సమాజకార్యమే సంఘకార్యం…
ప్రపంచశక్తిగా, విశ్వగురు స్థానం దిశగా దూసుకుపోతున్న ఒక జాతిలో స్ఫూర్తిని నింపుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్) శతాబ్ది సందర్భంగా ఆంగ్ల వారపత్రిక ఆర్గనైజర్, హిందీ వారపత్రిక పాంచజన్య, మరాఠీ వారపత్రిక వివేక్, మలయాళ దినపత్రిక జన్మభూమి నిర్వహించిన ముఖాముఖిలో సంఘ్ పరంగా అడిగిన అంశాలకు సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ తెలియజేసిన అంశాలివి.
మీరు సంఘ స్వయంసేవక్‌గా, సర్‌సంఫ్‌ు చాలక్‌గా సంఘ 100 సంవత్సరాల ప్రయాణాన్ని ఎలా చూస్తారు?
డాక్టర్ హెడ్గేవార్‌జీ ఎంతగానో ఆలోచించి, పరిస్థితులను అర్థం చేసుకొని సంఘకార్యాన్ని ఆరంభించారు. దేశం ముందున్న సమస్యల పరిష్కారానికి ప్రయోగాలు చేసి ఒక ఔషధాన్ని కనిపెట్టారు. ఆ ఔషధం అద్భుతంగా పని చేసింది. ప్రణాళికాబద్ధంగా సంఘ పనులు జరిగిపోతుం టాయి. సంఘం తాను వెళుతున్న దారిలో ఎదురైన అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు సాగు తుంటుంది. సంఘం ఇలాంటి ఒక స్థితికి చేరు కోవడానికి 1950 దాకా సమయం పట్టింది. ఆ తర్వాత సంఘం దేశమంతటా విస్తరించింది. అప్పటి నుంచే స్వయంసేవకులు సమాజంతో మమేకం కావడం మొదల్కెంది. ఆ తర్వాత నాలుగు దశాబ్దాల వరకు స్వయంసేవకులు సామాజిక జీవనంలోని వేర్వేరు క్షేత్రాల్లో కర్తృత్వంతో, తమదనే భావంతో, సౌశీల్యంతో పనిచేస్తూ సమాజ విశ్వాసాన్ని చూరగొన్నారు. 1990 తర్వాత ఆ భావజాలం, గుణ సంపద ఆధారంగా దేశాన్ని ముందుకు నడిపించ వచ్చని చేసి చూపించారు. ఇప్పుడు ముందున్న పని ఏమిటంటే, ఈ గుణ సంపదను, భావజాలాన్ని స్వీకరించడం ద్వారా మొత్తం సమాజం అన్ని విభేదాలను విస్మరించి నిజాయితీతో, నిస్వార్థంతో సమాజంకోసం పని చేస్తూ గొప్ప దేశంగా మార్చడం.
ఈ 100 సంవత్సరాల ప్రయాణంలో ముఖ్యమైన మైలురాళ్లు ఏవి?
ఒకప్పుడు సంఘం దగ్గర ఏమీ లేదు. భావజాలానికి గుర్తింపు లేదు, ప్రచార సాధనాలు లేవు, సమాజంలో నిర్లక్ష్యం, వ్యతిరేకత మాత్రమే ఉన్నాయి. కార్యకర్తలు కూడా లేరు. ఈ సమాచారాన్ని కంప్యూటర్‌లో నమోదు చేస్తే, ఇది పుట్టిన వెంటనే అంతమైపోతుందనే భవిష్యవాణి చెబుతుంది. కానీ దేశ విభజన సమయంలో హిందువులను రక్షించడంలోనూ, సంఘంపై నిషేధం విధించిన సమయంలోనూ ఎదురైన కఠినమైన సవాళ్లను సంఘం విజయవంతంగా తట్టుకొని నిలబడిరది. సంఘ పని కొనసాగుతుందని, సంఘం వృద్ధి చెందుతుందని 1950 నాటికే నిరూపితమైంది.
ఈ పద్ధతిలో హిందూ సమాజాన్ని సంఘటితం చేయవచ్చునని అనిపించింది. సంఘం మునుపటి కంటే మరింతగా విస్తరించింది. సంఘం శక్తి ప్రాముఖ్యం 1975 నాటి అత్యవసర పరిస్థితి సమయంలో సంఘం పోషించిన పాత్ర వలన సమాజం దృష్టికి వచ్చింది. అలాగే, ఏకాత్మతా రథయాత్ర, కశ్మీర్, శ్రీరామ జన్మభూమి ముక్తి ఉద్యమం, వివేకానంద 150వ జయంతి వంటి కార్యక్రమాలతో పాటుగా సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్న కారణంగా సంఘం పట్ల, సంఘ భావజాలం పట్ల సమాజంలో ప్రబలమైన విశ్వాసం బాగా విస్తరించింది.
సంఘం భౌగోళికంగా, సంఖ్యాపరంగా వృద్ధి చెందుతూనే ఉన్నప్పటికీ నాణ్యమైన పని చేయడంలో, స్వయంసేవకులకు మంచి ప్రశిక్షణ ఇవ్వడంలో సంఘం విజయవంత మైంది. దీనికి కారణాలు ఏమిటి?
నాణ్యత, సంఖ్యపరంగా చూసినప్పుడు మీరు సంఖ్యను కాకుండా నాణ్యతను మాత్రమే పెంచితే లేదా నాణ్యతను కాకుండా సంఖ్యను మాత్రమే పెంచితే, పెరిగిన నాణ్యత లేదా పెరిగిన సంఖ్యను నిలబెట్టుకోవడం సాధ్యం కాదు. దీన్ని అర్థం చేసుకున్న సంఘం మొదట్నుంచీ యావత్ సమాజాన్ని సంఘటితం చేయడంపైన దృష్టి పెట్టింది. కానీ సంఘటితం చేయడానికి కూడా ఒక అర్థం ఉంది. ఒక వ్యక్తిని ఎలా సిద్ధం చేయాలి, ఇలా సిద్ధమైన వ్యక్తులను ఎలా ఉంచాలి, ‘మనం’ అనే భావన ఎలా ఉండాలి అనే దానిపై ఇప్పటికే కొన్ని ప్రమాణాలు ఏర్పడినాయి.
మనం ఈ ప్రమాణాలను ఉల్లంఘించకుండా, ప్రమాణాల విషయంలో రాజీపడకుండా సంఖ్యను పెంచాలి. దీని అర్థం వ్యక్తులను సంఘానికి దూరంగా ఉంచాలని కాదు. ఒక పెద్ద సంస్థ ప్రారంభమైననాటి ఉదాహరణ ఒకటి చెబుతాను. సోషలిస్టు భావజాలంతో ఉన్న ఒక వ్యక్తి ఆ సంస్థకు కార్యకర్త అయ్యాడు. అతడికి సిగరెట్లు కాల్చే అలవాటు ఉండేది. అతడు మొదటిసారిగా అభ్యాస వర్గకు వచ్చాడు. సిగరెట్ల సంగతి పక్కన పెడితే అక్కడ సుపారి నమిలేవాళ్లు కూడా ఎవరూ లేరు. అతడు రోజంతా కిందామీదా పడ్డాడు. రాత్రి పడుకున్నాడన్న మాటే కానీ నిద్ర పట్టడంలేదు. సరిగ్గా అప్పుడే ఆ సంస్థ మంత్రి వచ్చారు. నిద్ర పట్టకపోతే కాసేపు అలా బయట తిరిగి రండి అని అతడితో అన్నారు. మంత్రి అతడితో కొద్ది దూరం నడిచిన తర్వాత దగ్గర్లో ఉన్న కూడలిలో సిగరెట్లు దొరుకుతాయని చెప్పారు. మీకు కావలసి నన్ని సిగరెట్లు తాగి తిరిగి రండి అని తెలిపారు. వర్గలో సిగరెట్లు దొరకవు. అయినా అతడు వర్గలోనే ఉండిపోయాడు. మంచి కార్యకర్తగా మారి పోయాడు.
అదేసమయంలో సిగరెట్ తాగడం మానేశాడు. అతడు ఆ సంస్థను ఆ ప్రాంతంలో ఎంతో ఉన్నతమైన స్థితికి తీసుకొనివెళ్లారు. ఒక వ్యక్తి ఎలా ఉంటారో అలాగే స్వీకరించాలి. పట్టువిడుపు మనలో ఉంది. అదే సమయంలో మనం కోరుకున్న విధంగా ఆ వ్యక్తిని తీర్చిదిద్దుకునే ఆత్మీయత అనే కళ కూడా మా దగ్గర ఉంటుంది. మాకు ఈ విషయంలో ధైర్యము, విశ్వాసము ఉంది. ఈ కారణంగానే సంఖ్య పెరిగినప్పటికీ నాణ్యత అలాగే ఉంటుంది. సంఖ్య కావాలి కానీ అదే సమయంలో గుణాత్మకతకూడా ఉండాలి. కానీ మొత్తం సమాజాన్ని గుణాత్మకంగా మార్చాలనే ఎఱుక మాకు ఉంది.
ఈ శతాబ్ది సంవత్సరాన్ని పురస్కరించుకొని హిందూ శ్రేయోభిలాషులు, సంఘ హితైషులు, దేశ హితైషులకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి?
ఇప్పుడు హిందూ సమాజం మేల్కొనాలి. మనలోని అన్ని విభేదాలను, స్వార్థాన్ని మరిచిపోయి, మన వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, వృత్తి జీవితాన్ని శాశ్వతమైన హిందుత్వ ధర్మ విలువలు ప్రాతిపదికగా రూపుదిద్దుకోవాలి. తద్వారా శక్తిమంతమైన, న్కెతిక సంపన్నమైన, అన్ని విధాలుగా సుసంపన్నమైన భారత్‌ను నిలబెట్టాలి. వ్యవసాయ రంగంలో విప్లవం వచ్చింది.
పారిశ్రామిక రంగంలో విప్లవం వచ్చింది. సాంకేతిక రంగంలో విప్లవం చోటు చేసుకుంది. ఇప్పుడిక ధార్మిక విప్లవం రావాల్సిన అవసరం ఉంది. నేను మతం గురించి మాట్లాడటం లేదు. సత్యం, స్వచ్ఛత, కరుణ, తపస్సు ఆధారంగా మానవ జీవితాన్ని పునర్ నిర్మించాల్సిన అవసరం ప్రపంచానికి ఉంది. దానికి భారత్ మార్గదర్శనం అనివార్యం. సంఘ పనికి ఉన్న ప్రాముఖ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనమందరం ‘నేను నా కుటుంబం’ అనే వలయం నుంచి వెలుపలకు రావాలి. మన జీవితాన్ని ఒక ఆదర్శంగా మలచుకోవాలి. తద్వారా చురుకుగా ఉంటూ మనమందరం కలసికట్టుగా ముందుకు సాగడం ఎంతో అవసరం.