ధర్మాచరణ కోసమే నారదుడు.. ఇందుకే నారద జయంతి..

మహర్షి నారదుడు ధర్మాచరణ పరాయణుడని, అందరూ అనుకున్నట్టు కలహ భోజనుడు కాదని, నిజానికి ఆయనే మొదటి పాత్రికేయుడని చాలామందికి అవగాహన లేదని, పైగా ఈ మహర్షిని కార్టూన్ల రూపంలో నవ్వులపాలు చేసేందుకు ప్రయత్నించారని హైదరాబాదులో శనివారం జరిగిన నారద జయంతి కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు పేర్కొన్నారు. సమాచారభారతి ఆధ్వర్యంలో కోఠీలోని వైఎంఐఎస్ హాలులో జరిగిన ఈ ఉత్సవంలో మీడియాలోని వివిధ విభాగాలకు చెందిన పలువురు జాతీయవాద జర్నలిస్టులకు పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. పురస్కారాలను అందుకున్నవారిలో ‘వార్త’ దినపత్రిక సంపాదకులు దామెర్ల సాయిబాబా, సీనియర్ జర్నలిస్ట్ జంధ్యాల శరత్ బాబు, మహిళా జర్నలిస్టు-వీడియో బ్లాగర్ వల్లీ పద్మాంజలి (అంజలి), సీనియర్ కార్టునిస్ట్ సరస్వతుల రామ నరసింహం (సరాసి), ఐన్యూస్ చానెల్ వరంగల్ బ్యూరో చీఫ్ బూరం ప్రశాంత్, రాజ్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ లక్ష్మి ఉన్నారు. వీరికి సమాచార భారతి అధ్యక్షులు ప్రొఫెసర్ జి గోపాల్ రెడ్డి, సంస్థ ఉపాధ్యక్షులైన సీనియర్ జర్నలిస్ట్ వల్లీశ్వర్, జాతీయ మానవహక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి చేతుల మీదుగా సత్కారాలు, పురస్కార ప్రదానం జరిగాయి.
Narada Jayanthi1
తొలుత సమాచార భారతి అధ్యక్షులు ప్రొఫెసర్ జి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ మీడియా రంగానికి ఈ సంస్థ చేస్తున్న సేవలను వెల్లడించారు. సమాచార భారతి మూడు దశాబ్దాలుగా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ మీడియా రంగానికి సంబంధించిన పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోందని తెలిపారు. వక్రీకరణ జరిగిన భారతదేశ చరిత్రను సరైన దిశలో ప్రపంచానికి తెలియజేయడానికి సమాచార భారతి కృషి చేస్తున్నదని, అందులో భాగంగానే పాత్రికేయ మిత్రులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి, సోషల్ మీడియా సంగమాలు, పాత్రికేయ శిక్షణా శిబిరాలు వంటి పలు కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. జాతీయవాద పాత్రికేయుల్ని తయారు చేయడం కోసం జర్నలిజం కళాశాలను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివిధ జర్నలిజం కళాశాలలకు వెళ్లిన సందర్భంలో మొట్టమొదటి పాత్రికేయుడు ఎవరు? అని అడిగినప్పుడు పాశ్చాత్యుల పేర్లు చెప్పేవారు తప్ప నారదుడి గురించి ఎవ్వరూ చెప్పలేదన్నారు. కానీ మనం నారదుని పేరు చెప్పిన తర్వాత ఒప్పుకున్నారన్నారు. మరి ఇన్నాళ్ళూ ఎందుకు నిర్లక్ష్యం చేశారనే ప్రశ్నకు ఎవ్వరి దగ్గర సమాధానం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాత్రికేయులను సత్కరించేందుకు ప్రతి ఏటా సమాచార భారతి సంస్థ నారద జయంతి జరుపుతున్నదని, ఈ వేడుక ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలను మరోసారి మననం చేసుకునే అవకాశం దక్కుతుందన్నారు. అవకాశం చిక్కినప్పుడల్లా నారద మహాముని గురించి పాత్రికేయులు ప్రచారం చేయాలని కోరారు.
