నామాల జ్యోత్స్న కాస్తా.. డ్రోన్ మహిళగా పేరు తెచ్చుకున్నారు…
పెద్దగా చదువుకోలేదు. అంత డబ్బూ లేదు. కానీ తన ఊరి వారికి ఏదో చేయాలన్న బలమైన సంకల్పం మాత్రం ఆమె దగ్గర వుంది. అందునా వ్యవసాయ క్షేత్రానికి, రైతులకు ఏమైనా చేయాలనేది వుండేది. ఈ లక్ష్యమే ఆమెను డ్రోన్ పైలట్ చేసింది. క్షేత్ర స్థాయిలో రైతులకు సేవలందిస్తూ.. తానూ ఊపాధి పొందుతున్నారు. ఆసక్తి, శ్రద్ధ, సేవా సంకల్పం అంటూ వుంటే ఏదైనా చేయవచ్చని, గుర్తింపు తనంతట తానే మన వెంట పరిగెత్తుకుంటూ వస్తుందని నిరూపించారు. వైఎస్సార్ జిల్ల ా కమలాపురం మున్సిపాలిటీలోని అప్పాయపల్లె గడ్డ వీధికి చెందిన నామాల జ్యోత్స్న. పొదుపు సంఘాల్లో క్రియాశీలకంగా వుంటూ… ఇతర మహిళలకు ఎప్పటికప్పుడు సాయం చేస్తూ, మార్గదర్శనం చేస్తూ.. డ్రోన్ పైలట్ గా ఎదిగారు. ఏకంగా తొమ్మిది మండలాల్లో డ్రోన్ సాయంతో పురగుల మందులు పిచికారి చేస్తూ.. ఆదాయం పొందుతున్నారు. నామాల జ్యోత్స్న కాస్దా… డ్రోన్ మహిళగా పేరు తెచ్చుకున్నారు.
నామాల జ్యోత్స్న నేపథ్యం సేవ చేయాలన్న సంకల్పం. డ్రోన్ లేడీ కంటే ముందు కమలాపురం మండలం కౌన్సిలర్ గా, మండల ఉపాధ్యక్షురాలిగా, పాల డెయిరీకి అధ్యక్షురాలిగా పనిచేశారు. ఆ తర్వాతే ఆమె జీవితంలో ప్రధాన మలుపు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘‘డ్రోన్ దీదీ’’ పథకంలో ఆమె ఎంపికయ్యారు. జిల్లా డ్రోన్ దీదీలో ఎంపికయ్యి, ట్రైనింగ్ తీసుకొని, డ్రోన్ పైలట్ గా మారిపోయారు.
దేశ వ్యాప్తంగా 100 జిల్లాలోని పంట పొలాల్లో డ్రోన్ల ద్వారా పురుగు మందులు పిచికారి చేయాలని కేంద్రం నిర్ణయించింది. వాటిలో వైఎస్సార్ కడప జిల్లా కూడా వుంది. అయితే.. 2024 లో ప్రధాని మోదీ డ్రోన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా జ్యోత్స్న గుంటూరులో డ్రోన్ ఆపరేట్ చేసి చూపించారు. దీంతో ఆమెను డ్రోన్ పైలట్ గా ఎంపిక చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం మహిళలను డ్రోన్ల పైలట్లుగా తయారు చేసేందుకు ప్రవేశ పెట్టిన లక్ పతీ దీదీ పథకానికి కూడా అధికారులు ఈమెనే ఎంపిక చేశారు. గుంటూరులో జరిగిన ప్రారంభ సభలో ఆమెకు సర్టిఫికేట్ తో పాటు డ్రోన్ కూడా అందజేశారు.
అలాగే ఈమెకు వ్యవసాయంపై వున్న శ్రద్ధ, అవగాహను వ్యవసాయ అధికారులు గమనించారు.డీఆర్డీఏ అధికారులు ఈమెను గుర్తించి, కరోనాలో కృషి కేంద్రం ద్వారా మినీ నర్సరీని ఏర్పాటు చేయించారు. బంతి, నిమ్మ గుమ్మడి, మిర్చి, వరి నారు పెంచి, రైతులకు విక్రయిస్తున్నారు.ప్రకృతి వ్యవసాయం ద్వారా తన పొలంలో పంటలు పండించి, ఆదాయం పొందుతున్నారు.
వ్యవసాయ సీజన్ వచ్చే సరికి ఈమె రోజుకి 35 నుంచి 40 ఎకరాల్లో మందులు చల్లుతారు. ఇప్పటి వరకు సుమారు వెయ్యికి పైగా ఎకరాల్లో మందులు చల్లారు. దీని ద్వారా సుమారు 4 నుంచి 5 లక్షల ఆదాయాన్ని పొందారు. ప్రతి రైతూ భుజాన 16 లీటర్ల ట్యాంకును మోస్తూ.. పొలానికి ఎరువు చల్లుతారని, ఇది కష్టమని అన్నారు. అదే డ్రోన్ తో అయితే ఎకరానికి 8 లీటర్ల ఎరువును ఎనిమిది నిమిషాల్లోనే చల్లవచ్చని తెలిపారు. రైతులకు ప్రయోగాత్మకంగా చల్లి చూపిస్తానని, తర్వాత రైతులు డ్రోన్ల సాయం తీసుకుంటున్నారని తెలిపారు.
గత యేడాది జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకులకు జ్యోత్స్నను కేంద్రం ఢిల్లీకి ఆహ్వానించింది. డ్రోన్ పైలట్లకు కేంద్రం ప్రత్యేక ఆహ్వానం పంపగా.. అందులో స్థానం లభించింది. దీనిని తాను ఎప్పటికీ మరిచిపోనని పేర్కొన్నారు.