MMRI ఆధ్వర్యంలో ‘‘ నక్సల్స్ నరమేధం – మేధోమథనం సదస్సు పార్ట్-2
చట్టాల విషయంలో మావోయిస్టులు మాట్లాడినట్లు ఎవ్వరూ మాట్లాడరని, అత్యంత మానవత్వంతో మాట్లాడతారని, అయితే.. చివరికి మాత్రం తుపాకీ గొట్టం, రాజ్యాధికారం దగ్గరికే వచ్చి ఆగిపోతుందని విద్యా భారతి జాతీయ ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ మురళీ మనోహర్ అన్నారు. తమ పోరాటం సమసమాజం కోసం అని చెబుతూ వుంటారని, అదో భ్రమ అని, అది ఎక్కడా స్థాపించలేదని ఎద్దేవా చేశారు. MMRI సంస్థ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్శిటీలోని PGRRCDE ఆడిటోరియంలో జరుగుతున్న ‘‘నక్సల్స్ నరమేధం – మేధోమథనం’’ అన్న సదస్సులో ప్రసంగించారు.
ఆపరేషన్ కగార్ ప్రారంభమైన తర్వాత శాంతి చర్చలు అన్న మాట బాగా వ్యాప్తిలోకి వస్తోందని, బుద్ధుడు, గాంధీ సమయంలోనూ ఇంత శాంతి వినబడలేదని ఎద్దేవా చేశారు. చావు సమయం దగ్గరికి వచ్చిన తర్వాత, వేరే దిక్కు లేక శాంతి చర్చలు అంటున్నారన్నారు. సమాజంలో శాంతి సమయం, యుద్ధ సమయం అని రెండే దశలు వుంటాయని, శాంతి గురించి ప్రస్తావన శాంతి సమయంలోనే జరగాలని, కానీ.. యుద్ధ సమయంలో మావోయిస్టులు, వారి సానుభూతిపరులు ఎందుకు శాంతి చర్చలు అంటున్నారని సూటిగా ప్రశ్నించారు. చావు దగ్గరికి వచ్చింది కాబట్టే శాంతి శాంతి అని వల్లెవేస్తున్నారని, కానీ సమాజం శాంతియుతంగా వున్న సమయంలో బాంబులు పెట్టి, నాన బీభత్సం సృష్టించి, అశాంతిని రేపుతారన్నారు.
గతంలో కాకతీయ ఫాస్ట్ ప్యాసింజర్ రైలు కింద బాంబు పెట్టిన తర్వాత సారీ సారీ అన్నారని, పోయిన ప్రాణాలను తెచ్చిస్తారా? అంటూ నక్సలైట్లను సూటిగా ప్రశ్నించారు.తుపాకీ ద్వారానే రాజ్యాధికారం కావాలని అంటున్నారని, మరి అంబేద్కర్ రాజ్యాంగం వద్దని చెప్పే ధైర్యం సోకాల్డ్ మేధావులకు వుందా? అని నిలదీశారు.

ప్రపంచం మారిపోతున్న పరిస్థితుల్లో రాతి యుగంలో వున్నట్లు తుపాకులు మెడలో వేసుకొని, డప్పులు కొట్టుకుంటూ, విప్లవ పాటలు పాడుతూ ప్రజలను భ్రమల్లో వుంచుతున్నారని విరుచుకుపడ్డారు. 65 ఏళ్లలో ప్రొఫెసర్ హరగోపాల్ మారలేదని, వారి చుట్టూ వున్న వ్యవస్థలూ మారలేదని ఎద్దేవా చేశారు. నక్సలైట్లు, వారి సానుభూతిపరులు మార్పుకు ఏమాత్రం సిద్ధంగా లేరని విమర్శించారు. బుద్ధుడు కూడా చెప్పలేని స్థాయిలో నక్సలైట్లు శాంతి జపం చేస్తున్నారని మురళీ మనోహర్ చురకలంటించారు.
ఆపరేషన్ కగార్ సమయంలో నక్సలైట్లు, వారి సానుభూతిపరులు శాంతి చర్చలు శాంతి చర్చలు అని పదే పదే అన్నారని, ఇప్పుడు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. గతంలో కలిసినట్లుగా జనజీవన స్రవంతిలో కలవాలని, చర్చలు బూటకమని, శాంతిచర్చలు ఓ నాటకమని ధ్వజమెత్తారు. అసలు నక్సలైట్లు ఏ హోదాలో చర్చలు జరపాలని డిమాండ్లు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం ప్రతినిధులనైనా ప్రకటించారా? అని ప్రొఫెసర్ మురళీ మనోహర్ ప్రశ్నించారు. సంపద సృష్టించిన వారిదే సంపద అని నక్సలైట్లే చెప్పారన్నారు. శాంతి చర్చల్లో వున్న బూటకాన్ని గల్లా పట్టుకొని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
సమాజంలో లేని భయాన్ని వున్నట్లు నక్సలైట్ సానుభూతిపరులు సృష్టిస్తున్నారని, గతంలో వారిష్టం వచ్చినట్లు వ్యవహారాలు చేసి, విద్యార్థులను నక్సలైట్లుగా మార్చారన్నారు. కానీ పరిస్థితి ఇప్పుడు అలా లేవన్నారు. కల్బుర్గీ, గౌరీ లంకేష్ వంటి వారిని గుర్తు చేస్తూ యువకులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.నక్సలైట్ మేధావులు ఎంత మొత్తుకున్నా ఇప్పటి యువతరం వారి మాటలు వినే స్థితిలో లేరని, నక్సలైట్లు తమను రాతియుగం వైపు తీసుకెళ్తున్నారన్న విషయం వారికి అర్థమైపోయిందని మురళీ మనోహర్ అన్నారు.
