రిజర్వేషన్‌లు ఉండాలి..
దేశంలో రిజర్వేషన్ల కొనసాగింపు విషయంలో తమపై చేస్తున్న విష ప్రచారం మీద రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు సర్ సంఫ్‌ుచాలక్ మోహన్ భాగవత్ హైదరాబాదులో స్పందించారు. రిజర్వేషన్లకు ఆరెస్సెస్ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. వాటిని తాము పూర్తిగా సమర్థిస్తున్నామని, అసమానతలు తొలిగే వరకూ రిజర్వేషన్లు కొనసాగాలని తేల్చిచెప్పారు. స్వార్థం కోసమే సంఫ్‌ు పై దుష్ప్రచారాలు చేస్తున్నారన్నారు. వివాదం లేపి, లబ్ధి పొందాలని చూస్తున్నారని, వివాదంతో తమకు సంబంధం లేదని మోహన్ భాగవత్ అన్నారు. హైదరాబాదు నాదర్‌గుల్‌లో విద్యాభారతి ఆధ్వర్యంలో నిర్మించిన విద్యాభారతి విజ్ఞాన కేంద్రం ఇంటర్నేషనల్ స్కూల్‌ని ప్రారంభిం చిన సందర్భంగా చేసిన ప్రసంగంలో రిజర్వేషన్లపై స్పందించారు.
మనిషికి పరిపూర్ణత్వం రావాలంటే విద్య చాలా అవసరమని, అందరికీ ఇది అత్యావశ్యకమని మోహన్ భాగవత్ పేర్కొన్నారు. విద్య అంటే కేవలం బయటి జ్ఞానం మాత్రమే కాదని, లోపలి జ్ఞానం కూడా తెలుసుకునేంతగా ఎదగాలన్నారు. మాతృ భాషలో విద్య చాలా అవసరమని, ఈ విద్యను జ్ఞానం కోసం ఉపయోగించుకోవాలని సూచించారు. విద్యను జ్ఞానం కోసం వినియోగిస్తూ.. ధనాన్ని దానం కోసం ఉపయోగించాలని, కండ బలాన్ని దేశం కోసం వినియోగించాలని సూచించారు. పిల్లలకు విద్యతో పాటు వివేకం నేర్పించి, లోకకల్యాణం గురించి వివరించాలన్నారు. విశ్వమంతా తమ కుటుంబమనే భావనతో వుండాలని, మనం విశ్వ గురువు గురించే మాట్లాడుతుంటామని గుర్తు చేశారు. పాఠశాల నిర్మాణంలో నిస్వార్థంగా సేవలందించి అందరికీ మోహన్ భాగవత్ ధన్యవాదాలు ప్రకటించారు.
ఈ పాఠశాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పరమహంస పరివ్రాజకాచార్య త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి విచ్చేశారు. చిన జీయర్ స్వామితోపాటు డాక్టర్ మోహన్ జీ భాగవత్ పాఠశాల భవనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అనుగ్రహ భాషణం చేసిన చిన జీయర్ స్వామి.. దేశం సమస్యల్లో ఉన్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మార్గదర్శనం చేశారని అన్నారు. భారత్‌ను విశ్వ గురు స్థానంలో నిలిపేందుకు ఆయన ఎనలేని కృషి చేస్తున్నారని వివరించారు. తాను రాజకీయ నాయకుడిని కాదని, కేవలం ఒక భారతీయుడుగా తన వాదనలు వినిపిస్తున్నానని చిన జీయర్ స్వామి స్పష్టం చేశారు. విద్య అన్నది పొట్ట కూటి కోసం కానే కాదని, సమాజంలో సక్రమమైన పౌరుడిగా తయారు చేసుకొనేందుకు అని వివరించారు. అటువంటి విలువలతో కూడిన విద్యను శిశుమందిర్‌లు అందిస్తున్నాయని అన్నారు.