వ్యవసాయంలో స్వావలంబన, ఆధునికత అత్యావశ్యకం : మోహన్ భాగవత్
ఆధునిక సాంకేతికత, పశుపోషణతో పాటు మిశ్రమ వ్యవసాయాన్ని చేయడం ద్వారా రైతులు మరింత ప్రయోజనాలు పొందుతారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ సూచించారు. ప్రస్తుతం ప్రపంచంలో అనిశ్చితులు, సవాళ్లను పరిగణనలోకి తీసుకొంటే మాత్రం వ్యవసాయ రంగంలో స్వావలంబన సాధించడం చాలా అవసరమని నొక్కి చెప్పారు.పశు వైద్య ప్రతిష్ఠాన్ 28వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఛత్రపతి శంభాజీనగర్‌లోని తపాడియా నాట్య మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు.
ఈ సందర్భంగా, వెటర్నరీ సైన్స్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను మరియు వివిధ రంగాలలో విశేష కృషి చేసిన వారిని మోహన్ భాగవత్ సత్కరించారు.
ఈ సందర్భంగా మోహన్ భాగవత్ మాట్లాడుతూ.. చికిత్స సమయంలో మాట్లాడలేని వారు, తట్టుకోలేని వారు, కనీసం వారి బాధను కూడా సరిగ్గా వ్యక్తం చేయలేని వారి స్థితిని మనం అర్థం చేసుకొని, వారికి ఉపశమనం కలిగించే కళ వైద్యుడి దగ్గర వుందన్నారు. దేశీయ పశు సంపదపై, సంప్రదాయ వ్యవసాయ పద్ధతులపై ప్రజల్లో విశ్వాసం బాగా పెరుగుతోందని, అయితే.. వ్యవసాయ రంగాన్ని ఆధునికత మాధ్యమంగా అభివృద్ధి చేయడం ద్వారా మాత్రమే స్వావలంబన దిశగా పయనించగలమని అన్నారు.