చిన్నతరహా వ్యవసాయదారులకు వెన్నుదన్ను డాక్టర్ స్వాతి.. వరి సాగుకి జీవం పోస్తున్న శాస్త్రవేత్త
శాస్త్రం అంటే ఏమిటో ఒకే ఒక వాక్యంలో నిర్వచించారు డాక్టర్ స్వాతి. వ్యవసాయరంగాన పేరొందిన భారతీయ శాస్త్రవేత్త ఆమె. ఈ ఏడాది (2023)కి సంబంధించి ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. ఇదే సందర్భంలో, అభినందన సదస్సులో మాట్లాడుతూ.. అంశాల క్రోడీకరణ. ప్రస్ఫుటరీతి నిర్ణయం, సూత్రీకరణ సముదాయమే శాస్త్రమన్నారు. ఇవే మూడింటినీ కలగలిపి వరి పరిశోధనకు అన్వయించారు కాబట్టే, అంతర్జాతీయ విఖ్యాతిని సొంతం చేసుకున్నారు. దేశ రాజధాని నగరంలోని ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఆర్‌ఆర్‌ఐ) విభాగ అధినేత్రి. తన విభాగమైన క్షేత్ర పరిశోధనను పురోగమింపచేయడంలో, సకాలంలో సరైన తీరులో సమన్వయించడంలో అద్భుత ప్రతిభ చూపారన్నది అవార్డు కమిటీ ప్రశంస. నలభయ్ ఏళ్లలోపు వయస్కురాలైన స్వాతి శాస్త్రరంగంలో అద్వితీయంగా నిలిచారన్నదీ మరో కితాబు. ప్రత్యేకించి చిన్నతరహా వ్యవసాయదారులకు వెన్నుదన్ను అయ్యారని, పలువిధాల సేవా సహాయ సహకారాలతో తనదైన ఓ శాశ్వత ముద్ర వేశారనీ పురస్కృతి నిర్ణయ వ్యవస్థ ‘వరల్డ్ ఫుడ్ పౌండేషన్’ ప్రకటించింది. వీటన్నింటి వివరాలనూ పరిశీలించి చూస్తే చాలు, స్వాతి సాధించిన ఘనత ఎంత అత్యున్నతమో అవగతమవుతుంది. శాస్త్రవేత్త అనే పదానికి పర్యాయమై వెలుగుతున్నారో సంపూర్ణంగా ప్రత్యక్షమవుతుంది.
స్వాతి స్వస్థలం ఒడిశా. అక్కడి ఆర్థిక సుస్థితికి ప్రధాన వనరు వరి. మొత్తం జనాభాలో అరవై శాతంపైగా వ్యవసాయాధార జీవనం గడుపు తుంటారు. ప్రత్యేకించి మహానది డెల్టాలో అధికంగా ఉండేది వరే! ఎంతగానో అవగాహన, క్షేత్ర సంబంధ అనుభవమూ ఉన్న కుటుంబంలో పుట్టారు ఆమె. మొదటి నుంచీ శోధన, సాధన గురించిన మక్కువే విస్తృతంగా ఏర్పడింది. పదహారేళ్ల క్రితం హైదరాబాద్ లోని ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి సైన్స్ డిగ్రీ స్వీకరించారు. వ్యవసాయ శాస్త్రంలో మరెన్నో అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, గట్టిపట్టు సాధించిన నేపథ్యం తనది. అనేక విస్తరణ విధానాల పరంగా లోతైన అనుశీలన కొనసాగించి, పీహెచ్‌డీ సంపాదించి డాక్టర్ అయ్యారు. అత్యాధునిక తీరు తెన్నులను పరిపూర్ణంగా ఆకళింపుచేసుకున్నారు. వాతావరణా నికి అనువైన సేద్య నిర్వహణ, నాణ్యమైన విత్తనాల వినియోగం, సరికొత్త పక్రియలను ఆచరణకు తేవడంలో కృతకృత్యులయ్యారు. డిగ్రీలో ఉండగానే, అంతర్జాతీయ స్థాయి శాస్త్ర విజ్ఞాన సదస్సు నిర్వహణలో కీలకపాత్ర వహించారు. పొలాల నుంచి విద్యాలయ ఆవరణలోనికి వ్యవసాయదారులను రప్పించి, వారితో సేద్యం అనుభవాలను సవివరంగా చెప్పించారు. వర్సిటీలో ఉన్న నాలుగేళ్లూ క్రియాశీలక స్థాయిని పరిపోషించారు. గ్రామీణ యాజమాన్య స్థితిపైన చూపుసారించి, పరిశోధకపత్ర సమర్పణ చేశారు. సాంకేతికత బదలాయింపుమీద దృషి కేంద్రీకరించారు.
సృజన సంపన్నత
సేద్యం అనేది పుస్తకాల్లో ఉండదు. నిర్వహణమనే లక్షణం మాటలతో ఒరిగిపడేదీ కాదు. అనుభవశీలతే సత్వర ఫలితాలు ఇస్తుందన్నది స్వాతి మొదటి నుంచీ చెప్తున్న మాట. అది రాతలోకి వచ్చేలా, పుస్తక ప్రచురణ చేశారు స్వాతి. ‘నేటి వరి విధానం’ అంటూ సమగ్ర సమాచారంతో కూడిన వ్యాస పరంపరను వెలువరించారు. విత్తన వ్యవస్థలో సాంకేతికత, సృజనాత్మకత అంటూ పబ్లికేషన్స్ వెలయించారు.
స్వరాష్ట్రం ఒడిశాను బిహార్‌తో సరిపోలుస్తూ, అంతరాలను విశదీకరిస్తూ చర్చా పత్రాన్ని విడుదల చేశారు స్వాతి. కరవు కాటకాలను తట్టుకునే పద్ధతులను అందులో ఉదాహరణ సహితంగా వివరించారు. మేలైన, దీటైన, లాభదాయకమైన వంగడాల గురించి విశేషాలనేకం పొందుపరిచారు. ‘వ్యవసాయ క్షేత్రం నుంచి విపణి సీమలోకి’ అనే శీర్షికన వాస్తవ కథనాలనూ ప్రచురితం చేశారు. సామాజిక, ఆర్థిక ప్రతిబంధకాలను తొలగించుకునే మార్గాలనూ ప్రతిపాదించారు. ఇంతేకాకుండా, విత్తన ఉత్పత్తిరంగంలో సుశిక్షిత వనితా బృందాలను రూపొందించుకోవడంపై సూచనలిచ్చారు. ‘విమెన్ రైస్ ఫార్మర్స్’ అనేది తాను వివిధ సందర్భాల్లో ఉపయోగించిన పదబంధం. ప్రగతి పథంలో మహిళల పేరిట‘ రైస్ టుడే’ సంచికలో అసంఖ్యాకంగా వ్యాసాలు రాశారు. ఏ పనిచేపట్టినా, సంపూర్ణత లభించేదాకా వీడని తత్వం. ఐఆర్‌ఆర్‌ఐలో రీసెర్చి డేటా మేనేజిమెంట్, కాలిఫోర్నియా వర్సిటీ పరంగా ఇంపాక్ట్ ఎవల్యూషన్, అదే విధంగా బేసిక్ సైంటిఫిక్ రైటింగ్ కోర్సుకు సంబంధించీ ప్రావీణ్యత గడించిన మహిళామణి. బహుముఖ ప్రజ్ఞాధురీణ.
అంతటా నిపుణత
మాతృభాష ఒరియాతో పాటు తెలుగు, ఆంగ్లం, బెంగాలీ, హిందీ భాషల్లో నిపుణత డాక్టర్ స్వాతి సొంతం! మొదట్లో కొంతకాలం ఆంధప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకు రాలిగా బాధ్యతలు నిర్వహించారు. అనేక ప్రాజెక్టు మానిటరింగ యూనిట్లను పరిశీలించి, అధ్యయనం చేసి, కొన్నింటి స్థాపన – నిర్వహణలను చేపట్టారు. పరిపాలన, సాంకేతిక, పర్యవేక్షక విధుల నిర్వహణలో పేరు తెచ్చుకున్నారు. ప్రణాళిక, కార్యాచరణల్లో ముందు వరసన నిలిచారు. ప్రతీ దశలోనూ, వాస్తవిక రీతులను పరిగణించి, మున్మందుకు సాగిపోయారు.
ప్రపంచ బ్యాంకు పర్యవేక్షణలో భారత ప్రభుత్వ సంయుక్త నిర్వాహకత్వంలో ఉన్న వ్యవస్థ – నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. ఇందులో కార్యశీలత కనబరచిన స్వాతి ప్రముఖంగా.. మహిళారైతులను ప్రోత్సహించి ముందుకు నడిపించారు. వనితా రైతుల సాధికారతకు అనువుగా మార్గదర్శక సూత్రాల రూపకల్పనకు ఉపకరించారు. ప్రామాణికతను దృష్టిలో పెట్టుకుని జాతీయ, ప్రాంతీయ స్థాయుల్లో కార్యక్రమాలు నిర్వహించారు. అంతర్జాతీయ నియమావళికి అనుబంధంగా వ్యవహరించి, వ్యవసాయ కుటుంబాల ఆత్మబంధువుగా పూర్తి అభిమానం పొందగలిగారు. ఏ దశలో కూడా రాజీ అన్నదే లేకుండా, పరిపూర్ణత నెలకొనేలా తోడూ నీడై నిలిచిన శక్తిశాలిని. వ్యావసాయిక పరిశోధన, అభివృద్ధి పక్రియల్లో సరికొత్త ప్రమాణాలకు కారకురాలయ్యారు. ఆహారభద్రత, నైపుణ్య అభివృద్ధి లక్ష్యాలుగా వినూత్న పథకాల అమలుకు దోహదకారి అనిపించు కున్నారు. వరి పరిశోధనకు సంబంధించి, అంతర్జాతీయ స్థాయిలో తన ప్రత్యేకతను నిరూపించుకున్న ఆ లలన భారతీయ విలక్షణతను తేటతెల్లం చేయగలిగారు. ఆరు దశాబ్దాలకు పైగా చరిత్ర గల ‘రీసెర్చ్ ఇన్‌సిట్యూట్’ ఎటువంటి లాభాపేక్ష లేకుండా, వ్యవసాయ పరిశోధనకు అంకితమైన సంస్థ. అందులో ప్రముఖురాలిగా డాక్టర్ స్వాతి తన స్థానాన్ని లబెట్టుకుంటున్నారు.
