సనాతన ధర్మం పాటించే వారు మార్గదర్శకులుగా వుండాలి : మోహన్ భాగవత్
తిరుపతిలోని ఆశా కన్వెన్షన్ హాలులో సోమవారం సాయంత్రం ప్రారంభమైన అంతర్జాతీయ ఆలయాల సదస్సు, ప్రదర్శన (ఐటీసీఎక్స్)-2025 సదస్సుకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ – ఆరెస్సెస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ వీడియో సందేశాన్ని పంపించగా… ప్రధాని మోదీ లేఖ ద్వారా తన సందేశాన్ని పంపారు.
ఈ వేదిక కృషి అభినందనీయం
ఆరెస్సెస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ పంపిన వీడియో సందేశంలో ‘దేవాలయాల పునర్నిర్మాణానికి ఐటీసీఎక్స్ కృషి అభినందనీయం. ప్రాచీన కాలం నుంచి సనాతన ధర్మం అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఈ ధర్మాన్ని పాటించే వ్యక్తులు సమాజానికి మార్గదర్శకులుగా ఉండాలి. ఐటీసీఎక్స్ ఈ దిశగా మంచి శిక్షణ ఇవ్వాలి’ అని పిలుపునిచ్చారు. దేవాలయాలు సామాజిక, సాంస్కృతిక, విద్య, ఆధ్యాత్మిక, ఆర్థిక కేంద్రాలుగా పరిఢవిల్లాయని గుర్తుచేశారు.
ఆలయాలు జ్ఞాన కేంద్రాలు ప్రధాని మోదీ సందేశం
ఆలయాల క్షేత్రమైన తిరుపతిలో ఐటీసీఎక్స్ నిర్వహించడం శుభపరిణామమని, ఇదే సరైన వేదిక అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. లేఖ ద్వారా పంపిన సందేశంలో ‘సాహిత్యం, కళలు, వాస్తుశిల్పం.. జాతి నిర్మాణంలో భాగం. ఆలయాలు జ్ఞాన కేంద్రాలు. భారతదేశ నాగరికత, సంస్కృతి బలమైనవి, ఉన్నతమైనవని. ప్రపంచానికే ఆదర్శవంతమైనవి. ఐటీసీఎక్స్ సదస్సు సుహృద్భావ వాతావరణాన్ని పెంపొందిస్తుంది’ అని అభిప్రాయపడ్డారు.