ఉగ్రవాదాన్ని అంతం చేయకుంటే.. అదే పాక్ ను అంతం చేసేస్తుంది : మోదీ

పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ ఆర్మీ కలిసి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయని, ఏదో ఒక రోజు అదే పాకిస్తాన్ ని తుడిచిపెట్టేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. పాకిస్తాన్ ప్రపంచంలో బతికి బట్టకట్టాలంటే ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులను పాక్ స్వయంగా పూర్తిగా మట్టుబెట్టాల్సిందేనని అన్నారు. శాంతి నెలకొనాలంటే ఇదే ఏకైక మార్గమని, మరో మార్గమే లేదని తేల్చి చెప్పేశారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం జాతినుద్దేశించి కీలక ప్రసంగం చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ చర్చలు, ఉగ్రవాదం రెండూ ఏకకాలంలో కుదిరే పనే కాదని, ఇదే భారత్ స్పష్టమైన నిర్ణయమని మోదీ ప్రకటించారు. అలాగే ఉగ్రవాదం, వాణిజ్యం కూడా ఏకకాలంలో నడవవని, అలాగే నీరు, రక్తం కలిసి ప్రవహించలేవని పునరుద్ఘాటించారు. ఒకవేళ పాకిస్తాన్ తో చర్చలంటూ చేయాల్సి వస్తే ఉగ్రవాదంపైనే వుంటాయని, అలాగే పీఓకేపైనే వుంటాయని మోదీ పునరుద్ఘాటించారు. అలాగే ఇది ఈ యుగం యుద్ధాలది కాదని, అలాగని ఉగ్రవాదానిది కూడా కాదని స్పష్టం చేశారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు, దాడులకూ భారత్ వెనకాడదని తేల్చి చెప్పారు. నేడు బుద్ధ పూర్ణిమ అని, బుద్ధుడు శాంతి మార్గాన్నే ప్రవచించాడని తెలిపారు. శాంతి పంథా కూడా శక్తిమంతమేనని అన్నారు.శాంతి, సమృద్ధి వైపు ప్రయాణం సాగితే, ప్రతి భారతీయుడూ శాంతితో జీవిస్తే.. వికసిత భారత కావాలంటే భారత్ శక్తిసంపన్నం కావడం అత్యావశ్యకమని మోదీ వివరించారు. అత్యవసరం అయినప్పుడు ఈ శక్తిని ఉపయోగించుకోవడం కూడా అంతే అవసరం అని నొక్కి చెప్పారు. కొన్ని రోజులుగా భారత్ ఇదే పద్ధతిని అవలంబిస్తోందని మోదీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *