జమ్మూ కశ్మీర్ శాసనసభ ఎన్నికల సన్నాహాలు ప్రారంభించాం : ప్రధాని మోదీ
జమ్మూ కశ్మీర్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలోని ప్రజలు తమ సొంత ప్రభుత్వాన్ని ఎన్నుకునే, రాష్ట్ర హోదా తిరిగి పొందే రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు. రెండు రోజుల జమ్మూ కశ్మీర్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పలు అభివృద్ధి పనులకు శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ‘‘మీరు మీ ఓటుతో మీ సొంత ప్రజాప్రతినిధిని ఎన్నుకునే రోజు’’ ఎంతో దూరంలో లేదన్నారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్‌ను నమోదు చేస్తూ.. గత 35 సంవత్సరాల రికార్డును తిరగరాయడంపై జమ్మూ కశ్మీర్ ప్రజలను ప్రధాని అభినందించారు. జమ్మూ కశ్మీర్ కి రాష్ట్ర హోదాను సైతం తాము పునరుద్ధరిస్తామని, ఇందుకు సంబంధించిన ప్రణాళికలను రూపొందిస్తున్నామని వెల్లడిరచారు. ఇక.. ఉగ్రదాడులను తమ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, శత్రువులను శిక్షించడానికి ఏ ఒక్క అవకాశాన్నీ వదిలిపెట్టమని మోదీ స్పష్టం చేశారు.