మాతృశక్తి ఆరాధనే మన సంస్కృతి
ఆర్‌ఎస్‌ఎస్ ద్వితీయ సర్‌సంఘచాలక్ శ్రీగురూజీ పూనాలో చేసిన ఉపన్యాసపు సంక్షిప్తరూపం
మాతృభక్తి
మాతృపూజనం గురించి ఆలోచించేటప్పుడు జన్మనిచ్చిన తల్లితోపాటు మన మాతృభూమిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇది మనం ప్రత్యేకంగా చెప్పవలసినరావడం దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే ఈ భావన క్రమంగా లోపించి పోతోంది. ఈనాడు మాతృభూమిపట్ల విశుద్ధమైన భక్తి కలిగినవారు తక్కువగానే ఉన్నారు. అధికారం కోసమో, కీర్తి, స్వప్రయోజనం కోసమో మాతృ భూమిపై భక్తిని ప్రదర్శించేవారు కొందరు న్నారు. స్వచ్ఛమైన మాతృదేశ భక్తితో నిండిపోయిన హృదయం ఎక్కడైనా కనిపిస్తుందా అంటే, చెప్పడం కష్టమే. చిన్నచిన్న స్వార్థప్రయోజ నాల కోసం స్వదేశీయులు ఒకరితో ఒకరు కలహించుకోవడం కనిపిస్తోంది.
మాతృభూమి – హిందూరాష్ట్రం
ఇది మన మాతృభూమి. మనం దీని పుత్రులం. ఇదేమీ కొత్త విషయం కాదు. అతి ప్రాచీన కాలం నుంచీ జాతీయ జీవనం ఈ భావనతోనే సాగుతోంది. వాస్తవాన్ని దర్శించే ప్రయత్నం చేసినవారందరూ ఈ విషయాన్నే చెప్పారు. కానీ బ్రిటిష్ పాలకులు తమ సామ్రాజ్యవాదు ప్రయోజనాల కోసం హిందూరాష్ట్ర జీవనాన్ని ఛిన్నాభిన్నంచేసి ఇదొక అతుకులబొంత అని ప్రచారం చేశారు. ఆ తరువాత వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు చేసిన ప్రచారాన్ని మన నేతలు కూడా తమ స్వార్థం కోసం కొనసాగించారు. మనం మాతృభూమి పుత్రులం, హిందుస్థాన్ హిందువులది అని చెప్పడం విషప్రాయమై పోయింది. ఇదొక ధర్మశాల, వస్తూపోతూ ఉండండి. ‘ఈ ఇల్లు మీదే’ అనడం సరైన మాట అయిపోయింది. ఈ పరిస్థితి చాలా విచారించ దగినది. ‘ఈ దేశం అందరిదీ’ అనడం ఇప్పుడొక ఫ్యాషన్ అయిపోయింది. దీనివల్ల స్వార్థమైతే నెరవేరుతుంది కానీ మాతృభూమిని మాత్రం మరచిపోతాం.
ఆధునిక జీవన ప్రవాహంలో కొట్టుకుపోతున్న మనకు జన్మనిచ్చిన తల్లిపట్ల గౌరవభావం చూపడం కూడా కష్టమైపోతోంది. తల్లిదండ్రులు తమను అడిగి కన్నారా అని అడిగే ప్రవృత్తి పెరుగుతోంది.
జగన్మాతను విస్మరించాం
మనం జన్మనిచ్చిన తల్లిని మరచి పోయాం. అలాగే మాతృభూమిని మరచిపోయాం. ఇలాంటి మనం సర్వ సృష్టికి మూలమైన అఖండ మండలా కారిణి జగన్మాతను మాత్రం ఎలా గుర్తు పెట్టుకోగలం? ఎవరికీ ఈ ధర్మవిషయం మనసులోకి రావడంలేదు. ధర్మం గుర్తుకు వస్తే జగన్మాత గుర్తుకువస్తుంది.
మాత-మాతృభూమి-జగన్మాత
మాతృత్వం గురించి ఇంత మహోన్నతమైన భావన మరెక్కడా కనిపించదు. మాతృత్వంలోని కోమలత్వం, పవిత్రత గురించి మరికొన్ని సంస్కృ తులు కూడా చెప్పాయి. కానీ మన సంస్కృతిలో మాతృశక్తిని జ్ఞానదాయిగా, కరుణామయిగానేకాక శక్తిస్వరూపిణిగా కూడా భావన చేశారు. జగన్మాత స్వరూపం ఇతర జాతులకు స్ఫురించలేదు. మన ధర్మంలో మాత్రమే మాత, మాతృభూమి, జగన్మాత ఈ మూడు రూపాల్లోనూ మాతృత్వాన్ని గురించి చెప్పారు.
మనం ఈ ప్రపంచంలో ఉన్నది కేవలం పొట్ట నింపుకునేందుకేనా అన్నది ఆలోచించవలసిన విషయం. అటువంటి జీవితాన్ని పశుపక్షులు కూడా గడుపుతున్నాయి. మనిషి ఆలోచించే శక్తీ, బుద్ధి ఉన్నవాడు. కనుక అతడు మాతృత్వ స్వరూపాన్ని కృతజ్ఞతతో ఉపాసించాలి. మానవ జీవితంలో కృతజ్ఞతకు ప్రధానమైన స్థానం ఉంది. మనం సొంత సుఖాల్లో మునిగిపోయి తల్లిని మరచి పోతున్నాం. కృతజ్ఞతాభావం బాగా తగ్గిపోయిందని పిస్తోంది. ఇది అభివృద్ధి, ప్రగతి కానేకావు. జ్ఞానదాయిని, శక్తిస్వరూపిణి అయిన జగన్మాతను మనసులో నిలుపుకోకపోవడంవల్ల, కేవలం స్వార్థదృష్టిని కలిగిఉండడంవల్ల మన జీవితాలు ఈ స్థితికి వచ్చాయి. కేవలం కోరికలు తీర్చుకోవడం కోసమే జీవించడం మంచి సంస్కృతి లక్షణం కాదు. మనస్సులో కృతజ్ఞతాభావం లేకపోతే జీవితం వ్యర్థం. కనుక మంచి సంస్కారాన్ని కలిగి ఉండి ఈ ముగ్గురు మాతృమూర్తులను (తల్లి, మాతృభూమి, జగన్మాత) మనం అనునిత్యం అఖండ భక్తితో కొలవాలి.