ముస్తఫాబాద్ పేరును ‘‘కబీర్ ధామ్’’ గా మార్చుతూ సీఎం యోగి నిర్ణయం

ఉత్తరప్రదేశ్‌లో మరో గ్రామం పేరు మారనుంది. లఖింపూర్ ఖేరి జిల్లాలోని ముస్తఫాబాద్ గ్రామం పేరును ‘కబీర్‌ధామ్’ గా మార్చనున్నట్టు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఈ మేరకు తమ ప్రభుత్వం ఒక అధికారిక ప్రతిపాదనను కోరుతుందని, అవసరమైన పరిపాలనా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అప్పటి పాలకులు మార్చిన పేర్లను తిరిగి పునరుద్ధరించడం గతంలోనూ తమ ప్రభుత్వం చేసిందని తెలిపారు.ఆ గ్రామంలో ఒక్క ముస్లిం కుటుంబం కూడా నివసించడం లేదని తెలుసుకున్న తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

లఖింపూర్ ఖేరిలోని విశ్వ కళ్యాణ్ ఆశ్రమంలో జరిగిన ‘స్మృతి ప్రకటోత్సవ మేళా’లో యోగి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఇక్కడికి వచ్చాక ఈ గ్రామం పేరు ముస్తఫాబాద్ అని తెలిసింది. ఇక్కడ ముస్లిం జనాభా ఎంత అని అడిగినప్పుడు, ఒక్క ముస్లిం కుటుంబం కూడా లేదని చెప్పారు. అందుకే ఈ గ్రామం పేరును ‘కబీర్ ధామ్’గా మారుస్తామని నేను హామీ ఇచ్చాను” అని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా పేరు మార్చేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.

“గతంలో ప్రజల మత విశ్వాసాలను దెబ్బతీసేందుకు అయోధ్యను ఫైజాబాద్‌గా, ప్రయాగ్‌రాజ్‌ను అలహాబాద్‌గా మార్చారు. ఇది లౌకికవాదం కాదు, కపటత్వం. మా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌లకు వాటి పాత, వైభవమైన వారసత్వాన్ని తిరిగి ఇచ్చాం. అదేవిధంగా, ముస్తఫాబాద్ కూడా ఇకపై కబీర్ ధామ్‌గా పిలవబడుతుంది” అని యోగి ఆదిత్యనాథ్ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *