ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసినందుకు తలాక్ అంటూ మహిళకి విడాకులు ఇచ్చిన భర్త
ఆ మహిళ ఘోరమైన పాపమేమీ చేయలేదు. ఆ మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ఏమీ నడుచుకోలేదు. కుటుంబ పరువు అంతకంటే తీయలేదు. ఆమె చేసిందల్లా సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీకి ఓటు వేయడమే. అంతే. ఆమె భర్త వెంటనే తలాక్ అంటూ విడాకులు ఇచ్చేశాడు. ఈ ఘటన జరిగింది యూపీలోని అలీఘర్‌లో. అసియా అనే ముస్లిం మహిళ గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసినందుకు ఆమె భర్త విడాకులు ఇచ్చేశాడు. తనకు న్యాయం చేయాలంటూ ఆ ముస్లిం బాధితురాలు ఇప్పుడు సమాజాన్ని అడుగుతోంది. అలీఘర్‌లోని ఎడల్‌పూర్‌లో ఈమె నివాసం వుంటోంది. 2021 లో ఈమెకు సెవన్ మియాన్ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. ఈ పెళ్లి సమయంలో తన తలిదండ్రులు దాదాపు 8 లక్షల రూపాయలు కట్నం కూడా ఇచ్చారు.
అయితే.. మియాన్‌కు గతంలోనే ఓ వివాహం కూడా అయ్యిందని ఆమె వెల్లడిరచింది. 8 లక్షల రూపాయల కట్నం ఇచ్చినా… ఇంకా తన తల్లిగారి నుంచి డబ్బులు తీసుకురావాల్సిందేనని అత్తగారి కుటుంబం తెగ ఇబ్బందులు పెడుతోందని ఆమె పేర్కొంది. ఇది ఇలా నడుస్తుండగా… గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తాను బీజేపీకి ఓటు వేసి ఇంటికి చేరుకుంది. ఎవరికి ఓటు వేశావ్ అని భర్త అడగ్గా… బీజేపీకి వేశానంటూ అసియా బదులిచ్చింది. అంతే.. వెంటనే ఆమె భర్త మియాన్ సేవన్ ఆవేశపడుతూ ‘‘అదేంటి సమాజ్‌వాదీకి వేయలేదా?’’ అంటూ మియాన్ తన సోదరులతో కలిసి ఆవేశంతో తనను ప్రశ్నించాడని, వేయలేదు అనగానే.. వెంటనే మూడు సార్లు తలాక్.. తలాక్.. తలాక్ అని చెప్పేశాడని వాయిపోయింది. దీంతో తాను కొన్ని నెలలుగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నానని, అయినా తనకు న్యాయం జరగడం లేదని అసియా వాపోయింది.