అసమానతలు తొలగే వరకు రిజర్వేషన్లు కొనసాగాలి – ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్
మనిషికి పరిపూర్ణత్వం రావాలంటే విద్య చాలా అవసరమని, అందరికీ ఇది అత్యావశ్యకమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘ చాలక్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. విద్య అంటే కేవలం బయటి జ్ఞానం మాత్రమే కాదని, లోపలి జ్ఞానం కూడా తెలుసుకునేంతగా ఎదగాలన్నారు. హైదరాబాదు నాదర్గుల్ లో విద్యాభారతి ఆధ్వర్యంలో నిర్మించిన విద్యాభారతి విజ్ఞాన కేంద్రం పేరుతో ఇంటర్నేషనల్ స్కూల్ ను మోహన్ భాగవత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మాతృ భాషలో విద్య చాలా అవసరమని, ఈ విద్యను జ్ఞానం కోసం ఉపయోగించుకోవాలని సూచించారు. విద్యను జ్ఞానం కోసం వినియోగిస్తూ.. ధనాన్ని దానం కోసం ఉపయోగించాలని, కండ బలాన్ని దేశం కోసం వినియోగించాలని సూచించారు.
ఇక రిజర్వేషన్ల విషయంలో ఆరెస్సెస్ పై చేస్తున్న విష ప్రచారంపై స్పందించారు. రిజర్వేషన్ల విషయంలో ఆరెస్సెస్ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. వాటిని తాము పూర్తిగా సమర్థిస్తున్నామని, అసమానతలు తొలిగే వరకూ కొనసాగాలని తేల్చిచెప్పారు. స్వార్థం కోసమే సంఘ్ పై ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారన్నారు. వివాదం లేపి, లబ్ధి పొందాలని చూస్తున్నారని, వివాదంతో తమకు సంబంధం లేదన్నారు. పిల్లలకు విద్యతో పాటు వివేకం నేర్పించి, లోకకల్యాణం గురించి వివరించాలన్నారు. విశ్వమంతా తమ కుటుంబమనే భావనతో వుండాలని,మనం విశ్వ గురువు గురించే మాట్లాడుతుంటామని గుర్తు చేశారు. పాఠశాల నిర్మాణంలో నిస్వార్థంగా సేవలందించి అందరికీ మోహన్ భాగవత్ ధన్యవాదాలు ప్రకటించారు.