వనవాసీ గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ సేవలు చేస్తున్న నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్

వనవాసీ క్షేత్రాల్లో, మారుమూల పల్లెల్లో వైద్య సేవలు అందిస్తూ నేషనల్ మెడికోస్ టీమ్ ఆరోగ్య భారతం కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలోని 15 వనవాసీ పల్లెలకు వెళ్లి, నేషనల్ మెడికోస్ బృందం వైద్య పరీక్షలు నిర్వహించింది. ఇది రెండు రోజుల పాటు సాగింది. ‘‘కొమురం భీం స్వాస్త్య సేవాయాత్ర’’ పేరుతో ఈ కార్యక్రమం సాగింది. ఇందులో 150 మంది వైద్య విద్యార్థులు, వైద్యులు ఓ బృందంగా ఏర్పడి… రోజంతా వనవాసీ గూడెల్లో, మారుమూల పల్లెల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించారు. రాత్రులు అక్కడే బస చేశారు. ఈ సేవా యాత్రకు ఏకలవ్య ఫౌండేషన్ తమ పూర్తి సహాయ సహకారాలను అందించింది. రెండు రోజుల పాటు సుమారు 500 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, వారికి కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు. ఔషదాలు అవసరమైన వారికి ఔషదాలను కూడా ఉచితంగానే అందించారు. అలాగే శుభ్రత, ఆరోగ్య విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకునే ఆహారంపై వనవాసులకు ఈ బృందాలు అవగాహనను కల్పించాయి.

తెలంగాణతెలంగాణ నలుమూలల నుండి 150 మంది మెడికోలు మరియు 30 మంది వైద్యుల బృందం ఈ కార్యక్రమంలో పాల్గొంది. హైపర్‌టెన్షన్ మరియు డయాబెటిస్‌పై దృష్టి సారించి, 500 మందికి పైగా రోగులకు ప్రయోజనం చేకూర్చే ఆరోగ్య పరీక్షలను కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెడికోలు అందరూ అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. వనవాసులతో వెంటనే మమేకమైపోయారు. వారి ఆప్యాయతను వీరు అందుకున్నారు.. వీరి ఆప్యాయతను వారందరుకున్నారు. తమ కుటుంబ సభ్యుల లాగానే వనవాసులందర్నీ మెడికోలు దగ్గరికి తీసి, వారికున్న ఆరోగ్య సమస్యలకు పరిష్కార మార్గాలకు చూపించారు. అవసరమైన వారికి అక్కడికక్కడే ఔషదాలను కూడా అందించి తమ గురుతర బాధ్యతను నిర్వహించారు.

ఈ రెండు రోజుల క్యాంపులో బీపీ, షుగర్ తో పాటు జనరల్ స్క్రీనింగులు కూడా ఈ బృందాలు నిర్వహించాయి. అవసరమైన వారి నుంచి బ్లడ్ షాంపుల్స్ కూడా సేకరించి, పూర్తి బ్లడ్ పిక్చర్, వైడల్ టెస్టులు, ఫీవర్ ప్రొఫైల్ వంటి వాటిని కూడా నిర్వహించారు. చిన్న పిల్లలకు మరింత ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించారు. సీజనల్ వ్యాధుల విషయంలో అత్యంత అప్రమత్తంగా వుండాలని వారికి సూచించారు. మరోవైపు మహిళల విషయంలో ఈ మెడికో బృందం మరింత లోతైన శ్రద్ధ వహించింది. నెలసరి రుతక్రమాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆ విషయంలో మరింత అవేర్ నెస్ కల్పించారు. అలాగే మహిళలకే ప్రత్యేకంగా వుండే వైద్య పరమైన ఇబ్బందులను కూడా వీరు పరిగణనలోకి తీసుకొని, వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, సూచనలు చేశారు.

NMO బృందాలు వైద్య సేవలు అందించిన గ్రామాలివే…

సోమార్ పేట, గర్కంపేట, పెద్ద మల్కాపూర్, ధరమడుగు, వైజాపూర్, ధమన్ గూడ, ధాంపూర్, వాల్గొండ, డోంగర్ గావ్, ధోనంద, హర్కాపూర్, హర్కాపూర్ అంధుగూడ, సిరికొండ, రాజ్యంపేట, గుడిహత్నూర్, ఇంద్రవెల్లి, సిరికొండ, ఆదిలాబాద్ రూరల్.