Vijaya Bharati
ముఖ్య అతిథి, జాతీయ మానవహక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి మాట్లాడుతూ దేశం అంతరాత్మను మలిచే బాధ్యతను, దేశానికి అవసరమైన అసలైన విషయాలను గుర్తించి సమాజానికి తెలియజేసే బాధ్యతను గుర్తించే రోజు ఈ నారద జయంతి అన్నారు. జర్నలిజం అనేది ఒక ఉత్తమ రూపంగా చేసే ప్రజా సేవ అని కొనియాడారు. ఇది ‘ధైర్యానికి’, ‘సత్యానికి’, ‘బాధ్యతాయుతమైన జర్నలిజం శక్తికి ” జరుగుతున్న ఉత్సవం అన్నారు. తాను సభ్యురాలిగా ఉన్న NHRC ప్రారంభం నుంచీ మీడియా శక్తిని, సేవలను వినియోగించుకుందని తెలిపారు. మానవహక్కుల పరిరక్షణ, ప్రోత్సాహంలో మీడియాని కూడా భాగస్వామిగా భావిస్తున్నదన్నారు. మీడియా ఇచ్చే నివేదికలను NHRC విశ్వసిస్తుందని చెప్పారు. మీడియా కథనాలను సుమోటోగా కూడా స్వీకరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని తెలియజేస్తూ పోలవరం నిర్వాసితులు, సందేశ్ కాలీ సహా పలు సంఘటనలను ఉదహరించారు.
అనంతరం అవార్డు గ్రహీతలు తమ స్పందనను తెలిపారు..
Damerla Saibaba
సీనియర్ జర్నలిస్టు, ‘వార్త’ దినపత్రిక సంపాదకులు దామెర్ల సాయిబాబా మాట్లాడుతూ తనకు ఈ పురస్కారం లభించినప్పటికీ, తాను సాధించిన విజయాల వెనుక ఎందరో సహకారం అందించారన్నారు. తన వృత్తి జీవితంలో భాగంగా అందించిన పలు సంచలనాత్మక కథనాల వెనుక పడిన శ్రమను వివరిస్తూ కరీంనగర్ జిల్లా నుంచి పంజాబ్ ఉగ్రవాదులకు అక్రమంగా ప్రేలుడు పదార్ధాల చేరవేత ఘటన సహా పలు సంఘటనల పరిణామాలను వివరించారు. మంచి జర్నలిస్టులను తయారు చేసే దిశగా మరింత మెరుగైన శిక్షణను ఇచ్చే ప్రయత్నాలు జరగాలని, జర్నలిజం అనేది ఒక పవిత్రమైన వృత్తి అని స్పష్టం చేశారు.
Jandhyala Sarathbabu
సీనియర్ జర్నలిస్టు జంధ్యాల శరత్ బాబు ప్రసంగిస్తూ ఈ పురస్కారాలు, సన్మానాలు తమకు చాలా సంతోషాన్నిస్తాయన్నారు. అయితే, జర్నలిజం వృత్తి అవునా? కాదా? అన్న సమస్య వచ్చిందంటూ మన పిల్లలకి దీనిని వారసత్వంగా ఇస్తామా లేదా అన్నది ప్రశ్నగానే ఉందన్నారు. తాను వృత్తి జీవితంలో పనిచేసినంత కాలం ఎప్పుడు అవకాశం లభించినా జాతీయవాద దృక్పథాన్ని కాపాడుతూనే రాశానన్నారు. వార్తను మొదట మనం అర్థం చేసుకున్నాకే ప్రజలకు అందించాలని, అప్పుడే సరైన సమాచారం ప్రజలకు చేరుతుందని అన్నారు. మనం రాసే రాతల్లో, మాట్లాడే మాటల్లో నిజాయితీ లేకుంటే రాణించలేమని, ఒక్క రోజు కూడా ఉద్యోగం చేయలేమని, నిబద్ధత, అంకితభావం లేకుంటే ప్రతి రోజూ అగ్నిపరీక్షలేనని స్పష్టం చేశారు.
Cartoonist Sarasi
సీనియర్ కార్టూనిస్ట్ సరస్వతుల రామ నరసింహం (సరాసి) స్పందిస్తూ మహర్షి నారదుడిని ఓ కార్టూన్ క్యారెక్టర్‌గా సినిమా వారు తయారు చేశారని ఆవేదన చెందారు. నారదుడిని నవ్వుల పాలు చేయబోయి.. వారే నవ్వుల పాలయ్యారన్నారు. సమాజంలో ప్రబలిన అతివాద ధోరణులే కార్టూన్లకు ఇంధనం అంటూ మనుషుల్లో విపరీత ధోరణులు పెరిగిపోయాయన్నారు. కార్టూనిస్టు ఎక్కువగా మాట్లాడకూడదని, కార్టూనే ఎక్కువ మాట్లాడాలని… తెలియజేస్తూ వ్యాఖ్యారహిత కార్టూన్లకే విలువ ఎక్కువగా వుంటుందన్నారు. అదే సమయంలో తెలుగు భాషను బతికించడానికి పాత్రికేయులందరూ ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. కార్టూన్ వల్ల సమాజానికి చాలా ప్రయోజనం వుందన్న సరాసి, అందరూ కార్టూన్ల వల్ల మారిపోరని, కానీ ఆ ప్రయత్నం చేస్తూంటే ఎప్పుడో ఒకప్పుడు సార్థకత చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Anjali Journalist
మహిళా జర్నలిస్టు వల్లీ పద్మాంజలి (అంజలి) మాట్లాడుతూ నారద జయంతి సందర్భంగా సమాచార భారతి సంస్థ జర్నలిస్టులను గుర్తించి అవార్డు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయమన్నారు. జర్నలిస్టులుగా చాలా ఏళ్ళు కష్టపడుతుంటామని, ఎవరూ గుర్తించట్లేదని బాధపడుతుంటామని పేర్కొంటూ సీనియర్ జర్నలిస్టుల మధ్య ఈ పురస్కారం అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. సమాచార భారతి బృందానికి ధన్యవాదాలు తెలిపారు.
Prashanth Journalist
ఐన్యూస్ చానెల్ వరంగల్ బ్యూరో చీఫ్ బూరం ప్రశాంత్ స్పందిస్తూ జాతీయవాద సంస్థ సమాచారభారతి తనకు నారద జయంతి అవార్డును ఇవ్వడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. తాను మొదట్లో ప్రెస్ నోట్లు బాగా రాస్తున్నానని ఏబీవీపీ వారు గమనించి ప్రోత్సహించారని, అప్పటి నుంచి జాతీయవాదం వైపు తన ప్రస్థానం ప్రారంభమైందని చెప్పారు. తన వృత్తి జీవితంలో భాగంగా అందించిన సంచలన నేరెళ్ల ఘటన, వరంగల్‌లో అర్చకుడి హత్య ఘటనలను బయటకు తీసుకురావడంలో లభించిన ప్రోత్సాహం, పడిన శ్రమ, NHRC పాత్రలను ప్రశాంత్ వివరించారు. ఈ క్రమంలో మేడారం సమక్క సారక్క జాతరకి సంబంధించి చాలా ఛానెళ్లు కాకతీయులను విలన్లుగాను, సమ్మక్క సారలమ్మలను రాజులుగా చూపిస్తున్నారంటూ అది తప్పు అని నిరూపించేందుకు సమ్మక్క సారక్కల సంబంధీకులతో కూడా మాట్లాడానన్నారు. వారు సమ్మక్క సారలమ్మలను మహిమాన్విత దేవతలుగానే చెప్పారు తప్ప, కాకతీయులతో యుద్ధం చేసినట్లు మాత్రం లేదన్నారు, ఢిల్లీ సుల్తానులతో కొట్లాడినట్లు మాత్రం చెబుతున్నారన్నారు. ఈ విషయమై తప్పుడు చరిత్రతను ప్రచారం చేస్తున్నారన్న ప్రశాంత్ ఇప్పటికీ దీనిపై పరిశోధన చేస్తున్నట్టు చెప్పారు.
రాజ్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ లక్ష్మి మాట్లాడుతూ తనకు ఈ పురస్కారాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
Lakshmi Raj News
కార్యక్రమంలో భాగంగా ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్తులైన జర్నలిస్టు పసుపుల మన్యంకొండకు నివాళి అర్పించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *