లోక హితమే పాత్రికేయుల ప్రథమ ఉద్దేశం కావాలి : ఆర్గనైజర్ పత్రిక సంపాదకులు ప్రఫుల్ల కేత్కర్
పాత్రికేయుల ప్రథమ ఉద్దేశం ప్రజా సంక్షేమం (లోకహితం) కావాలని ఆర్గనైజర్ పత్రిక సంపాదకులు ప్రఫుల్ల కేత్కర్ పిలుపునిచ్చారు.పాత్రికేయులందరూ ఓచోట చేరి సామాజిక సమస్యలపై చర్చించాలని అన్నారు. విశ్వసంవాద కేంద్ర బెంగళూరు శాఖ ఆధ్వర్యంలో నారద జయంతి పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా కేత్కర్ మాట్లాడుతూ.. పురాతన కాలంలో అందరికీ వార్తలను చేరుస్తూ… నారద మహర్షి ఓ వ్యవస్థలా నిలిచారని, అందుకే మొట్ట మొదటి పాత్రికేయుడు నారద మహర్షి అని తెలిపారు. అయితే.. తప్పుడు కథనాల ద్వారా కొందరు నాదర మహర్షినిని తప్పుడు కోణంలో చూపించారని, అందుకే నారద మహర్షి గొప్పతనం ప్రజల్లోకి వెళ్లలేకపోయిందని వివరించారు. వాస్తవానికి ధర్మాన్ని రక్షించడంలో నారద మహర్షిది కీలక పాత్ర అని తెలిపారు.
ఏ వృత్తిలో వున్నా… ఆ వృత్తిపై అకుంఠితమైన భక్తి విశ్వాసాలుండాలని సూచించారు. అనుభవం, తప్పొప్పులను సరిచేసుకోవడం, వివిధ ప్రదేశాలను సందర్శించడం, జ్ఞానాన్ని ఆర్జించడం అన్న గుణాలను కచ్చితంగా అలవర్చుకోవాలని తెలిపారు. నారద సూత్రాలలో ఈ లక్షణాలన్నీ చెప్పబడ్డాయని, ఈ లక్షణాలు మూర్తీభవించిన స్ఫూర్తి నారద మహర్షి అని అన్నారు. ప్రస్తుత జర్నలిజంలో నకిలీ వార్తలు అన్న పదం తప్పని, దానికి బదులుగా నకిలీ కథనాలు అని వాడాలని, ఇవే ప్రస్తుత జర్నలిజంలో ఓ సవాల్‌గా నిలిచాయన్నారు. ఈ నకిలీ కథనాలకు పరిష్కార మార్గాలను కనుగొనాల్సిన అవసరం వుందని పేర్కొన్నారు. భాష, భౌగోళిక భేదాలు, ప్రాంతీయత అనేవి ఎన్నడూ మన గుర్తింపు కారాదని, ఎందుకంటే సాంస్కృతిక వైవిధ్యత మనలో వుందని, అవి సమాజాన్ని విభజించడానికి ఉపయోగపడతాయని కేత్కర్ అభిప్రాయపడ్డారు.