ఏకలవ్య ఫౌండేషన్ సమన్వయంతో

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ ప్రాంతంలో ఏకలవ్య ఫౌండేషన్ వుంది. ఈ ప్రాంతం కేంద్రంగా మారుమూల పల్లెలు, వనవాసీ క్షేత్రాల్లో ఈ ఫౌండేషన్ సేవలందిస్తోంది. వ్యవసాయం, వాటర్ షెడ్లు, గ్రామ పరిరక్షణ తదితర విషయాలపై ఏకలవ్య ఫౌండేషన్ అవగాహన కల్పిస్తోంది. కొన్ని సంవత్సరాలుగా ఈ పని నిరంతరాయంగా కొనసాగుతూనే వుంది. నిరంతరం వనవాసీ ప్రజలతో కలిసిపోయి, వారిలో అన్ని రకాల అవగాహనను కల్పిస్తోంది. దీనిని ఆధారంగా NMO ఏకలవ్య ఫౌండేషన్ సహాయం తీసుకుంది. NMO సభ్యులందరికీ ఏకలవ్య ఫౌండేషన్ ఆతిథ్యం ఇచ్చింది. ఏకలవ్య ఫౌండేషన్ మధుకర్ కుబిడే, ట్రస్టీ రాజుల వార్ దిగంబర్, సభ్యులు ముత్యం తదితరుల బృందం ఈ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంది. వారి భోజన వ్యవస్థలు, బస, గ్రామాల ఎంపిక ఇదంతా ఏకలవ్య ఫౌండేషన్ చేసి వుంచింది. వీరితో తెలంగాణ ప్రాంత సేవా ప్రముఖ్ శివశంకర్ గారు, NMO విద్యార్థి ప్రముఖ్ సాయి దీప్ సమన్వయం చేసుకున్నారు.

ప్రారంభోత్సవ కార్యక్రమం…

ఏకలవ్య ఫౌండేషన్ హాలులో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ ప్రాంత సేవా భారతి ప్రముఖ్ వాసుజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెడికోలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వైద్యులు క్షేత్ర స్థాయికి వెళ్తేనే ప్రజల జీవితాలు తెలుస్తాయన్నారు. కేవలం ఔషదాలిస్తే సరిపోదన్నారు. క్షేత్ర స్థాయిలోకి వెళితే ప్రజల జీవన శైలి తెలుస్తుందన్నారు. ఏమీ ఆశించకుండా చేసేదే సేవ అవుతుందని, ఆశించి ఏదైనా పని చేస్తే మాత్రం అది సేవ అనిపించుకోదన్నారు. వైద్యులు సేవా దృక్పథంతో పనిచేయాలని కోరారు. సరైన వైద్య విధానాలు, వైద్యం అందక ప్రతి యేడాదికి 3 లక్షల మంది వికలాంగులుగా అవుతున్నారని, దీనిపై వైద్యులందరూ కలిసి కట్టుగా పోరాటం చేసి, దీనిని రూపుమాపాలన్నారు. వైద్య రంగంలో ఇంకా అనేక మార్పులు రావాల్సిన అవసరం వుందని అభిప్రాయపడ్డారు. అట్టడుగున వున్న ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్యం అందాలని, అప్పుడు భారత్ కి జయం కలుగుతుందన్నారు. స్వాస్త్య సేవాసే రాష్ట్ర సేవా అన్న నినాదంతో NMO ముందుకు సాగుతోందని, దీనికి మరింత మంది వైద్య విద్యార్థులు, వైద్యులు బలాన్నివ్వాలని కోరారు. వైద్యాన్ని మారుమూల పల్లెల్లో వున్న వారికి ఆధునిక టెక్నాలజీతో అనుసంధానిస్తే బాగుంటుందని సూచించారు. ఆ వైద్యుడు ఎక్కడున్నా.. టెక్నాలజీతో తమ పేషెంట్ల పరిస్థితిని చూసి, సరైన సలహాలు, సూచనలు ఇచ్చే వ్యవస్థ అందుబాటులోకి రావాలని వాసూజీ సూచించారు.

ఇక.. NMO తెలంగాణ ప్రాంత సంఘటనా కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ గుండు ఈ కార్యక్రమ ఉద్దేశాన్ని వివరించారు. NMO స్థాపన, దానికి గల కారణాలు, లక్ష్యాలను మెడికోలకు వివరించారు. యేడాది పొడవునా తాము చేస్తున్న పనులు, మెడికల్ కళాశాలల ఆధారంగా చేయాల్సిన ఇతర పనులను సూచించారు. NMO తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు డాక్టర్ శంకర్ కూడా ఈ స్వాస్త్య యాత్రకు సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా మెడికోలకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

వనవాసీకి సంబంధించి 15 గ్రామాల్లోకి వెళ్లి, సేవలందించడానికి NMO తెలంగాణ బాధ్యులు తగిన యోజనను చేశారు. 150 మందిని బృందాలుగా చేసి, వారికి కేటాయించిన గ్రామాల్లోకి పంపించారు. ఈ సందర్భంగా ఈ బృందానికి వనవాసీలు అత్యంత ఘనంగా హారతులు ఇచ్చి, డప్పులతో స్వాగతం పలికారు. అలాగే కొన్ని గ్రామాల్లో అయితే.. మెడికోల కాళ్లను కడిగి, హారతులిచ్చి మరీ.. స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రెండురోజుల పాటు మెడికోలు వుండడానికి వనవాసీలు ఏర్పాట్లు కూడా చేశారు. భోజన వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా వనవాసీలు తమ సంస్కృతి, సంప్రదాయాలు, దేవతలు, ఆహారపు అలవాట్లు, వ్యవసాయ పని విధానం, పశు పోషణ గురించి మెడికోలకు వివరించారు. అలాగే ప్రత్యేక ఆహార పదార్థాలను కూడా వండి వడ్డించారు. రాత్రి పల్లెల్లో గుస్సాడీ నృత్యాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అక్కయ్య, అన్నయ్య, అమ్మ.. అంటూ అత్యంత ఆప్యాయంగా మెడికోలను తమలో కలిపేసుకున్నారు వనవాసీలు. తమ పల్లెల్లోకి వచ్చిన మెడికోలను ఎద్దుల బండిపై ఊరేగిస్తూ తీసుకెళ్లిన సందర్భాలూ వున్నాయి. ఇది తమకెంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చిందని మెడికోలు పేర్కొన్నారు.

