మన పద్ధతులు, జీవన పద్ధతులతోనే ప్రపంచానికి సారథ్యం వహిస్తాం : మోహన్ భాగవత్
ఢిల్లీకి చెందిన శ్రీ విశ్వ నికేతన్ ట్రస్ట్, భాగ్యనగర్ (హైదరాబాద్) సమీపంలోని ప్రశాంతమైన, విశాలమైన కన్హా శాంతి వనంలో 7వ విశ్వ సంఘ్ శిబిరాన్ని (VSS) నిర్వహిస్తున్నది. ఐదు రోజుల ఈ ప్రపంచ స్థాయి సమ్మేళనానికి అన్ని ఖండాలలోని 79 దేశాల నుండి 1,610 మంది కార్యకర్తలు, స్వయంసేవకులు, ప్రతినిధులు హాజరయ్యారు. ముగింపు ఉత్సవానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మెహన్ భాగవత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా భాగవత్ మాట్లాడుతూ…
‘‘ధర్మం తప్పడం వల్ల ఏర్పడిన అసంతులనం వల్ల అతివాదం ప్రబలింది. చరిత్ర గతి తప్పింది. కరుణను మరిచిపోయాం.దీంతో అన్ని సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. వీటన్నింటినీ తిరిగి సంపాదించాలని అనుకుంటున్నారు. ఈ చర్చ సర్వే సర్వత్రా వున్నదే. మనం కూడా చేస్తున్నాం. మరి ఇది ఎలా జరగాలి?
కోలంబస్ అమెరికాను కనుగొన్నారని అంటారు. నిజమా? అబద్ధమా? అన్న చర్చలోకి వెళ్లడం అవసరం లేదు. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత రాజు ఇతడి కోసం సన్మాన సభ పెట్టారు. మేధావులు కూడా వచ్చారు.అయితే… ఈ సమయంలో కొలంబస్ పై ఇతరులకు అసూయ కలిగిందని, ఈ విషయం రాజు గారికి తెలిసింది. అప్పుడు వారందరకీ ఓ పని అప్పజెప్పారు. కోడి గుడ్డును ప్రకృతి నియమానికి విరుద్ధంగా నిలబెట్టి చూపించాలని ఆదేశించారు. అందరూ ఆశ్చర్యపోయారు. ఇది ఎలా కుదురుతుందని ఎవ్వరూ ముందుకు రాలేదు. ఈ సమయంలో కోలంబస్ ముందుకు వచ్చి, దానిని పగలగొట్టి, అప్పుడు నిలబెట్టాడు. అప్పుడు.. మిగతా మేధావులు.. ఇలా చిన్న పిల్లవాడు కూడా చేస్తాడు.అని చెప్పగా.. మరి మీరెందుకు చేయలేదని రాజు ఎదురు ప్రశ్న వేశారు. ఎవ్వరూ చేయలేనిది కొలంబస్ చేసి చూపించారన్నారు. ఇవన్నీ జరగాల్సిందే. కానీ ఎవరు చేయాలి? పిల్లి మెడలో గంట కట్టాలని ఎలుకలు అనుకున్నాయి. దీని ద్వారా పిల్లి పరిగెత్తితే.. దాని ద్వారా గంట మోగుతుందని, దీని ద్వారా మనం పారిపొవచ్చని అనుకున్నాయి. కానీ.. ఇప్పటి వరకూ ఎవ్వరూ పిల్లి మెడలో గంట కట్టలేదు. అందుకే పిల్లి మెడలో గంట కట్టడం ఇప్పటికీ సాధ్యపడలేదు.

కానీ.. దేశంలో ఏ కార్యాలైతే జరగాల్సి వున్నాయో.. అవి తన నుంచే ప్రారంభం కావాలని డాక్టర్ హెడ్గేవార్ తలపోశారు. తమ నుంచే కార్యాలు ప్రారంభించే వ్యక్తులను తయారు చేయాలని భావించారు. అందుకే సంఘ స్వయంసేవకులు అవుతారు.వారు వారి నుంచే పనులను ప్రారంభిస్తారు. సేవా తత్పరతతోనే పనులు చేస్తారు. ‘‘శివ భావే జీవ సేవ’’ అని రామకృష్ణ పరమహంస సేవ అన్న భావనకు అర్థాన్ని నిర్వచించారని అన్నారు.