రాజ్యాంగంపై నమ్మకం లేని వారు హక్కుల గురించి మాట్లాడొద్దు: న్యాయవాది సురేందర్ రావు
ఎదుటివాడి హక్కులు ప్రారంభమయ్యేంత వరకే ప్రజాస్వామ్యంలో మరో వ్యక్తి స్వతంత్ర పరిధి వుంటుందని ప్రముఖ న్యాయవాది, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేందర్ రావు అన్నారు. ఎదుటి వ్యక్తి హక్కును హరించనంత వరకే స్వేచ్ఛగా మాట్లాడే హక్కు వుంటుందన్నారు. అంతేకానీ ప్రజాస్వామ్యంలో తనకు స్వేచ్ఛ వుంది కదా అని.. ఓ హద్దూ పద్దూ లేకుండా తన భావాలను ప్రకటిస్తానని, ఎదుటి వాడితో ఘర్షణకు దిగుతానంటే కుదరని పని అని తేల్చి చెప్పారు.

ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి హక్కులనూ పరిరక్షించే బాధ్యత ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాలపై వుంటుందని, అయితే..అయితే రాజ్యాంగ పరిధిలో వుంటేనే అది కుదురుతుందని, కానీ.. వీటిని ఉల్లంఘిస్తే మాత్రం ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందన్నారు. ఎందుకంటే ఎదుటి వ్యక్తిని కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుందన్నారు. ఎదుటి వాడి చేతిలో తుపాకులు వుండటం వల్ల ఎదుటి వ్యక్తి స్వేచ్ఛగా తన అభిప్రాయాన్ని చెప్పలేడని, అప్పుడు ప్రభుత్వం రక్షణ కల్పించాల్సిందేనన్నారు.అంతేగానీ.. తుపాకులు పట్టుకొని అడవులకు వెళ్తాం, ప్రజల్ని చంపుతాం అంటే కుదరని పని అని తేల్చి చెప్పారు. ఆర్టికల్ 19 ప్రకారం చేతిలో తుపాకులు పట్టుకోవడం తప్పు అని, ఎందుకంటే ఎదుటి వారిని బెదిరించినట్లేనని అన్నారు. పరోక్షంగా ప్రభుత్వాలను కూడా బెదిరించినట్లే అవుతుందని, అప్పుడు ప్రభుత్వాలు సైలెంట్ గా వుంటే రాజ్యాంగానికి విరుద్ధమవుతుందన్నారు. ఆర్టికల్ 250 ప్రకారం లా అండ్ ఆర్డర్ ను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై వుంటుందన్నారు.
ప్రభుత్వ విధనాలతోగానీ, ప్రభుత్వంతో గానీ విభేదించే హక్కు ప్రతి ఒక్కరికీ వుంటుందని ,అయితే.. తమను తాము రక్షించుకునే హక్కు కూడా అంతే వుంటుందన్నారు. అంతేగానీ.. తుపాకులు పట్టుకొని తిరుగుతామని, ప్రజల్ని భయపెడతామంటే కుదరని తేల్చి చెప్పారు. ఇక.. ఈ ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై కూడా వుందన్నారు. ఒక్కోసారి నక్సలైట్లకు, పోలీసులకు ఎదురు కాల్పులు కూడా జరుగుతాయని, ఈ సమయంలో తమని తాము కాపాడుకునే హక్కు పోలీసులకు కూడా రాజ్యాంగం ప్రసాదించిందన్నారు.
అయితే.. ఎన్ కౌంటర్ లు అయిపోగానే నక్సలైట్లే ఎందుకు చనిపోయారని కొందరు పదే పదే ప్రశ్నలు వేస్తుంటారని, ఎందుకంటే ప్రభుత్వం దగ్గర మౌలిక సదుపాయాలు బాగుంటాయని, ఆయుధాలు కూడా అత్యాధునికంగా వుంటాయని, ఇంటెలిజెన్స్ కూడా వుంటుందన్నారు. ఎప్పుడూ అసమానంగా వున్న వ్యక్తుల మధ్యే ఎదురు కాల్పులు జరుగుతాయి కాబట్టి, పోలీసులదే పైచేయి అవుతుందన్నారు.ఎన్ కౌంటర్ అయిన ప్రతిసారీ బాధితుల పాత్ర పోషించడం అలవాటైపోయిందని మండిపడ్డారు. తమకు రాజ్యాంగం పట్ల గానీ, పార్లమెంట్ వ్యవస్థ పట్ల గానీ, ప్రభుత్వాల పట్ల గానీ తమకు నమ్మకే లేదని చారుమజుందార్ తో పాటు చాలా మంది నక్సలైట్ నేతలు పదే పదే చెప్పారని సురేందర్ రావు గుర్తు చేశారు. అలాంటప్పుడు రాజ్యాంగం గురించి గానీ, రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల గురించి గానీ మాట్లాడే హక్కు నక్సలైట్లకు లేనే లేదని నొక్కి చెప్పారు.