జాతీయ పత్తి పరిశోధన సంస్థ కొత్త నిర్ణయం… ”అధిక సాంద్రత పద్ధతి”లో పత్తి సాగు
వానాకాలంలో సీజన్‌ల అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేయాలని జాతీయ పత్తి పరిశోధన సంస్థ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా తెలంగాణలో రెండు ప్రాంతాలను ఎంచుకుని, ప్రయోగాలు ప్రారంభించింది. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలను జాతీయ పత్తి పరిశోధన సంస్థ ఎంచుకుంది. ఈ కృషిలో భాగంగా వ్యవసాయ శాఖతో పాటు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం రైతులను ప్రోత్సహించాలని సంస్థ ఆదేశించింది. దీంతో ఈ రెండు శాఖలు కూడా ఇప్పటికే ఈ రెండు జిల్లాల్లో అవగాహన సదస్సునుల నిర్వహించాయి. ఈ ‘‘అధిక సాంద్రత పద్ధతి’’ అనే ప్రత్యేక సాగు విధానంలో అధిక దిగుబడులు సాధ్యమని శాస్త్రవేత్తలు అంటున్నారు.
కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలోని ప్రస్తుత వానాకాలం సీజన్‌లో 524 ఎకరాల్లో అధిక సాంద్రత పత్తి సాగు చేసేలా జాతీయ పత్తి పరిశోధన సంస్థ లక్ష్యాన్ని పెట్టింది. ఈ బాధ్యతల్ని జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం తమ భుజాలకెత్తుకుంది.ఈ నూతన ఒరవడితో పత్తిని సాగు చేసేలా ఈ కేంద్రం రైతులను కూడా ప్రోత్సహిస్తోంది. అయితే.. సాధారణ పత్తి సాగుకు భిన్నంగా విత్తనాలను దగ్గర దగ్గరగా విత్తి…. మొక్కల సంఖ్యను పెంచడమే ఈ అధిక సాంద్రత సాగు విధానం పద్ధతి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకోసం ఎర్రనేలలు, చెలక నెలలు ఎక్కడైతే వుంటాయో… ఆ గ్రామాలనే ఎంచుకొని.. ఈ ప్రయోగం చేపట్టారు.
అయితే.. సహజ సాగు పద్ధతి ఎకరా విస్తీర్ణంలో 5,555నుంచి 7,407 మొక్కలు వుండటం వల్ల 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వుంటుంది. అదే అధిక సాంద్రత పద్ధతిలో దగ్గరదగ్గరగా 29,629 మొక్కలు వుంటాయని, తద్వారా ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశమున్నట్లు పరిశోధనలో తేలిందని చెబుతున్నారు. సాధారణంగా జూన్‌లో పత్తి విత్తుకున్న రైతులు పంట సాగుకు 190 రోజులు పడుతుంది. విడతల వారీగా అయిదారు సార్లు పత్తి ఏరడం వుంటుంఇ. అదే అధిక సాంద్రత విధానంలో పంటంతా ఒకేసారి పూత, కాత, దిగుబడి కూడా చేతికి వచ్చేస్తుంది. పంట కాలం కూడా 150 నుంచి 170 రోజులే. తెగుళ్లు లేకుండానే ఒకేసారి పంట కూడా చేతికి వస్తుంది. ఈ కొత్త విధానంలో పెట్టుబడి కాస్త ఎక్కువగా వుంటుందని, అందుకే రైతులకు ఆర్థిక ప్రోత్సాహం అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అన్నీ కలిపితే 5 వేల రూపాయలు ఎకరాకి ఖర్చు అవుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ పెట్టుబడిని కూడా తాము ఎంచుకున్న రైతులకి తామే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.