ఇళ్లల్లో మాతృభాష, సంస్కృతం వాడకం తగ్గుతోంది : మోహన్ భాగవత్ ఆందోళన
భక్తి అనే ప్రక్రియ మానవాళిని విశ్వంతో అనుసంధానించే ఆధ్యాత్మిక సత్యమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. భక్తి లేకుండా జ్ఞానం, కర్మ అనేవి శ్రేష్ఠమైనవి కానేకావన్నారు. నాగపూర్‌లోని సైంటిఫిక్ ఆడిటోరియంలో జరిగిన సంత్ జ్ఞానేశ్వర్ రాసిన జ్ఞానేశ్వరి ఆంగ్ల ప్రతి విడుదల కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా మోహన్ భాగవత్ మాట్లాడుతూ భక్తి లేని కర్మ పిచ్చితనం అని, అందుకే జ్ఞానం అనేది కర్మ, భక్తిని ఆధారం చేసుకొని వుండాలని అన్నారు.భక్తి పక్షి అయితే అందులో ఓ రెక్క జ్ఞానం, మరో రెక్క కర్మ అని వివరించారు. భక్తి, జ్ఞానం, కర్మ ఐక్యత ద్వారానే పరమపదం ప్రాప్తమవుతుందని తెలిపారు.
భారత్‌లోనే సత్యాన్వేషణ ప్రారంభమైందని, విశ్వం మొత్తం దేవుని ప్రతిరూపమని, ప్రతిదీ దేవుడే అన్న సందేశాన్ని రుషులు, సాధు సంతులు తరతరాలుగా అందిస్తూనే వున్నారని గుర్తు చేశారు. దైవత్వం అనేది వివిధ రూపాల్లో వ్యక్తమవుతుందని, దేవుడు ఒక్కడా? అనేకుడా? అన్న చర్చ చేయమని, దీనికి బదులుగా ప్రతి దానిలోనూ ఈశ్వరత్వాన్ని చూస్తామని అన్నారు.