సేవను అనేక రకాలుగా చేస్తారు, స్వార్థం కోసం కూడా సేవ చేస్తారు. ప్రతి ఐదు సంవత్సరాలకోసారి సేవ చేసే వారు వరదలా వస్తారు. ప్రతి ఇంటికీ తిరుగుతూ తమకు సేవ చేసే అవకాశం కల్పించాలని పరిపరి విధాలుగా ప్రజలను ప్రార్థిస్తారు. ఆ తర్వాత మళ్లీ ఐదు సంవత్సరాలకు గానీ కనిపించరు. సేవ అంటూ ప్రతిఫలం లభించాలని కాంక్షిస్తారు వారు. దీనిని సేవ అనరు. ప్రతిఫలాపేక్ష అంటారు దీనిని. ఎర్ర లైట్ సిగ్నల్ దగ్గర పోలీసులు నిలబడితే… ఆగుతారు కొందరు. లేదంటే దాటి వెళ్లిపోతారు. మనం చూస్తుంటాం. పోలీసులు లాఠీ పట్టుకొని నిలబడితేనే.. సిగ్నల్ పాటిస్తాం. ఇది కూడా సేవ కాదు. ఇది భయభీతి. మరి కొన్ని సార్లు కొందరు బలవంతంగా సేవ చేస్తారు. ఇది కూడా సేవ అనిపించుకోదు. మరి కొందరు సేవ చేస్తారు కానీ.. పేరును ఆశిస్తారు. ఇతరులకు చూపించడానికి సేవ చేస్తారు కొందరు. ఇదంతా అహంకారం. సేవ చేసే వారు కేవలం సేవ కోసమే సేవా కార్యక్రమం చేస్తారు. సేవ ద్వారా తన పాపం ప్రక్షాళన అవుతుందని మరి కొందరు భావిస్తారు. సేవ ఓ పవిత్ర కర్తవ్యం, దీని బదులు ఏమీ వద్దు అని కొందరు భావిస్తారు. ప్రామాణికతతో, నిస్వార్థంగా, ఏమీ ఆశించకుండా చేసేవారు వుంటారు. సేవే తన పరమావధిగా చేసే వారుంటారు. వారే స్వయంసేవకులు.
సంఘం పెరుగుతూ వుంటే స్వయంసేవకులు కూడా పెరుగుతుంటారు. కొందరు స్వయంసేవకులు విదేశాలకు కూడా వెళ్లారు. కానీ.. వారు తమ వ్రతాన్ని మాత్రం మరిచిపోలేదు. హిందూ దేశ సర్వాంగీణ ఉన్నతిని కానీ, హిందూ ధర్మ సంరక్షణను కానీ మరిచిపోలేదు.

ఇతర దేశాల్లో వున్న వారందరూ మన మన చరిత్రను, మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని, మన ఆచరణ చేస్తున్న పద్ధతులను చూసి, ఎలా జీవించాలో నేర్చుకోవాలి’’ అలా మనం బతకాలని మన పూర్వీకులు నిర్దేశించారు. ఇలాంటి ఉదాహరణను ప్రపంచం ముందు వుంచి, ప్రపంచంలోని ప్రతి మూలనా ధర్మాన్ని ప్రతిష్ఠ చేయాలి. మనం ప్రపంచానికి నేతృత్వం వహిస్తాం. కానీ మన మన పద్ధతుల ద్వారానే ఈ నేతృత్వం వహిస్తాం. ఇదే మన పద్ధతి కూడా . మన సైనిక శక్తిని ప్రదర్శించో, మన ఆర్థిక వ్యవస్థ ద్వారా ఇతరులను అణగదొక్కో ఎదగాలని భావించం. మన జీవన పద్ధతుల ద్వారానే నేతృత్వం వహిస్తాం. మన జీవన పద్ధతులను ప్రపంచం ముందు వుంచుతాం.
విశ్వవిభాగ్ కి సంబంధించిన మొట్ట మొదటి ద్వితీయ వర్ష వర్గ బెంగళూరులో జరిగింది. విదేశాల్లో పుట్టిన, అక్కడే పెరిగిన స్వయంసేవకులు 34 మంది వచ్చారు. వారి ముందు భేడేజీ ఓ ప్రస్తావన తెచ్చారు. హిందూ స్వయంసేవక్ సంఘ్ ద్వారా హిందువులు విదేశాల్లో సంఘ పనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘ శాఖలు విదేశాల్లో ఎక్కడైనా నడవొచ్చు అని మొదటి తరం నిర్ణయించింది. ఇదే కార్య పద్ధతి ప్రతి దేశ కాల, మాన పరిస్థితుల్లో నడవొచ్చని నిర్ణయించారు. ఆ తర్వాత రెండోతరం వచ్చింది. విదేశాల్లో వున్నా.. భోగమయ జీవితం మధ్యలో నివసిస్తున్నా.. దురలవాట్లకు దూరంగా వుంటూ నిత్య శాఖకు వెళ్లాలని నిశ్చయించుకున్నారు.
ఇప్పుడు మూడో తరం వారు ఇక్కడ కూర్చున్నారు. ఆయా దేశాల ప్రజలు తమకు కూడా ఓ హిందూ స్వయంసేవక్ సంఘ్ లాంటి స్వయంసేవక్ సంఘ్ వుండాలనుకునే విధంగా మెలగాలి. అంతటి బృహత్తర బాధ్యత మీ భుజ స్కంధాలపై ఇప్పుడు పడింది. ఎందుకంటే తమకు కూడా ఇలాంటి జీవన పద్ధతి వుండాలని భావించేలా. భారత్ లో ఎలాగైతే సంఘ్ కార్యం వుందో, అచ్చు అలాంటి సంఘటనే, అలాంటి జీవన విధానమే తమకు కూడా వుండాలన్న చర్చ తీవ్రమవుతోంది. ఇది మనకు వినిపిస్తూనే వుంది. భారత్ లో వున్న స్వయంసేవకులు వారి లాగా జీవించడానికి, వారి జీవన పద్ధతులను తమకు కూడా నేర్పిస్తారా? మాకూ శిక్షణ ఇస్తారా? అని అడుగుతున్నారు. ఈ చర్చ సాగుతోంది. అలాంటి వారికి హిందూ స్వయంసేవక్ సంఘ్ అని ఓ సంస్థ వుందని, దాని ద్వారా శిక్షణ పొందాలని మీరు వారందరికీ చెప్పాలి.’’ అని పిలుపునిచ్చారు.
ఇక.. ముఖ్య అతిథిగా విచ్చేసిన భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ భారత్ లో జరగాల్సిన ఆవిష్కరణల గురించి మాట్లాడారు. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ ను ‘‘సత్యానికి చిహ్నం’’ గా అభివర్ణించారు. భారత ప్రజాస్వామ్యాన్ని సంస్థలకు అతీతంగా అర్థం చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యం కంటే పెద్దది భారత్ అని, ఇక్కడ స్వేచ్ఛగా మాట్లాడవచ్చు, ఏదైనా చర్చింవచ్చని, అయినా.. ధర్మంలోనే వుండొచ్చని తెలిపారు. ఇతర దేశాలపై దాడులకు దిగొద్దని భారత్ నిర్ణయించుకుందని, ఈ నిర్ణయం నాగరికత, సాంస్కృతిక లోతుల నుంచి వచ్చిందన్నారు. వసుధైక కుటుంబకం అన్న సూత్రాన్ని భారత్ ఆవాహన చేసుకుందని తెలిపారు. ‘‘మన సంస్కృతి, అంతర్గత గొప్పదనం కారణంగానే మనం ఇతరులపై దాడులకు దిగలేదు’’ అని వివరించారు.

గతంలో అమ్మమ్మ నానమ్మల ద్వారా మన సంస్కృతి గురించి, మంచి విషయాల గురించి నేర్చుకునేవారమని, ఇప్పుడు అది తగ్గిపోయిందని హార్ట్‌ఫుల్‌నెస్ మూవ్‌మెంట్ అంతర్జాతీయ ఆధ్యాత్మిక మార్గదర్శి పూజనీయ శ్రీ దాజీ అన్నారు. వారి మేధస్సును వచ్చే తరాలకు పంచకపోతే, పరిజ్ఞానం కనుమరుగయ్యే అవకాశం వుందని ఆవేదన వ్యక్తం చేశారు. మన సంస్కృతే మనకు అతి పెద్ద సంపద అని, అలాంటి సంపదను తుడిచేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని, దీని ద్వారా హిందువులను ఛిన్నాభిన్నం చేసే ప్రయత్నాలు సాగుతున్నాయని వివరించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనందరి బాధ్యత మరింత పెరిగిందని, మన సంస్కృతి, ధర్మం గురించి అందరికీ చెప్పాలని సూచించారు.
ఆత్మ పరమాత్మలో కలిసిపోతే పరమాత్మే అవుతారని కబీర్ చెప్పారని, కైవల్యం గురించి జైనిజం కూడా బోధిస్తుందని, నిర్వాణ అంటూ బుద్ధిజం కూడా చెబుతుందని, కృష్ణుడు కూడా గీతలో చెబుతారని గుర్తు చేశారు. పతంజలి కూడా ధ్యానం గురించి చెబుతారని, కానీ ధ్యానం ఎలా చేయాలో చాలా మంది తటపటాయిస్తుంటారన్నారు. మన చేతనావస్థను పెంచేదే ధ్యామని, అసలైన జ్ఞానం ఏదైతే వుందో, అటువైపు ప్రయాణింపజేసేదే ధ్యానమని వివరించారు.
ఇదే విషయాన్ని వశిష్ఠుడు కూడా శ్రీరాముడికి బోధించారని, ఇలాంటి అత్యుత్తమ జ్ఞాన సంపదను భారత్ ప్రపంచానికి ఇచ్చిందని, అదే వశిష్ఠ సంహిత అన్న పేరుతో వుందని, దీనిని అందరూ అధ్యయనం చేయాలని సూచించారు. అత్యున్నతమైన స్థితిని వర్ణించడంలో, చెప్పడంలో సైన్స్ కూడా విఫలమైందన్నారు.