గ్రామీణ ఆర్ధిక వ్యవస్థకి ఓ మోడల్ ”చిత్రకూట్ ప్రాజెక్ట్ ”….
నానాజీ దేశ్‌ముఖ్… గ్రామీణ ప్రాంతంలో స్వావలంబితాన్ని సృష్టించి, ఓ మోడల్‌ను ఏర్పర్చిన మనీషి. ఈయనకి 1978 లో జనతాపార్టీ ప్రభుత్వంలో మంత్రి పదవి వరించింది. దీనిని ఆయన సున్నితంగా తిరస్కరించారు,. గ్రామోదయ పథకాలకు శ్రీకారం చుట్టారు. దానికి భూమికగా 1972 ఆగస్టు 20న ప.పూ. గురూజీ ఢల్లీిలో దీనదయాళ్ పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించారు. దీనదయాళ్ ప్రవచించిన ఏకాత్మతా మానవ దర్శనాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ఇది తొలి ప్రయత్నం. దేశ ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను శక్తిమంతం చేయడానికి నానాజీ ప్రయత్నాలు ప్రారంభించారు. రాజకీయాలకు అతీతంగా యూపీలోని గోండా జిల్లాను దత్తత తీసుకున్నారు. ఆనాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి గ్రామోదయ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కింద గోండా జిల్లాలోని జానకీపురం అనే గ్రామానికి ఆనుకున్న వున్న చిన్న గ్రామంలో ప్రారంభించారు. జానకీపురంలో 150 కుటుంబాలు వుంటే ఆ కుగ్రామంలో 21 ఇళ్లు వుండేవి. అలా ప్రారంభమైన పని క్రమంగా జిల్లా అంతా విస్తరించింది. 98 శాతం మందికి వ్యవసాయమే అక్కడ జీవనం. ఆ జిల్లాలో 2008 గ్రామాలు, 95 వేల మంది వ్యవసాయదారులు, 2 లక్షల 50 వేల ఎకరాల భూములు సాగులోకి వచ్చాయి.
పరంపరాగత వ్యవసాయ పద్ధతులతో వ్యవసాయం సాగుతోంది. 1982 మే 22న లండన్‌కి చెందిన ప్రముఖ ఆర్థికవేత్త ఒకరు గోండా గ్రామోదయ ప్రాజెక్టును అధ్యయనం చేయడానికి వచ్చారు. మూడు సంవత్సరాలలో జరిగిన అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోయారు. అంతేకాదు ఆ అభివృద్ధిలో గ్రామీణ ప్రజల భాగస్వామ్యం ఇంకా ఆశ్చర్యం కలిగించింది. అన్నింటి కంటే ఆ ప్రాజెక్టులో అందరినీ విశేషంగా ఆకర్షించిన విషయం బోరు వేయడానికి ఉపయోగించే పైపులు ఇనుప పైపులు కాకుండా వెదురు బొంగుతో తయారు చేసిన పైపులు వాడటం. డీజిల్, విద్యుత్తు ఉపయోగించకుండా మోటార్లను నడపడానికి గాలి మరలు ఉపయోగించడం. అలా ఆ జిల్లాలో పని దేశమంతటికీ ఆదర్శం. వ్యవసాయం లాభసాటి వృత్తిగా అక్కడి ప్రజల జీవనశైలి మారిపోయింది. ఈ రోజు ఆ జిల్లా అత్యంత అభివృద్ధి చెందిన జిల్లా. గోండా ప్రాజెక్టు ప్రేరణతో జార్ఖండ్‌లోని సింగభూం ఒరిస్సాలోని సుందర్‌ఘర్ మొదలైన జిల్లాలను కూడా నానాజీ దత్తత తీసుకొని అభివృద్ధి చేశారు.
ప్రపంచాన్ని ఆకర్షించిన మరో ప్రాజెక్టు చిత్రకూట్. ఇది గిరిజనుల జిల్లా. రామచంద్రుడు 11 సంవత్సరాలు అరణ్యవాసం చేసిన పుణ్యస్థలం. అక్కడ నుంచి 50 కిలోమీటర్ల పరిధిలోని 500 గ్రామాల అభివృద్ధికి నానాజీశ్రీకారం చుట్టారు. అక్కడే మొట్ట మోదట గ్రామీణ వృత్తుల పరిశోధనకు ఒక విశ్వవిద్యాలయం కూడా స్థాపించారు. అది దేశంలోనే మొదటిది. ఈ యోజనలో పని చేసేందుకు సమాజ శిల్పి పేరుతో డిగ్రీ పూర్తి చేసిన యువదంపతులను ఎంపిక చేసుకున్నారు. ఒక జంటకు 5 గ్రామాలు దత్తత ఇచ్చారు. ఆ గ్రామాలలో ప్రజలతో మమేకమవుతూ అన్ని ప్రభుత్వ పథకాలు, మరోపక్క చిత్రకూట్ ప్రాజెక్టు ద్వారా రూపొందించిన పథకాలు సమన్వయంతో అమలు చేసేందుకు ప్రయత్నాలు చేశారు. చిత్రకూట్ యోజనలతో ప్రధానంగా వ్యవసాయం, స్వయం ఉపాధి, విద్యా, ఆరోగ్యం మొదలైన అంశాలపై పరిశోధనలను కూడా ప్రారంభించారు. సాత్నా జిల్లా కేంద్రంగా 350 ఎకరాల భూమిలో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయానికి సంబంధించిన అనేక విషయాలపై రైతులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
1. ఆహార ధాన్యాలు 2. వాణిజ్య పంటలు 3. పండ్లు 4. పశుగ్రాసం 5. పశుపోషణ లాంటి విషయాలపై శిక్షణ వుంటుంది. వీటిని చూసేందుకు దేశ విదేశాల ప్రముఖులు వచ్చిపోతుంటారు. యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ మూడు రోజుల పాటు అక్కడే వుండి అన్నీ పరిశీలించారు. ఇందులో జరుగుతున్న కొన్నింటిని యూపీకి కూడా వాడుకున్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మూడు రోజులు అక్కడే వున్నారు. ఇలాంటి పనులు భారతమంతటా జరుగుతూ… ఇంకా వేగవంతమైన సస్యశ్యామలైన భారతం, గ్రామాలు నిర్మాణం కావాలి.