, చైనా పద్ధతిని భారత్ లో తీసుకురావడానికి ఇక్కడి కమ్యూనిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడి కమ్యూనిస్టులు కార్మికుల వేతనం గురించి మాట్లాడతారని, చైనాలో మాత్రం కార్మిక చట్టాల గురించి మాట్లాడితే పరిస్థితి ఘోరంగా వుందని, కార్మికులకు అత్యంత తక్కువ వేతనాలు ఇస్తారని అన్నారు. ఇక్కడి కమ్యూనిస్టుల మూలాలన్నీ చైనా నేతల ఆధీనంలోనే వున్నాయన్నారు. అడవిలో సాధు సంతులు, మునులు తపస్సులు చేసేవారని, వారు పట్టణాలకు వస్తే గౌరవించే సంప్రదాయం భారతీయ ధర్మంలోనే వుందన్నారు. అలాంటిది కొందరు నక్సల్స్ సానుభూతిపరులు మనకే పాఠాలు చెబుతున్నారని మండిపడ్డారు.
”ప్రభుత్వం మనదే.. వ్యవస్థ మాత్రం వారిది.. పాతుకుపోయారు’’ : సురేష్ కొచ్చాటిల్
అర్బన్ నక్సల్ అన్న విషయం ఎప్పటి నుంచో పాతుకొని వుందని సీనియర్ పాత్రికేయులు సురేష్ కొచ్చాటిల్ అన్నారు.అర్బన్ నక్సల్స్ గా వున్న ఆచార్యులకు ప్రొఫెసర్ అనే ఓ హోదాను సమాజం ఇచ్చేసిందన్నారు.కేరళలో చిన్నతనం నుంచే మావోలు సిద్ధాంతాన్ని రుద్దుతూ బ్రెయిన్ వాష్ చేస్తారని, చిన్నతనంలోనే కమ్యూనిస్టు నేతలను తయారు చేస్తారన్నారు. కానీ జాతీయవాదంతో నడిచే విద్యాసంస్థల్లో అలా వుండదని, దీనిపై చర్చించేందుకు కూడా సిద్ధంగా వున్నానని సవాల్ విసిరారు.రైట్ వింగ్ లో వున్నవారు కథనాన్ని నిర్మించే విషయంలో కాస్త వెనుకబడుతున్నారని అన్నారు. కానీ అదే అర్బన్ నక్సల్స్ మాత్రం కథన నిర్మాణంలో ముందంజలో వుంటారని అన్నారు. వీరంతా బయటి నుంచి చూస్తే ప్రొఫెసర్లుగా చెలామణి అవుతున్నారని, కానీ.. వారు చేసే పని వేరే అని అన్నారు. అదే ఓ స్వామీజీ వచ్చి మాట్లాడితే.. మతోన్మాది అని ముద్ర వేసేస్తారని, ఇకపై దీనికి అడ్డుకట్ట వేయాలన్నారు. ఇదో పెద్ద విషాదమని, దీనిని కౌంటర్ చేయలేకపోతున్నామని అన్నారు. కానీ కౌంటర్ చేయాల్సిందేనని సూచించారు.

ఇక అర్బన్ నక్సల్ విషయంలో మీడియా కూడా వుందన్నారు. గతంలో దూరదర్శన్ వుండేదని, ఆ తర్వాత మెళ్లిగా వామపక్షాల ప్రాబల్యం పెరిగిపోతోందన్నారు. ఎన్డీటీవీ, న్యూస్ క్లిక్ తో పాటు కొన్ని యూట్యూబ్ ఛానళ్లు కూడా వచ్చాయని, అందులో కేవలం ప్రధాని మోదీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. విమర్శించడంలో తప్పులేదు కానీ.. ఆ డిబేట్లలో వామపక్ష సిద్ధాంతాన్ని హైలెట్ చేయాలని చూస్తారన్నారు.వామపక్ష సిద్ధాంతాన్నే న్యూస్ ఐటంగా తీసుకుంటారన్నారు.అలాగే జాతీయవాదంతో నడుపుతున్న మీడియా ఛానెళ్లు ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నాయని, కానీ వామపక్ష నేపథ్యం వున్న ఛానెళ్లకు విపరీతంగా డబ్బులు వచ్చిపడతాయని పేర్కొన్నారు.
ఇక న్యాయవ్యవస్థలో కూడా వామపక్ష సానుభూతిపరులు చొరబడ్డారన్నారు. వీరందరికీ లక్షలకు లక్షలు ఎవరిస్తున్నారని ప్రశ్నించారు.అలాగే వామపక్ష మేధావులకి సంబంధించిన కేసుల విషయంలోనూ సానుభూతి చూపిస్తున్నారన్నారు. దీనికి సంబంధించిన ఉదాహరణలను కూడా ప్రస్తావించారు.ఇక.. ఈ అర్బన్ నక్సల్స్ సినిమా రంగంలోనూ తిష్ఠ వేశారన్నారు. దీనికి సంబంధించిన ఉదాహరణలను కూడా ఉటంకించారు. వామపక్షీయులు ఎంత తిష్ఠవేశారో తెలిసిపోతుందన్నారు. ఈ సందర్భంగా ఉదయ్ పూర్ ఫైల్స్ ను ఉటంకించారు. వీరందరికీ కూడా చాలా ఫండింగ్స్ వస్తున్నాయని అన్నారు. చైనా నుంచే వీరికి నిధులు వస్తున్నాయన్నారు. ఎక్కడో చైనాలో సదస్సు జరిగితే ఇక్కడి పేపర్లు దానిని కవర్ చేస్తున్నాయన్నారు.