‘ఆత్మవిస్మృతిని వదిలించుకోవాలి’

– ఆర్‌.ఎస్‌.ఎస్‌ ‌సర్‌ ‌సంఘచాలక్‌ శ్రీ ‌మోహన్‌ ‌భాగవత్‌

‌హిందువు ఆత్మవిస్మృతి వీడాల్సిన సమయం ఆసన్నమైందని ఆర్‌.ఎస్‌.ఎస్‌ ‌సర్‌ ‌సంఘచాలక్‌ శ్రీ ‌మోహన్‌ ‌జీ భాగవత్‌ అన్నారు. రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా ముచ్చింతల్‌లోని భవ్య రామానుజ మూర్తిని ఆయన సందర్శించారు. ధర్మాచార్యుల సమ్మేళనం అనంతరం భక్తుల నుద్దేశించి ప్రసంగించారు.


వేల ఏండ్ల నుండి విధర్మీయుల ఆక్రమణలను, పాశవిక అత్యాచారాలను సహించి కూడా హిందువులు ఇప్పటికీ ఈ దేశంలో 80శాతం ఉన్నారనీ, ఈ దేశాన్ని నడిపెవారూ హిందువులేననీ, రాజకీయ పార్టీలలో అధికులు హిందువులేననీ, ఉద్యోగుల్లో సైతం అధికులు హిందువులేననీ, ఈ దేశంలో మనకు ఏమి కరువైందని హిందువు ఆత్మవిస్మృతిలోకి జారుకుంటున్నాడని ప్రశ్నించారు. ఇది మన దేశం, మన సంస్కృతి, మన వారసత్వ పరంపర మనకు నేర్పినది శాశ్వతం.

మొత్తం ప్రపంచం సాంఘిక విప్లవం గూర్చి ఆలోచిస్తోంది. ఇది వెయ్యేళ్ళ నాడే మనదగ్గర సాధ్యమైంది. వెయ్యేళ్ళ నాడే సమతావాదం ఉందని, రామానుజ సహస్రాబ్ది మూర్తి ఇదే సందేశం ఇస్తోందని అన్నారు.

హిందువుల ముందు ఏ శక్తీ నిలువలేదని, కేవలం మన లోపలి భయం మాత్రమే మనను నిలువరిస్తుందని అన్నారు. వెయ్యేళ్ళ నాడు ఇలా హిందువు భయపడి ఉంటే ఆరోజే హిందుత్వం పరిసమాప్తి అయ్యెదనీ మనను నష్టపరచాలనుకున్న వారే నాశనమయ్యారని అన్నారు.

మన ధర్మం కేవలం అందరినీ సమానంగా మాత్రమే చూడమనదు. అందరినీ ఆత్మ స్వరూపులుగా చూడమంటుందని, మార్గాలు భిన్నమైనా కర్తవ్యం, లక్ష్యం ఒకటే కావాలి అన్నారు. ధర్మమార్గంలొ అర్థ కామాలను నియంత్రించి మోక్షం సాధించుమని చెప్పేది కేవలం మన ధర్మమే అన్నారు. ఆత్మవత్‌ ‌సర్వభూతేషు అని చెప్పే    శ్లోకంలో హిందూ ధర్మ సారం ఇమిడి ఉందన్నారు.

ఇక్కడ అఖిల భారత స్థాయిలో సాధుసంతులు కలిసినట్లే నెలకోసారి జిల్లా స్థాయిలో కలిసి సమాజ హిత ప్రభొధాల గూర్చి చర్చించాలని అన్నారు. సామాజిక కష్టాలను దూరం చేసేలా సమతామూర్తి మనకు ప్రేరణనివ్వాలని అన్నారు. కుటుంబంలో కూడా అందరూ వారానికొకసారి కలిసి శ్రద్ధతో భజన చేయాలనీ, 2, 3 గంటలు కుటుంబ పూర్వజుల గూర్చి, వంశ పూర్వీకుల గూర్చి, దేశ పూర్వీకుల గూర్చి చర్చ చేయాలి అని అన్నారు. మన ఇంట్లో చిత్రాలు కూడా మనకు ప్రేరణను అందించేవిగా ఉంచాలన్నారు. మనం మన కుటుంబం కోసం పని చేసినట్లే సమాజం కోసం పని చేయాలి అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *