రైతుల కోసం టోల్ ఫ్రీ నెంబర్.. దేశ వ్యాప్తంగా 22 భాషల్లోకి అందుబాటులోకి
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులకు ఓ గుడ్ న్యూస్ ను అందించింది. రైతుల కోసం దేశ వ్యాప్తంగా ఒకే టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రారంభించనుంది. ఢిల్లీ కేంద్రంగా 100 సీట్ల కాల్ సెంటర్ అందుబాటులోకి రానుంది. అయితే.. ఈ టోల్ ఫ్రీ నెంబర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. కేంద్రం ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు రైతులకు ఏం చేస్తున్నాయి? కేంద్ర ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ పథకాలను ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి రైతులు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే రైతుల ఫిర్యాదులను పరిష్కరించడానికి కూడా ఈ టోల్ ఫ్రీ పనికొస్తుంది.అలాగే సకాలంలో ఫిర్యాదులను పరిష్కరించడం ద్వారా రైతుల సేవలను మెరుగుపరచడంలో కేంద్రానికి ఈ సెంటర్ ఉపకరిస్తుందని, అలాగే సకాలంలో రైతులకు లాభం చేకూర్చడానికి ఈ ప్రాజెక్టు సహకరిస్తుందని అధికారులు తెలిపారు.
ఈ మధ్య కనీస మద్దతు ధర విషయంలో చట్టపరమైన హామీ కోసం రైతులు ఆందోళన చేస్తున్నారు. దీంతో కనీస మద్దతు ధర విషయంలో అప్ డేట్ వర్షన్ కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. వీటితో పాటు పీఎం కిసాన్ అనేది మరో పెద్ద పథకం. దీనికి సంబంధించినది కూడా సమాచారం తెలుసుకోవచ్చు.
ఇప్పటికే కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇలాంటి హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తామని ఆగస్టు మాసంలో ప్రకటించారు. మరి కొన్ని రోజుల్లోనే ఈ హెల్ఫ్ లైన్ అందుబాటులోకి రానుంది. వచ్చే యేడాది ప్రారంభ మాసంలోనే దీనికి సంబంధించిన ప్రాజెక్టు కోసం వేలం వేయాలని కూడా కేంద్ర వ్యవసాయ శాఖ ఓ నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. టెలికమ్యూనికేషన్స్ కన్సల్టంట్ ఇండియ లిమిటెడ్ ఇప్పటి వరకైతే ఈ ప్రాజెక్టును అమలు చేయడానికి ఆసక్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం.
రైతు ఫిర్యాదులను పరిష్కరించానికి వారం రోజులూ ఈ హెల్ప్ లైన్ పనిచేస్తుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అన్ని టెలికాం నెట్ వర్క్ ల్యాండ్ లైన్ మరియు మొబైల్ నెంబర్ల ద్వారా ఈ హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేయవచ్చు. దేశ వ్యాప్తంగా మొత్తం 22 భాషల్లో రైతులు సమాచారం తెలుసుకోవచ్చు లేదా ఫిర్యాదులు కూడా చేయవచ్చు. రైతులు ఫోన్లు చేస్తే ఫిర్యాదుల పరిష్కారం కోసం ఆయా రాష్ట్రానికి కేటాయించిన గ్రీవెన్స్ టెలి అడ్వైజర్లకు అందజేస్తారు. వీటన్నింటి వివరాలు తెలుసుకోడానికి కూడా కేంద్రం మరో వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఎలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి? అక్కడి వారు ఇస్తున్న జవాబు, రైతులతో మాట్లాడే విధానాన్ని నిశితంగా పరిశీలించడానికి ఢిల్లీలోని కృషి భవన్ లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అవుట్ బౌండ్ కాల్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు.