నదీమాతృకలు పరదేవతా స్వరూపాలు ఇదీ మన ఆర్షభావన….

సింధుం మాతృతమామ్‌’’ అంటే నదులు అమ్మ కన్నా ఎక్కువైనవి. ఈ వాక్యం ఋగ్వేదంలో వుంది. వైదిక సంస్కృతిలో నదులను ఆరాధించడం ఒక సంప్రదాయం. జడ భౌతికవాదం ప్రబలిన నేటి కాలంలో ఈ ఆరాధన వెనకున్న సూక్ష్మం అర్థంకావడం కష్టం. కన్నతల్లి వాత్సల్యంలోని విలువనే గ్రహించలేని కృతఘ్నత ప్రబలుతున్నప్పుడు ప్రకృతిలోని అమ్మతనం అర్థమవుతుందా?

జలం మనకు ప్రాణాధారం ఈ జలాలలోనున్న దైవశక్తిని దర్శించారు మహర్షులు. ప్రకృతి అంతా చైతన్యమయం. ప్రాణవంతం అనేది వేద దర్శనం. పంచభూతాలూ పరమేశ్వర స్వరూపాలు, వాటిపట్ల మనం ప్రసరింపజేసే భావ పరంపరకి అవి స్పందిస్తాయి, అనుగ్రహిస్తాయి, ఆగ్రహిస్తాయి. వీటికి పౌరాణిక దృష్టాంతాలే కాక, స్వానుభవ తార్కాణాలు చాలా వున్నాయి. సీతమ్మ శ్రీరామునితో వనవసానికి వెళ్లినపుడు సరయూ, గంగ, గోదావరి వంటి నదులకు నమస్కరించి, ముత్తైదువలకు వలె అర్చనలు చేసింది. నదీమాతృకలు పరదేవతా స్వరూపాలు అనేది ఆర్షభావన. ఈ దేశపు ఆత్మ భావన.

శ్రీరాముడు సముద్రానికి సేతువు నిర్మించేటపుడు దర్భశయన దీక్షతో సముద్రాన్ని ప్రార్థించడం అందరికీ తెలిసిందే. సేతుబంధన దక్షత వున్న నలుడు తన సేవలోనే వున్నా, ప్రకృతి అనుకూలించకపోతే ఏదీ సాధ్యం కాదు. నదులనీ, వనాలనీ ఆరాధించడం అనాగరికం కాదు. అది నాగరికతను మించి ఎదిగిన సంస్కారం. అందుకే భగీరథుడు గంగను తీసుకొచ్చి, ఆ జలాలతో తన పితరులకు సద్గతులు కలిగించాలని తపస్సు చేశాడు. హిరణ్యతేజుడు, పూరురవుడు వంటి మహారాజులు సైతం తపస్సుల ద్వారా నదీమాతృకల్ని ప్రసన్నం చేసుకున్నారు. ‘‘ఆపోవా ఇదగ్‌ం సర్వం’’ అని జలశక్తిని గుర్తించింది వేద సంస్కృతి. నదులను ఆధారం చేసుకొని గొప్ప గొప్ప నాగరికతలను ఆవిష్కరించుకున్నాం. ఎన్నో ఉత్సవాలు, పుష్కరాది వైభవాలు, దేవాలయాలు నదుల తీరాలలో ఆవిష్కరించుకున్నాం. నదుల తీరాలలో ఆ అమ్మల్ని పలకరిస్తూ కొలుచుకుంటున్నాం. ఆయా పుణ్యకాలపర్వాలలో విభిన్న ప్రాంతాల వారు అంతా కలిసి ఎంత సమైక్య సాంస్కృతికి సౌజన్య సంగీతాన్ని ఆవిష్కరిస్తున్నారో మనకు తెలుసు. ఒక్కొరు నదీ జలకణం మన భౌతిక దేహాలనే కాక ఆత్మల్ని కూడా కడుగుతున్న అనుభూతితో అద్వితీయ ఔన్నత్యాన్ని సాధించుకుంటున్నాం. గంగమ్మ, గోదారమ్మ, కృష్ణమ్మ అని నదుల్ని అమ్మలుగా పూజిస్తున్నాం మనం. వాటి చలువ వల్ల అన్నం తింటున్నాం. దాహార్తిని పోగొట్టుకుంటున్నాం. కృతజ్ఞత అనేది మానవీయ దృష్టి. ఆ మానవతకు సార్థక్యం కల్పించిన సంస్కృతిలో పుట్టిన మనమే ఎన్ని పుణ్య నదుల్ని కలుషితం చేస్తున్నాం. ఎన్నింటినో నామ రూపాల్లేకుండాచేశాం. ఏమాత్రం జాగ్రత్త లేకుండా, నిర్లజ్జగా నదీమతల్లుల్ని కాలుష్యమయం చేస్తూ విరవ్రీగుతూ, వాటి ఫలితాలు అనుభవిస్తున్నాం.

ఋగ్వేదంలో ఒక యజ్ఞం పూర్తిచేసుకు వచ్చిన విశ్వామిత్రుడు అతడి పడవ వెళ్లలేనంత తీవ్రంగా వున్న శతురూ, వ్యాస నదుల్ని ప్రార్థించి, అనుగ్రహంతో వెళ్లిన గాథ వుంది. శైశవ కృష్ణుని తీసుకువస్తున్న వాసుదేవునకు యమున తనంత తాను దారివ్వడం కూడామనకు తెలిసిందే. మాతృతమములైన నదులలోని ఆ దివ్యత్వాన్ని దర్శించిన గొప్ప సంస్కృతిలో పుట్టిన మనం ఇప్పటికైనా ఆ భావన కలిగించుకుంటే మన మానసిక స్పందనలన్నీ అమృతవర్షిణీ రాగాలవుతాయి. ప్రకృతి జనని పరవశించి పచ్చదనం పండిరచుకుంటుంది.

(నేడు గంగా అవతరణమ్)… ఈ సందర్భంగా

సేకరణ : బ్రహ్మ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి వ్యాసం 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *