‘‘నామృతా నర్మదా’’… నేటి నుండి నర్మదా పుష్కరాలు

ప్రతి నదికి 12 సంవత్సరాలకు ఓ సారి పుష్కరాలు వస్తాయి. సంవత్సరానికో నదికి పుష్కరాలు వస్తాయి. 12 నదులకు ఒక్కో నదికి ఒక్కో యేడాదికి పుష్కరాలు వస్తాయి. గతేడాది గంగా నదికి పుష్కరాలు జరిగాయి. ఇప్పుడు నర్మదా నదికి పుష్కరాలు వచ్చేశాయి. బృహస్పతి వృషభ రాశిలో ప్రవేశించినప్పటి నుంచి 12 రోజుల పాటూ నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి. ఈ యేడాది చైత్ర బహుళ అష్టమి నాడు (అంటే మే 1) గురువు మేష రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు నర్మదా నదికి పుష్కరాలు ఆరంభమవుతాయి. గురు ప్రవేశం తర్వాత ఆ దనదిలో తొలి పన్నెండు రోజులు చేసే స్నానాలు, నదీ తీరాల్లో చేసే దానాలు, పితృకర్మలకు విశేష ఫలితాలు లభిస్తాయి.

నర్మదా నదిని ‘‘రేవా నది’’ అని కూడా పిలుస్తారు. పుష్కర నదుల్లో నర్మద అత్యంత ప్రత్యేకమైంది. నర్మదా నది ‘‘రుద్ర సంభవ’’. అంటే సాక్షాత్తూ శివుని శరీరం నుంచి ఆవిర్భవించింది. ‘‘నామృతా నర్మదా’’ అని కూడా అంటారు. అంటే మృతము లేనిది. శాశ్వతమైందని అర్థం. వింధ్య పర్వత శ్రేణిలో తూర్పున అమరకంటక్‌లో ఆవిర్భవించి, పశ్చిమ దిశగా… మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌లో వేలాది మైళ్లు ప్రవహిస్తుంది. ఎన్నో పుణ్య క్షేత్రాల గుండా ప్రవహిస్తుంది. ఇంతటి మహిమాన్వితమైన నదిపై ఆది శంకర భగవత్పాదులు నర్మదా అష్టకం కూడా రచించారు. అందులో నర్మదా నది వైభవం మొత్తాన్ని వివరించారు.

పూర్వం చంద్ర వంశంలో పురూరవుడు అనే రాజు, సమస్త భూ మండలాన్ని ఇంద్రులి లాగా తన పరాక్రమంతో పరిపాలించాడు. ఒకనాడాయన వృద్ధులు, పండితోత్తములైన బ్మ్రాణులను సమావేశ పరిచి, ఓ విప్రులారా యజ్ఞాలు వంటివి చేయకుండా కూడా స్వర్గ లోకం వెళ్లాలంటే ఏమి చేయాలో వివరించండి అని అడిగాడు. అప్పుడు ఆ విప్రులు మహారాజా… స్వర్గంలో నర్మదా అని పేరు గల ఒక నది వుంది. దానిని దర్శిస్తే చాలు, ఎవరైనా తరించిపోతారు. ఈ లోకంలోని పాపాలన్నింటినీ నశింపజేసే శక్తి ఆ నదికి ఒక్కటికే వుంది. దానిని మీరు ఏదో విధంగా భూమికి తీసుకొని రండి. అరిషడ్వర్గాన్ని జయించిన ఆ మహాత్ములైన విప్రుల వాక్కులు పురూరవుడ్ని మరింత ప్రోత్సహించాయి. ఆయన కంద మూలాలు స్వీకరిస్తూ, శివుడి గురించి తపస్సు చేశాడు. శివుడు ఆ తపస్సుకు మెచ్చుకొని, ఏం వరం కావాలో కోరుకో అనగా… పురూరువ చక్రవర్తి లోకహితం కోసం నర్మదా నదిని భూమి మీదకు పంపించమని వేడుకొన్నాడు. అంతేకాకుండా ఆ నది లేని కారణంగా లక్ష యోజనాల వైశాల్యం గల జంబూద్వీపం నిరాధారమైపోతుందని దేవతల, పితృ దేవతలు, మనుష్యులు తృప్తి పొందటం లేదని విన్నవించాడు.

 

అప్పుడు మహాదేవుడు రాజా కోరరాని వస్తువు కోరుతున్నావు. ఈ వరం దేవతలకు కూడా దుర్లభమే. నర్మదను తప్ప మరేదైనా కోరుకో అన్నాడు. పురూరవుడు ప్రాణం పోయినా నాకు నర్మద తప్ప మరొకటి అక్కరలేదు. అని భీష్మించుకొని మళ్లీ ఉగ్ర తపస్సు చేశాడు. చివరకు మహా దేవుడు ప్రసన్నమై, నర్మదను పిలిచి ఓ దేవేశ్వరీ… నీవు భూమి మీదకు దిగి పురూరవుని తప: ఫలితంగా మృత్యు ముఖంలో వున్న మానవులను ఉద్ధరించి, స్వర్గ ప్రదానం చేయమని చెప్పాడు. అప్పుడు నర్మద ‘‘మహేశ్వరా… నన్ను భరించగలిగే ఆధారం లేకుండా స్వర్గం నుంచి భూమి మీదకు దిగితే భూమి ధ్వంసమై పోదా? అని అడిగింది. నర్మద మాటలు విన్న శివుడు, కుల పర్వతాలను ఎనిమిదింటిని పిలిచిపించి, స్వర్గం నుంచి భూమి మీదకు దిగే నర్మదను మీలో ఎవరు భరిస్తారు? అని అడిగాడు. అప్పుడు వింధ్య పర్వతము లేచి ఓ మహేశ్వరా మీరు అనుగ్రహిస్తే నర్మదా నదిని పర్యంకుడు అనే పేరు కలిగిన నా కుమారుడు భరిస్తాడు అనగా శివుడు అందుకు అంగీకరించాడు. అప్పుడు పర్యంకం శివుని పూజించి నర్మదను భరించడానికి సంసిద్ధుడయ్యాడు. అప్పుడు నర్మద పర్యంక పర్వత శిఖరం మీద నుంచి భూమి మీదకు దూకింది. ఈ వేగానికి భూమండలం అంతా అల్లకల్లోలమైంది. అకాల జల ప్రళయమైంది. అప్పుడు దేవతలంతా కలిసి మేఖల పుత్రిక అయిన నర్మదను అందరూ స్తుతించారు. ‘‘ఓ నదీ దేవి… నీవు అనంత శక్తిమంతురాలవు. దయతో నిన్ను నీవే అదుపులో పెట్టుకో… ఒక సరిహదుÊ పెట్టుకొని సక్రమంగా ప్రవహించి విశ్వానికి హితం చేయమని కోరగా… నర్మద తన రూపాన్ని సంకుచితం చేసుకొని, పద్ధతి ప్రకారం ప్రవహించడం మొదలు పెట్టింది.

ఆ తర్వాత నదీ దేవి పురూరవునితో తన జలాన్ని స్పర్శించి, పితృ తర్పణమిచ్చి తరించమని సలహా ఇచ్చింది. వెంటనే పురూరవుడు ఆ నదీ జలాలను స్పర్శించి, ఆచమనం చేసి పితృదేవతలకు నువ్వులతో, నర్మదా జలాలతో తర్పణ చేశాడు. ఆ జల తర్పణం పొందిన పురూరవుని పితరులు, దేవతలకు కూడా దుర్లభమైన పరమ పదాన్ని పొందారు. నర్మద రాకతో జగత్తు అంతా పవిత్రమైంది.

నర్మదా నది పుష్కరాలు ఎక్కడెక్కడ జరుగుతాయో చూద్దాం…

అమర్‌కంఠక్‌ : నర్మదా నది మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంఠక్‌లో ఆవిర్భవించి.. పశ్చిమ దిశగా ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌లలో వేలాది మైళ్లు ప్రవహించి.. పారిశ్రామిక నగరమైన సూరత్‌ను అక్కున చేర్చుకొని, అరేబియా సముద్రంలో కలుస్తుంది. మధ్యప్రదేశ్‌లో నర్మదా నది ప్రవహించే ప్రాంతాలలో అమర్‌కంఠక్‌ను హిందువులు అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణిస్తారు. ఇక్కడ చాలా పుణ్యక్షేత్రాలున్నాయి. అమర్‌కంఠక్‌లో పుష్కర స్నానం చేస్తే ఎన్నో జన్మల పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.

జబల్‌పుర్‌ : నర్మదా నది ఒడ్డున ఉన్న మరొక పవిత్రమైన పట్టణం మధ్యప్రదేశ్​లోని జబల్‌పుర్‌. ఇక్కడికి పుష్కర స్నానం చేయడానికి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు. జబల్‌పుర్‌లో పవిత్ర నదీ స్నానం చేసిన తర్వాత హనుమంతల్‌ బడా జైన్‌మందిర్‌, మదన్‌ మహల్‌, దుమ్నా ప్రకృతి ఉద్యానవనం, రాణి దుర్గావతి మ్యూజియం తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు..

హోషంగాబాద్‌ :నర్మదా నది పుష్కరాలను మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌ నగరంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ ఉన్న సేతుని ఘాట్‌లో నదీ స్నానం చేయడానికి, పూజలు చేయడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.

ఓంకారేశ్వర్‌ : మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లాలో నర్మదా నది ఒడ్డున ఓంకారేశ్వర్‌ పట్టణం ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఓంకారేశ్వర పుణ్య క్షేత్రం ఉంది.  పుష్కర సమయంలో ఇక్కడ స్నానం చేసి మోక్షం పొందడానికి లక్షల మంది భక్తులు తరలివస్తారు. ఓంకారేశ్వరంలో ఆ పరమశివుడు ఓంకార రూపంలో దర్శనమిస్తాడని పండితులు చెబుతున్నారు. అందుకే దీనిని ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భక్తులు భావిస్తారు.

మహేశ్వర్ : మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లాలో నర్మదా నది ఒడ్డున మహేశ్వర్ పట్టణం ఉంది. పురాతనమైన ఈ పట్టణంలో ఎన్నో ఆలయాలు, చారిత్రక ప్రదేశాలున్నాయి. ఇక్కడ పవిత్ర స్నానం చేయడానికి నిత్యం ఎంతో మంది భక్తుల తరలివస్తుంటారు. పుష్కర సమయంలో ఈ సంఖ్య లక్షల్లోనే ఉంటుందని చెప్పవచ్చు.

భరూచ్ : మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంఠక్‌లో జన్మించిన నర్మదా నది.. గుజరాత్‌లోని భరూచ్‌ జిల్లా మార్గాన ప్రవహించి చివరిగా అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఎన్నో వేల ఏళ్ల క్రితమే ఈ పట్టణం ఉందని చారిత్రక ఆధారాలున్నాయి. అందుకే ఇక్కడ చుట్టు పక్కల ప్రాంతాల్లో చాలా పురాతన కట్టడాలు, ఆలయాలున్నాయి. ఇక్కడికి ఎంతో మంది భక్తులు పుష్కర స్నానం చేయడానికి తరలివస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *