గుడ్ న్యూస్ : పంటలకు కనీస మద్దతు ధరను పెంచిన కేంద్రం
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాబోయే ఖరీఫ్ సీజన్ దృష్ట్యా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్ర కేబినెట్. ఖరీఫ్ పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు రూ.2.6 లక్షల కోట్లు వెచ్చించాలని నిర్ణయించింది. అగ్రికల్చర్ కాస్ట్ ప్రైసెస్ కమిషన్ సిఫార్సుల మేరకు వివిధ పంటలకు కనీస మద్దతు ధరలను కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. క్వింటా వరికి కనీస మద్దతు ధరను రూ.72 పెంచి రూ.2,441 చెల్లించాలని నిశ్చయించింది. క్వింటా జొన్న కనీస మద్దతు ధరను రూ.4,023కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
“ఏడాదికి 824.41 లక్షల మిలిటన్ టన్నుల పంట సేకరణ చేస్తున్నాం. పంట ఖర్చుకు అదనంగా 50 శాతం కనీస మద్దతు ధరగా నిర్ణయం చేశాం. 2014-26 మధ్య ఖరీఫ్ పంటలకు రూ.19 లక్షల కోట్ల కనీస మద్దతు ధర చెల్లించాం. 2014-26 మధ్య 8,746 లక్షల మిలిటన్ టన్నుల ఖరీఫ్ పంట సేకరించాం. యూపీఏ హయాం కంటే నాలుగు రెట్లు అధికంగా రైతులకు ఖరీఫ్ చెల్లింపులు చేస్తున్నాం” అని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.
పంటల వారీగా కనీస మద్దతు ధర
మోదీ సర్కార్ రైతులకు మేలు చూకూరేలా ఈసారి ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను ప్రకటించింది. వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం.
- క్వింటా వరికి కనీస మద్దతు ధర రూ.2,441
- క్వింటా వరి(ఏ-గ్రేడ్)కి కనీస మద్దతు ధర రూ.2,461
- క్వింటా జొన్నలు (హైబ్రిడ్) కనీస మద్దతు ధర రూ.4,023
- క్వింటా జొన్నలు (మల్దండి) కనీస మద్దతు ధర రూ.4,073
- క్వింటా సజ్జల కనీస మద్దతు ధర రూ.2900
- క్వింటా రాగుల కనీస మద్దతు ధర రూ.5,205
- క్వింటా మొక్కజొన్నల కనీస మద్దతు ధర రూ.2,401
- క్వింటా కందుల కనీస మద్దతు ధర రూ.8,415
- క్వింటా పెసల కనీస మద్దతు ధర రూ.8,780
- క్వింటా మినుముల కనీస మద్దతు ధర రూ.8,200
- క్వింటా పత్తి (మధ్యశ్రేణి) కనీస మద్దతు ధర రూ.8,267
- క్వింటా పత్తి (దీర్ఘ శ్రేణి) కనీస మద్దతు ధర రూ.8,667
- క్వింటా పల్లి కనీస మద్దతు ధర రూ.7,517
- క్వింటా ప్రొద్దుతిరుగుడు విత్తనాల కనీస మద్దతు ధర రూ.8,343
- క్వింటా సోయాబీన్ (ఎల్లో) కనీస మద్దతు ధర రూ.5,708