విద్య, ఆరోగ్య సదుపాయాలను సులభతరం చేయాలి : మోహన్ భాగవత్
ఆరోగ్యం, విద్య సమాజానికి ప్రాథమికమైన అవసరాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. జ్ఞానాన్ని సంపాదించడానికి విద్య చాలా అవసరమని, ఆ జ్ఞానాన్ని పొందడానికి ఆరోగ్యకరమైన శరీరం అవసరమని సూచించారు.దురదృష్టవశాత్తూ, మంచి ఆరోగ్యం మరియు నాణ్యమైన విద్య ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో లేదని, గతంలో, వీటిని సేవ మాధ్యమం కింద భావించేవారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం విద్య, ఆరోగ్యం రెండూ వాణిజ్యం కిందికి వెళ్లిపోయాయని అన్నారు. ఇండోర్ లో శ్రీ గురూజీ సేవా న్యాస్ మాధవ్ సృష్టి కేన్సర్ కేర్ సెంటర్ ప్రారంభోత్సవంలో మోహన్ భాగవత్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యమైన విద్య కోసం విద్యార్థులు తరుచుగా చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుందని, అధునాతన వైద్య చికిత్స కోసం రోగులు పెద్ద పెద్ద నగరాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. సరసమైన, సులభంగా అందుబాటులో వుండే ఆరోగ్య సంరక్షణ ఇప్పుడు అత్యావశ్యకమని నొక్కి చెప్పారు. వైద్య చికిత్స ఆందోళనకు మూలంగా మారకూడదని, దానిని సులభతరం చేయాలన్నారు. మనం చేస్తున్న ప్రతి పనీ సేవ అని, సేవలో సాధికారిత పొందిన వారి జీవితాల్లో ఇదే భావన వుంటుందని, ఇదే ధర్మమని వివరించారు. సమాజ ఆనందమే తమ ఆనందమన్నట్లుగా జీవిస్తుంటారని అన్నారు.ఆరోగ్య సంరక్షణలో చాలా సేవా కార్యక్రమాలు ఉదాహరణలుగా నిలుస్తున్నాయని, సగంలో సగం రోగాలు మాట్లాడటం వల్లే నయం అవుతాయని, కేన్సర్ చికిత్సలో మాత్రం ధైర్యమే ప్రధాన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

వైద్య చికిత్సలు అతి తక్కువ ధరలకే ప్రజలకు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. శ్రీ గురూజీ సేవా న్యాస్ మాధవ్ సృష్టి కేన్సర్ కేర్ సెంటర్ లో అన్ని రకాల చికిత్సలూ ఒకే చోట అందుబాటులో వున్నాయని, నిరంతరంగా సేవలు చేయడం ప్రశంసనీయమని అన్నారు. సేవలు అందుకునే వారు, సేవా ప్రదాతలుగా మారాలని పిలుపునిచ్చారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శాఖను మాత్రమే నడుపుతుందని, మిగిలిన కార్యక్రమాలన్నీ స్వయంసేవకులు మాత్రమే చేస్తారన్నారు.
చిన్ననాటి సంగతులను గుర్తు చేసిన మోహన్ భాగవత్
‘‘ నా చిన్నతనంలో నాకు ఓ సారి మలేరియా సోకింది. మూడు రోజుల పాటు పాఠశాలకు వెళ్లలేదు. మా టీచర్ మా ఇంటికి వచ్చారు. నన్ను సందర్శించాడు. అడవిలోకి వెళ్లి, ఔషద మూలికలను సేకరించి, నాకు చికిత్స చేశారు. ఈ ఘటన నిజమైన ఉపాధ్యాయత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఉపాధ్యాయుడు కేవలం విద్య గురించి మాత్రమే కాకుండా విద్యార్థి శ్రేయస్సు కోసం కూడా పాటుపడాలన్నది చూయించారు.’’ అని గుర్తు చేసుకున్నారు.నేటి సమాజంలో ఆరోగ్య సంరక్షణ అనేది అత్యావశ్యకమని,ఈ కార్పొరేట్ యుగంలో విద్య వ్యాపార కేంద్రంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాధులు ఎప్పటికీ వుంటాయని, మానవాళి నశించినప్పుడే అవి కూడా అంతమవుతాయని అన్నారు.