విలక్షణ కృషికి పురస్కృతి
చిన్నపాటి రైతులు సాగు చేసుకునేందుకు వీలైన వరివంగడాల రూపకల్పనే ఆమె ఘనత, విశిష్టత! అందుకనే వరల్డ్ ఫుడ్ ఫ్రైజ్ ఫౌండేషన్ అభినందన మందారాలందించింది. ప్రపంచంలో ఆయా చోట్ల విశేష కృషి సాగించే యువ శాస్త్రజ్ఞులకు అవార్డును అందిస్తుంటుంది రాక్‌ఫెల్లర్ పౌండేషన్. ఈసారి అవార్డు స్వాతికి లభించిందంటే, ఎంతో గర్వకారణం కాదా మరి? అమెరికాలోని ఒక ప్రత్యేక సదస్సు వేదికమీద అక్టోబరులో పురస్కృతి అందుకోనున్నారు ఆ శాస్త్రజ్ఞురాలు.
ఎవరి పేరుతో ఈ అవార్డు అంటే, నార్మన్ బోర్లాగ్ పేరుతో! అమెరికాలో సుప్రసిద్ధులు, ప్రపంచమంతటా శాస్త్రవేత్తలకు అభిమాన పాత్రులు ఆయన. ఆ దేశంలో హరితవిప్లవ రూపశిల్పి. నోబెల్ స్వీకర్తగా జగద్విఖ్యాతి. శాంతి బహుమతిని అందుకున్నవారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి, అంచెలంచెలుగా, ఎదిగి అంతర్జాతీయ స్థాయిలో పేరెన్నిక గడించిన మహత్తర తత్వచింతన తనది. చీడపీడలను తట్టుకునేలా పొట్టిరకం గోధుమ వంగడాలను సృజించిన సంచలన వాది. అధిక దిగుబడినిచ్చే వాటితో ఆహారభద్రతకు భరోసానిచ్చిన శాస్త్రవేత్త. అంతటి మహనీయుని పేరిట గల బహూకృతిని భారతీయ వనితా శాస్త్రవేత్త అందుకుంటున్నారంటే, అంతకుమించిన జ్ఞాన సంపన్నత ఇంకేముంటుంది? వరి శోధన ద్వారా ఆమె సాగిస్తోందంతా ఆకలిని రూపుమాపే మహత్తర కృషి. ఆహారభద్రత సాధించేందుకు ఎంతగానో పరిశ్రమిస్తున్నందునే, ప్రతిష్ఠాత్మక అవార్డుకు అర్హులయ్యారు. ఒడిశాలో జన్మించి, పొరుగు రాష్ట్రమైన తెలుగునాట ఉన్నత విద్యాభ్యాసం సాగించి, ప్రసిద్ధ సంస్థల్లో వృత్తి – బాధ్యతలు నిర్వర్తిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా ‘స్వాతీ! ది గ్రేట్’ అని పిలిపించు కున్నారీ మగువ. నారీలోకానికి మార్గదర్శకంగా నిలుస్తూ, శాస్త్రజ్యోతిని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. కలలను సాకారంచేసుకునే దారిని యువతకు నిర్దేశిస్తున్నారు.
ప్రతిభకు ప్రోత్సాహం తోడైతే అద్భుతాలే సిద్ధిస్తాయి. వ్యవసాయ కుటుంబం నేపథ్యమున్న యువత అదే రంగాన పరమోన్నతి సంపాదించి, భారతీయతను మరింత వెలిగిస్తున్న సందర్భం ఇది. భారతీయులందరి హృదయాలూ పులకిస్తున్న ఈ శుభతరుణాన ‘స్వాతీ! మీకు జేజేలు’.
(జాగృతి పత్రిక సౌజన్యం తో )