మొక్కలనే తన సంతానంగా భావించి.. ప్రజల్లో చైతన్యాన్ని రగిలించిన ‘‘తిమ్మక్క’’

మొక్కలకు కూడా ప్రాణం వుందని భారతీయ శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్ రుజువు చేస్తే.. కర్నాటకకు చెందిన ‘‘సాలు మరద’’ తిమక్క దానిని ఆచరించి చూపారు. వివాహమై 25 సంవత్సరాలు గడచినా, సంతానం లేకపోవడంతో అత్తవారు రెండో పెళ్లి చేయాలని చూశారు. దీంతో తిమ్మక్క ఆత్మహత్యకి ప్రయత్నం చేసింది. అప్పుడు తన భర్త ఆమెను కాపాడి, మొక్కలు తీసుకొచ్చి, తిమ్మక్కకి ఇచ్చారు. ఇవే మన బిడ్డలని, వీటినే జాగ్రత్తగా పెంచుకొందామని, తద్వారా పర్యావరణం కాపాడుతూ లోకకల్యాణానికి నడుం కడదామని చెప్పారు. అప్పుడు తిమ్మక్క మొక్కలను పెంచుతూ, అవే తమ సంతానంగా భావించి దేశానికి ఆదర్శవంతమైంది.ఎంతలా అంటే 114 సంవత్సరాల వయస్సులోనూ మొక్కలు నాటుతూనే వున్నారు.

తన జీవితం మొత్తాన్ని పర్యావరణం కోసమే ధారబోయాలని తిమ్మక్క కృత నిశ్చయం చేసుకుంది. తన భర్త చిక్కయ్యతో కలిసి అమూల్యమైన జాతులకు సంబంధించి 8 వేల మొక్కలు నాటారు. రోజులో సగ భాగం పొలం పని, మరో సగ భాగం మొక్కలు నాటడానికే తిమ్మక్క వెచ్చించారు. 1958 లో తిమ్మక్క చేసిన కృషికి మొదటి సారి గుర్తింపు లభించింది. హుళికోట చెన్నప్ప, చక్ర బసవప్ప అనే ఇద్దరు ఆసాములు తిమ్మక్క దంపతులను ప్రశసించారు. వెండి పతకంతో సత్కరించారు. అదే తిమ్మక్క-చిక్కయ్య దంపతుల పర్యవరణ కృషికి తొలి సత్కారం.

అయితే సత్కారాలకు పొంగి పోలేదు తిమ్మక్క. పర్యావరణాన్ని కాపాడటం తన బాధ్యతగా భావించి, ఎవ్వరు చూసినా, చూడకున్నా.. దశల వారీగా కుదూరు అనే ప్రాంతం నుంచి హులికల్ అనే ప్రాంతం వరకు 4.5 కిలోమీటర్ల పొడవునా 385 మర్రి మొక్కలను నాటారు. అవే ఇప్పుడు భారీ వృక్షాలుగా ఎదిగి, ఉపయోగపడుతున్నాయి. కేవలం నాటడమే కాకుండా, మహా వృక్షాలు అయ్యేలా కూడా తిమ్మక్క జాగ్రత్త వహిస్తుంది. దీంతో పాటు తమ గ్రామంలో వృక్ష ఉద్యానవనం కూడా ఏర్పాటు చేశారు,. ఇలా కర్నాటక రాష్ట్రంలో 8 వేలకు పైగా మొక్కలు మహా వృక్షాలుగా ఎదిగేందుకు తిమ్మక్క తీవ్రంగా శ్రమించారు. దీంతో ఆమెకు ‘‘సాలు మరద’’ తిమ్మక్క అని పేరు స్థిరపడిపోయింది.

వయస్సుతో పాటు ఆమెకు శక్తి కూడా పెరిగింది. ‘‘మీరు’’అని గనక ఆమెను సంబోధిస్తే.. ‘‘ఈ గౌరవం, ప్రేమ, ఆదరాభిమానాలు అన్నీ చెట్లపై చూపించండి’’ అంటూ సున్నితంగా హెచ్చరిస్తుంది కూడా. చూసిన ప్రతివారినీ ఆప్యాయంగా పలకరిస్తుంది. వాళ్ళు ఏం చెప్తున్నారో శ్రద్ధగా వింటుంది. అన్నీ విన్నాక చివర్లో ‘నువ్వూ ఒక మొక్క నాటుతావా?’ అని అడుగుతుంది. కాదని ఎవరంటారు?ఆ పని చేయకుండా ఎలా ఉంటారు? ఆ విధంగా చూస్తుండగానే చెట్లు పెరిగిపోయాయి. అడవుల పెంపకం కార్యక్రమాలకు దారితీశాయి. దేశ వ్యాప్తంగా అనేక కార్యక్రమాల్ల్ో పాల్గొంటూ అటవీ సంరక్షణ, మొక్కల పెంపకం, సంరక్షణపై ప్రసంగిస్తూ అనేక మందిలో స్ఫూర్తి రగిలించింది ‘‘గ్రీన్ వారియర్’’.

తిమ్మక్కపై 1999లో దేశ పర్యావరణ హితకారులు ‘తిమ్మక్క మథు 284 మక్కలు’ అనే డాక్యుమెంటరీని తీశారు. దానిని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించారు. సాలుమరద తిమ్మక్క జీవిత చరిత్ర ఆధారంగా ప్రవరఆర్ట్ స్టుడియోస్ ‘సాలుమరగల తాయి తిమ్మక్క’ అనే నాటకాన్ని రూపొందించి ప్రదర్శించింది. దర్శకుడు హను రామసంజీవ రూపకల్పన చేశారు. ఇక 2015 లో రచయిత్రి బేలూరి ఇందిరమ్మ ‘సాలుమరద శారదారిణి’ శీర్షికతో కన్నడ భాషలో తిమ్మక్క జీవిత చరిత్ర పుస్తకం రాశారు. 2023 జనవరి 26న గణతంత్ర వేడుకల కవాతు సందర్భంగా తిమ్మక్క ఆకుపచ్చ కృషి దేశమంతా చాటుతూ కర్ణాటక ప్రగతి శకటంలో సాలుమరద తిమ్మక్క ప్రతిరూపాన్ని ప్రదర్శించి గౌరవించారు. నారీ విజేతలు ముగ్గురిలో ఒకరుగా ఆమె ప్రతిమను వుంచటం విశేషం. 2014-16 మధ్య ‘సాలుమరద తిమ్మక్క షేడ్ ప్లాన్’ కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం నిధులు కూడా కేటాయించింది. 2018 లో తుముకూరు జిల్లాలో కర్ణాటక ప్రభుత్వం సాలుమరద తిమ్మక్క ఉద్యానవనాన్ని ప్రారంభించింది. ఇక్కడ 40 రకాల అమూల్య వృక్షజాతులున్నాయి.

తాను పెంచి పెద్ద చేసిన మొక్కలకు చిన్న హాని తలపెట్టినా.. విశ్వరూపం చూపించేది. 2019 లో బాగేపల్లి హలగూరు రోడ్డును విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం తిమ్మక్క నాటిన వందలాది మర్రి చెట్లను నరకాల్సి వచ్చింది. కానీ.. ఇందుకే అంగీకరించలేదు తిమ్మక్క. ఇది సరికాదని ప్రభుత్వం ముందు ఓ అర్జీ పెట్టుకుంది. దీంతో ప్రభుత్వం ప్రత్యామ్నయాన్ని కూడా వెతికింద.ఇలా వృక్షాలను కాపాడారు.

అనేక అవార్డులు…

ప్రపంచ వ్యాప్తంగా వృక్షమాతగా ప్రసిద్ధి చెందిన తిమ్మక్క సేవలను గుర్తించి అనేక అవార్డులు సిద్ధించాయి. పార్లమెంటు ఆవరణలో, హైదరాబాద్​లో మొక్కలు నాటారు. జస్టిస్ పి.ఎన్ భగవతి కమిటీ 1996లో తిమ్మక్కను జాతీయ పౌరురాలిగా గుర్తిస్తూ పురస్కారం ప్రకటించింది. 1996 డిసెంబర్ 23న ప్రధాని దేవెగౌడ చేతుల మీదుగా నేషనల్ సిటిజన్ పురస్కారాన్ని స్వీకరించారు. తిమ్మక్క దశాబ్దాల నిష్కళంక, నిస్వార్థ హరిత కృషిని గుర్తిస్తూ భారత ప్రభుత్వం ఆమెకు 2019 లో పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. 2020 సంవత్సరంలో కర్ణాటక కేంద్రీయ విశ్వవిద్యాలయం తిమ్మక్కకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఇందిరా ప్రియదర్శిని, నాడోజా, వృక్ష మాత తదితర అవార్డులను గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు.అంతేకాకుండా పర్యావరణ రాయబారిగా కూడా ఆమెను నియమించారు. అమెరికాలోనూ ఆమె పేరిట అధ్యయన సంస్థలున్నాయి. తాజాగా కొన్ని రోజుల క్రితం ఆమె 114 ఏట కన్నూమూసింది. ఇప్పుడు వృక్షాలు అనాథలయ్యాయి. కానీ.. వృక్షాలు చూసినప్పుడల్లా తిమ్మక్క గుర్తుకు వస్తూనే వుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *