మిత వ్యయం మన జీవన విధానం

కుటుంబప్రబోధన్‌

‘‌ధనమూలం ఇదంజగత్‌’ అని నానుడి. సమాజంలో ధన ప్రభావం పెరుగుతున్నదని అందరూ అంటుంటారు. కానీ ధన ప్రభావం దానంతట అదే పెరుగుతోందా? మనం పెంచు తున్నామా అని ఆలోచించాలి. కొన్ని ఖర్చులకు సిద్ధమైపోవడం, డబ్బు తగలేయడం ఇందులో భాగమవుతుంటుంది. విద్య, వైద్యం ఖర్చులు తగ్గించుకోలేం. ఉన్నత విద్యకు తప్ప ప్రాథమిక మాద్యమిక విద్య క్కూడా మనం ఎక్కువ  ఖర్చుపెడుతుంటాం. పిల్లల ప్లే స్కూల్స్ అవసరం కుటుంబ వ్యవస్థ బాగున్న రోజుల్లో ఉండేదికాదు. ఇంట్లో పెద్దలు కరువై, ఇద్దరూ ఉద్యోగస్థులైతే వచ్చే అవసరం ఇది. సామాజికంగా వస్తున్న ఈ అవసరాలను కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. పుట్టినరోజులు జరుపుతూ ఏళ్లు వచ్చినా పార్టీలు, కేకుల పేర ధనం వెచ్చించడం పెరిగిపోయింది. ప్రతి సందర్భంలోనూ కేకు కట్‌చేయడం ఈ మధ్య ఎక్కువైపోయింది. కత్తితో కట్‌ ‌చేయడం ప్రేమకు చిహ్నమా? కసికి చిహ్నమా? ఆలోచించాలి. భారీ కేకులు వాడడం, యుద్ధాలకు వాడే కత్తులు ఉప యోగించడం ఈ మధ్య వెర్రితలలు వేస్తోంది.

ఆర్‌జీవి లాంటి దర్శకులు కూడా వీటిని సామాజిక మాధ్యమాల్లో వినూతన్నమైన వీరోచితమైన చర్యగా చూపిస్తున్నారు. పుట్టిన రోజు నాడు జరుపుకుంటున్న బాలుడు, బాలిక భారీగా స్నేహితుల నుంచి బహుమతులు ఆశించడం, బహుమతులు రావాల్సిన స్థాయిలో రాకపోతే విద్వేషం పెంచుకోవడం – ఇవన్నీ పిల్లల పెంపకం, సంస్కారాలపై ప్రభావం చూపుతున్నాయి. పుట్టినరోజు నాడు ‘అమ్మకడుపు చల్లగా, అత్తకడుపు చల్లగా’ అంటూ పెద్దలు చేసే దీవెనలు ముఖ్యం కాని ఆర్భాటంగా జరిగే తంతు కాదు. అమ్మ కడుపు చల్లగానే కాక అత్తకడుపు చల్లగా అని దీవించడంలో అంతరార్థం, పిల్లో, పిల్లాడో పెరిగి పెద్దయి సంస్కారవంతులై పెళ్లి సమయానికి పిల్లాడినో, పిల్లనో ఇచ్చే అత్త కూడా చల్లటి దీవెనలతో ఎన్నో సంవత్సరాలు పెంచి పెద్దచేసిన పిల్లల్ని అప్పగించడం వరకు పిల్లల క్షేమం కోరడమనమాట. పుట్టిన రోజున మితంగా ఖర్చుపెట్టి, పిల్లతో, పిల్లడితోనో ఏదైనా సేవా కార్యక్రమం చేయిస్తే సంస్కారం గుబాళిస్తుందని మానసిక వైద్యు లంటారు. ఇంట్లో కూరలు, పళ్లు, పూలు, కిరాణా, మందులు, విద్యుత్తు, నీరు, పనిమనిషి, చాకలి, మౌలిక వసతులు, రవాణా, వినోదం, సేవ వంటి ఖర్చులకు సంబంధించిన వివరాలు రాసిపెట్టు కోవడం, అవసరమైనపుడు కుటుంబ సభ్యులకు ఆ వివరాలు తెలియజేయడం, వారిని అప్రమత్తం చేయడం ఆర్థిక భద్రతకు అవసరమవుతుటుంది.

500 రూపాయలతో పెళ్లి చేసుకున్న ఒక మహిళ, ఐఎయన్‌ ఆఫీసరు, ప్రభుత్వ ఆసుపత్రిలో పురుడుపోసుకున్న ఓ ప్రభుత్వ అధికారిణి వంటి సంఘటనలు మనం అదర్శంగా తీసుకోవాలి. డబ్బు ఖర్చుపెట్టనివారిని ‘పిసినారి’ అంటుంటారు. అవసరం మేరకు ఖర్చుపెట్టడం ఆదర్శమవుతుంది. ప్రొఫెసర్‌ అయివుండి సాధారణ వేషధారణ, జీవితం గడిపే బీహారుకు చెందిన వ్యక్తిని గూర్చి కళాశాలలో అంతా పిసినారి అనుకునేవారట. కాని ఆ ప్రొఫెసరు ఆ కళాశాలలో ఓ ప్రయోగశాల నిర్మాణానికి ధారళంగా నిధి సమర్పణ చేశాడు. సామాజిక అవసరాలు గుర్తించడమే నిజమైన ప్రతిభ. సాధారణ జీవితం గడిపిన ఆదర్శ మూర్తులెందరో మనముందున్నారు.

నిశ్చితార్ధం, పెళ్ళి సమయాల్లో హిందూ కుటుంబాల్లో పెట్టే ఖర్చు అంతాయింతా కాదు. నిశ్చితార్ధం కూడా పెళ్ళిలా జరిపే సందర్భా లుంటాయి. కడుపునిండా అన్నం తినేవరకు, ఇంటిల్లి పాదీ ఆరోగ్యంగా ఉండేంతవరకు మనం వ్యయం చేయాల్సిందే! అందుకోసం హోటళ్లలో, క్లబుల్లో, పబ్బుల్లో పడి తినడం మాత్రం సదాచారం కాదు, సంస్కారం కాదు. వాళ్లింట్లో అవన్నీ ఉన్నాయి, మనమూ కొనుక్కుందాం అని భావించి అప్పుల పాలవడం సదాచారం కాదు. భగవంతుడు అన్నీ ఇచ్చాడు అని భావించడం మిత వ్యయసాధనకు తొలిమెట్టు. ‘నాదగ్గర ఏమీ లేవు’ అనుకోవం భావదారిద్యం, అది భౌతిక దారిద్యం కంటె ఘోరమైనది. మనం జీవించడానికి తింటున్నామా? తినడానికి జీవిస్తున్నామా? మనం జీవించడానికి బట్టలు కట్టుకుంటున్నామా, బంగారం ధరిస్తు న్నామా? బంగారం ధరించడానికి బట్టలు కట్టు కోవడానికే జీవిస్తున్నామా? అని ఆలోచించాలి.

కబీరు దాసు అందరికీ తత్వాలు చెప్పేవాడు, పరమార్థాలు వివరించేవాడు. ఇంట్లో మాత్రం దరిద్రం తాండవిస్తుండేది. అయినా పరమ సంతోషంగా ఉండేవాడు. ప్రాపంచిక ధనం కన్నా పరమాత్మ అనుగ్రహమే ధనమనుకొన్నాడు. ‘అంతా నా తలరాత’ అంటుంటారు. నుదుటిరాత విభూతి రేఖలతో మారవచ్చు. ‘చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవ’ అంటుంటారు. మన కర్మఫలం మనం జీవితంలో చెడు రూపంలో మనల్ని ఇబ్బంది పెట్టడమో, మంచిరూపంలో మనల్ని ఆనంద పెట్టడమో చేస్తుంది. మన జన్మల కర్మల పాపపుణ్యా లకు భగవంతుడే సాక్షి.

– హనుమత్‌ ‌ప్రసాద్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *