నిత్యానిత్య వివేకాన్ని కలిగి ఉండాలి…
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్) శతాబ్దిని పురస్కరించుకుని ఆంగ్లవారపత్రిక ‘ఆర్గనైజర్’, హిందీ వారపత్రిక ‘పాంచజన్య’, మరాఠీ వారపత్రిక వివేక్, మలయాళ దినపత్రిక ‘జన్మభూమి’ సంఘపరంగా నిర్వహించిన ముఖాముఖీలో సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ స్పందించిన కొన్ని అంశాలు జులై సంచికలో ప్రచురితమయ్యాయి. మరికొన్ని ఈ సంచికలో…
1948, 1975లలో ఎదుర్కొన్న నిషేధాల నుంచి సంఘం సంస్థాగతంగా ఏం నేర్చుకుంది?
ఈ రెండు నిషేధాల వెనుక రాజకీయాలు ఉన్నాయి. ఆ నిషేధాలు విధించినవారికి కూడా సంఘ వల్ల లాభమే తప్ప ఏమాత్రం హాని ఉండదని తెలుసు. ఇంత పెద్ద సమాజంలో సర్వ సాధార ణంగా భావజాలాల మధ్య పోటీ ఉన్నప్పుడు అధికా రంలో ఉన్నవారు తమ రాజకీయ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి సంఘంపై నిషేధం విధించారు. మొదటి నిషేధంలోని ప్రతి మాటా సంఘానికి వ్యతిరేకంగా ఉంది. దాంతో సంఘ కార్యకలాపా లను ఆపాల్సి వచ్చింది. కానీ సంఘం అన్ని ప్రతి కూలతల మధ్య ఆ నిషేధం నుంచి బయటపడిరది. ఆ తర్వాత 15 నుంచి 20 సంవత్సరాలకు పూర్వ స్థితికి చేరుకొని, అంతకంటే మిన్నగా ముందుకు సాగింది.
స్వయంసేవకులు సమాజంలోని వేర్వేరు కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రారంభించారు. వాటిల్లో సంఘ భూమికను సుస్థిరపరచసాగారు. 1948నాటి నిషేధం వల్ల సంఘానికి మేలు జరిగింది. మేం మా సామర్థ్యాన్ని తెలుసుకోగలిగాం. సమాజంలోనూ, వ్యవస్థల్లోనూ మార్పులు తీసుకురావడానికి స్వయంసేవకులు ప్రణాళికను రూపొందించుకొని ముందు వరుసలో నిలిచారు. సంఘం ఆలోచనలలో మొదటి నుంచి సంఘ పని కేవలం ఒక గంట శాఖకే పరిమితం కాదని, మిగిలిన 23 గంటల్లో సంఘ విలువలను మన వ్యక్తిగత, కుటుంబ, సమాజ, జీవనోపాధి కార్యకలా పాల్లో కూడా వ్యక్తపరచాలనే అంశం ఉంది.
1975 నాటి నిషేధకాలంలో పెరిగిన సంఘ శక్తి, సామర్థ్యాలు సమాజానికి అనుభవంలోకి వచ్చాయి. మంచివాళ్లందరు నిరాశలో మునిగిపోయి నప్పుడు, సామాన్యమైన స్వయంసేవక్‌లో ఈ సంక్షోభం నుంచి మనమందరం సురక్షితంగా బయటపడతామనే నమ్మకం ఉండేది. 1975లో అత్యవసరపరిస్థితి కాలంలో తనపై విధించిన నిషేధాన్ని ఒక సమస్యగా చూడటానికి బదులుగా ప్రజాస్వామ్య పరిరక్షణకు పనిచేసింది. ఆ సమయంలో సంఘాన్ని విమర్శించేవారికి కూడా సాయపడింది. అప్పట్లో సమాజం గురించి ఆలోచించేవారిలో ఒక విశ్వసనీయమైన సైద్ధాంతిక ధృవంగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంఘం ఏర్పరుచుకుంది. గడ్డు కాలం ముగిసిన తర్వాత సంఘం అనేక రెట్లు బలశాలిగా బయటకు వచ్చింది.
సంఘం నేటికీ డాక్టర్ హెడ్గేవార్‌జీ, శ్రీగురూజీల ప్రాథమిక ఆలోచనలకు అనుగుణంగానే ముందుకు సాగుతోంది. ఇందులో ఏద్కెనా మార్పు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎలాంటి మార్పు జరిగింది?
డాక్టర్‌జీ, శ్రీ గురూజీ లేదా బాలాసాహెబ్‌జీ ఆలోచనలు సనాతన సంప్రదాయం లేదా సంస్కృతికి భిన్నంగా లేవు. ప్రగాఢమైన చింతన, కార్యకర్తలు ప్రత్యక్షంగా చేసిన ప్రయోగాల అనుభవసారం సంఘ పద్ధతిని బలోపేతం చేసింది. దాంతో సంఘం పురోగమిస్తోంది. కార్యకర్తలకు మొదట్నించీ కూడా తత్త్వమే ప్రధానం. మహా పురుషుల గుణగుణాలను, వారి మార్గాన్ని అనుసరిస్తాము. కానీ దేశ, కాల, పరిస్థితులను బట్టి మనం స్వయంగా బాట వేసుకొని ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇందుకోసమని నిత్యానిత్య వివేకాన్ని కలిగి ఉండాలి.
సంఘం ప్రకారం నిత్య (శాశ్వతం)మైనది అంటే ఏమిటి?
బాలాసాహెబ్‌జీ ఒకానొక సందర్భంలో ‘హిందుస్థాన్ హిందూదేశం’ అని అన్నారు. ఈ ఒక్క మాటను తప్ప సంఘంలో ప్రతీదాన్ని మార్చ వచ్చు. సంపూర్ణ హిందూ సమాజం ఈ దేశం పట్ల ఒక బాధ్యతాయుతమైన సమాజంగా ఉంటుంది. ఈ దేశ స్వభావం, సంస్కృతి హిందు వుల సంస్కృతిగా భాసిల్లుతున్నాయి. అందుకనే ఇది హిందూదేశం అయింది. ఈ మాటను స్థిరపరుచు కొని ప్రతీది చేయాలి. అందుకనే స్వయంసేవకుల ప్రతిజ్ఞలో ‘‘పవిత్రమైన మన హిందూధర్మాన్ని, హిందూ సంస్కృతిని, హిందూ సమాజాన్ని సంరక్షించుకోవడంతోనే హిందూ రాష్ట్ర సర్వాంగీణ ఉన్నతి’’ అనే మాట వినపడుతుంది. హిందూ పదానికి మన భాష్యం కూడా విస్తృతమైంది.
దాని పరిధిలో దారి చేసుకుంటూ దేశ, కాల, పరిస్థితులకు తగ్గట్టుగా దారి మార్చుకుంటూ ముందుకు సాగేందుకు తగినంత వీలుఉంది, అవకాశం ఉంది. ప్రతిజ్ఞలో ‘‘నేను సంఘంలో ఒక భాగస్వామిని’’ అని కూడా ఉంటుంది. భాగస్వామి అంటే సంఘ రూపకర్త, సంఘ సూక్ష్మరూపం, సంఘ అవిభాజ్య అంగమని అర్థం. అందువల్లనే వేర్వేరు అభిప్రాయాలు ఉన్నప్పటికీ వారికి చర్చలో పూర్తి భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుంది. ఒకసారి ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయానికి చేరుకున్న తర్వాత ప్రతీ ఒక్కరూ వారి వారి అభిప్రాయాలను ఆ నిర్ణయంలో విలీనం చేసి ఒకే దిశగా ముందుకు సాగుతారు. తీసుకున్న నిర్ణయం ఏదైనప్పటికీ అందరూ దాన్ని అంగీకరిస్తారు. అందువల్ల ప్రతీ ఒక్కరికీ పనిచేసే స్వేచ్ఛ ఉంటుంది. అందరి దిశా ఒకటే అవుతుంది. మనం శాశ్వతమైన దాన్ని కాపాడుకుంటాము. అశాశ్వతమైన దాన్ని దేశ, కాల, పరిస్థితులకు తగ్గట్టుగా మార్చుకుంటూ ముందుకు సాగుతాం.
సమాజం మారింది, జీవనశైలి మారింది, నేటి ఈ పరిస్థితిలో సంఘ దైనందిన శాఖ నమూనా ప్రభావం అంతగా ఉందా? లేదా ఇందుకోసమని ఏదైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా ఉన్నాయా?
శాఖ కార్యక్రమాల్లో మార్పులు జరుగు తుంటాయి. వాటిని మేం ఆహ్వానిస్తుంటాం. కానీ శాఖ ప్రాథమిక సూత్రాలైన కలిసికట్టుగా ఉండటం, సద్గుణాలను సామూహికంగా ఉపాసన చేయడం, ప్రతి రోజూ మాతృభూమి పరమవైభవం కోసం పనిచేస్తున్నామనే సంకల్పాన్ని చేయడం వంటివి మారవు. సామాన్యులెప్పుడూ సామాన్యులుగానే ఉంటారు. వారెప్పుడైతే ఇతరులతో కలిసిమెలిసి జీవించడం మొదలు పెడతారో అప్పుడు వారు అసామాన్యులౌతారు. సామాన్య వ్యక్తులు అసామాన్యమైన పనులు చేస్తారు. అసామాన్యమైన త్యాగాలు కూడా చేస్తారు. కానీ, దానికంటూ ఒక వాతావరణం ఉండాలి. అలాంటి ఒక వాతా వరణంలో మమేకమైపోవాలి. ఆ తర్వాత వచ్చే పరివర్తనకు కారణం తార్కాణం, ఆత్మీయత తప్ప మరొకటి కాదు. మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లండి. అక్కడ ఏదైనా మార్పు వచ్చి ఉంటే దాని వెనుక ఒక నమూనా ఉంటుంది. దానికి తగ్గట్టుగా మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. అది చూసి చుట్టూ ఉన్న ప్రజల్లో కూడా మార్పు వస్తుంది. దూరంగా ఉంటే కుదరదు. ఆప్తుడుగా మారి దగ్గరకు వెళ్లాలి.