భారత్ ను విశ్వగురువు చేయడంలోనే సంఘ్ సార్థకత వుంది : మోహన్ భాగవత్

భారత్ ను విశ్వగురువు చేయడంలోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సార్థకత వుందని సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. ప్రపంచంలో ప్రతి దేశం కూడా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తుందని, భారత్ ను విశ్వగురు స్థానానికి చేర్చడంలోనే సంఘ్ సార్థకత వుందన్నారు. భారత దేశ ఎదుగుదల అనే ప్రక్రియ నెమ్మదిగా జరుగుంతి కానీ, అది నిరంతరం కొనసాగుతుందన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ యాత్ర కూడా భారత్ ఎదుగుదలతోనే ముడిపడి వుందన్నారు.
సంఘ కార్యశతాబ్దిని పురస్కరించుకొని ఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో వ్యాఖ్యాన మాలా పేరుతో మూడు రోజుల సమావేశం మంగళవారం ప్రారంభమైంది. మొదట సరసంఘచాలక్ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే భారతమాత చిత్ర పటానికి పుష్పార్చన చేశారు. అనంతరం సరసంఘచాలక్ మోహన్ భాగవత్ ప్రసంగించారు.

సంఘ్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి కానీ, ప్రామాణిక సమాచారం లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. అయితే అందుబాటులో వున్న సమాచారం కూడా ఎక్కువగా అవగాహన పైనే ఆధారపడి వుంది కానీ, వాస్తవాలపై లేదన్నారు. ఈ సారి ఈ సంభాషణా కార్యక్రమం కేవలం ఢిల్లీలోనే కాకుండా, మరో మూడు ప్రదేశాలలో కూడా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. దీని ద్వారా ఎక్కువ మంది పాల్గొనే అవకాశం లభిస్తుందని, ఈ సంభాషణా కార్యక్రమంలో పాల్గొనే 70 నుంచి 75 శాతం కొత్తవారేనని అన్నారు.

“ఈ రోజు సంఘ్ 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా మళ్లీ కొత్త ఆశయాల గురించి మాట్లాడడం ఎందుకు? దానికి ఒక వాక్యంలో సమాధానం చెప్పాలనుకుంటే, మనం ప్రతిరోజూ చెప్పే సంఘ ప్రార్థన ముగింపులో “భారత్ మాతా కి జై” అని ఉంది. అంటే ఇది మన దేశం, మన దేశం అన్నింటా విజయం సాధించాలి, మన దేశం ప్రపంచంలో ముందుండాలి అని అర్థమని వివరించారు.
సమాజ కార్యం చేయడానికి ఎవరికీ సమయం లేదని డాక్టర్ హెడ్గేవార్ గ్రహించారని, అందుకే ఆయనే స్వయంగా చొరవ తీసుకున్నారని తెలిపారు. సంఘ స్థాపన అనే ఆలోచన చాలా సంవత్సరాల క్రితమే ఆయన మనసులోకి వచ్చిందని, 1925 సంవత్సరం విజయదశమి రోజున దానిని కార్యరూపంలోకి తెచ్చి, ప్రకటించారని వివరించారు. జాతి నిర్మాణం అనేది సంపూర్ణ హిందూ జాతిని ఏకం చేయడంలోనే వుందని డాక్టర్జీ బలంగా విశ్వసించేవారని తెలిపారు. ఎవరైతే తన పేరు పక్కన హిందూ అనే పదాన్ని జోడించుకుంటారో వారే దేశం, సమాజం పట్ల బాధ్యత వహిస్తాడని అన్నారు. మానవుని నిజమైన అభివృద్ధి వ్యక్తిగత పురోగతితో పాటు, సమాజ అభివృద్ధి కూడా తనదే అని నమ్మినప్పుడే సాధ్యమవుతుందన్న సూత్రాన్ని డాక్టర్జీ బలంగా విశ్వసించేవారని తెలిపారు.
హెడ్గేవార్ జన్మత: దేశభక్తుడని, కలకత్తాలో వైద్య విద్యను అభ్యసిస్తున్న సమయంలోనే అనుశీలన సమితితో అనుబంధాన్ని పెంచుకున్నారని, కోకైన్ పేరుతో పనిచేశారని పునరుద్ఘాటించారు. ఈ విషయమంతా త్రిలోక్యనాధ్, రాజ్ బిహారీ బోస్ రాసిన పుస్తకాలలో ప్రస్తావించారని ఉటంకించారు.ఈ దేశంలో హిందువులు, సిక్కులు మరియు బౌద్ధులు తమలో తాము పోట్లాడుకోరని, దేశం కోసం జీవించి త్యాగాలు చేస్తారని ఆయన అన్నారు.
మనకు భారత్‌లోని ప్రతిమూలలో కూడా నాయకుల అవసరం ఉంది. వీరు నిష్కళంకమైన వ్యక్తిత్వాన్ని కలిగి, నిరంతరం సమాజంతో అనుసంధానమై ఉండి, సమాజ విశ్వాసాన్ని పొందినవారై, సమాజం కోసం జీవించేందుకైనా, మరణించేందుకైనా సిద్ధంగా ఉండాలి. విశ్వకవి రవీంద్రులు స్వదేశీ సమాజ్ అనే వ్యాసంలో దీని గురించి విస్తృతంగా రాశారు.” అని పేర్కొన్నారు. హిందూ అనే పదం బయటికి కనిపించే చిహ్నం కాదని, విస్తృత మానవ శాస్త్రానికి సంబంధించిన దృక్పథమని మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. వ్యక్తి, సమాజం, విశ్వం అనే మూడింటితో భారత సంప్రదాయం అనుసంధానించబడి, ప్రభావితమైన వుందని మోహన్ భాగవత్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *