సంవేదన ఉండాలి
డా. ఎస్ రాధాకృష్ణన్ సంవేదనశీలత గురించి ఒక కథ చెపుతుండేవారు. ‘‘ఒక దైవభక్తుడు స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ బంగారపు కిరీటం అతనికి పెట్టారు. కానీ అక్కడ ఉన్న మిగిలినవారి కిరీటాల్లో మణులు కూడా ఉన్నాయి. అప్పుడు ఆ భక్తుడు నా బంగారపు కిరీటంలో మణులు ఎందుకు లేవు? అనడిగాడు. భూలోకంలో మన ప్రవర్తనను బట్టి ఇక్కడ కిరీటాలు, అందులో మణి మాణిక్యాలు ఉంటాయి. బాధలు, కష్టాల్లో ఉన్నవారిపట్ల సానుభూతిని, సంవేదనను చూపి, వారి గురించి కన్నీరు కార్చినవారి కిరీటాల్లో మణులు వస్తాయి. అలా ఇతరుల గురించి ఆలోచించినప్పుడే జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానమే జీవితానికి దారి చూపుతుంది. కనుక సంవేదన శీలత ఉండాలి. అని దేవతలు అతనికి వివరించారు.’’
ఇలాంటి జ్ఞానాన్ని కలిగించి, జీవన మార్గాన్ని చూపే ఉపాధ్యాయులంటే డా. రాధా కృష్ణన్‌కు ఎంతో గౌరవం. అందుకనే తనకు పుట్టినరోజు వేడుకలు చేయకుండా ఉపాధ్యాయులను సత్కరించ మని ఆయన కోరారు. ఆ ప్రకారమే ప్రతి ఏడాది ఆయన జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుతున్నారు.