 

ఈ క్యాంపుల ద్వారా తేటతెల్లమైన ముఖ్య విషయాలు :

1. అత్యధికుల్లో విటమిన్ డి లోపం వుందని గుర్తింపు. ఎక్కువ మంది పాలు తాగరు. కాల్షియం లోపం అధికం. పండ్లు చాలా తక్కువగా తింటారు. మంచి నీటిని చాలా తక్కువగా తీసుకుంటారు. ఫ్లోరోసిస్ సమస్య కూడా గుర్తించారు. విటమిన్ల లోపం బాగా వుంది. పంట పండిస్తారు కానీ… వనవాసులు తినరు. దానిని అమ్మేసి, డబ్బు పోగు చేసుకుంటారని తెలిసింది. అలాగే చేతులను పరిశుభ్రం చేసుకోవడం కూడా తక్కువే. కొన్ని ప్రాంతాలలో చెప్పులు కూడా వేసుకోరు. మద్యపానం సేవించడం అధికంగా వుంది. మలేరియా, సీజనల్ వ్యాధులు అధికం. రక్తహీనత బాగా వుందని వెల్లడైంది. అనారోగ్యం సమయంలో టెస్టుల విషయంలో తీవ్ర అలసత్వం. హైపర్ టెన్షన్, మహిళలు తమ నెలసరి విషయంలో అంత సీరియస్ గా వుండకపోవడం. నెలసరి విషయమై ఇతరులతో ఏమాత్రం పంచుకోరు.బీపీ, షుగర్ సమస్యలు చాలా చాలా తక్కువ అని గుర్తించారు.

మెడికల్ క్యాంపు పూర్తైన తర్వాత మెడికోలు తమ అనుభవాలను ఎంతో ఉత్సాహంగా పంచుకున్నారు. ఈ స్వాస్త్య యాత్ర తమకెంతో అనుభవాన్ని ఇచ్చిందని సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు తమనెంతో ఆప్యాయంగా, ప్రేమతో చూసుకున్నారని, వారి సంస్కృతిని తమకు పరిచయం చేశారన్నారు. అలాగే రకరకాల ఆహార పదార్థాలను కూడా తమకు వడ్డించారని సంతృప్తి వ్యక్తం చేశారు. యాత్రను వుంటుందని చెప్పగానే.. కాస్త తటపటాయించిన మాట వాస్తమే గానీ… ఇక్కడికి వచ్చిన తర్వాత అత్యంత సంతృప్తితో తాము తిరిగి వెళ్తున్నామన్నారు. వనవాసుల ప్రేమ అత్యంత స్వచ్ఛమైందని అన్నారు.

నిజామాబాద్ నుంచి వచ్చిన వినయ్ కుమార్ అనే మెడికో తమ అనుభవాన్ని ఇలా పంచుకున్నాడు. ‘‘తమకి కేటాయించిన గ్రామంలో 25 కొల్లాం కుటుంబాలు వున్నాయి. మొత్తం 100 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాం. తాము ఊళ్లోకి వెళ్లగానే కాళ్లు కడిగి, హారుతులతో తమకు స్వాగతం పలికారు. పాలు, పెరుగు పుష్కలంగా ఇచ్చారు. తమ సంస్కృతి గురించి చెప్పారు. విటమిన్ డి లోపం బాగా వున్నట్లు తాము గుర్తించాం. పండ్లు తినడం చాలా తక్కువ అన్న విషయాన్ని గుర్తించాం. అలాగే కాల్షియం లోపం, ఫ్లోరోసిస్ కూడా వున్నట్లు గుర్తించాం. నీటిని చాలా తక్కువగా తీసుకుంటారని కూడా తెలుసుకున్నాం’’ అని తెలిపారు.

గర్కంపేటకి వెళ్లిన మరో మెడికో విద్యార్థి కూడా తమ అనుభవాలను పంచుకున్నారు. తాము పల్లెల్లో పశుపోషణ విశేషంగా ఆకట్టుకుందని తెలిపాడు. వనవాసులు ఆవు పాలను కూడా పిండేవారే కాదని, మొత్తం లేగ దూడకే విడిచిపెట్టేశారని తెలిపాడు. అలాగే పాలను కూడా అమ్మరని, ఆవులతో, పశు సంపదతో వ్యాపారం చేయడం ఆ పల్లెల్లో లేదని వెల్లడించారు. దీనిని చూసి తాము ఆశ్చర్యపోయామన్నారు. అలాగే తాము వనవాసీ సంస్కృతిని బాగా తెలుసుకోగలిగామని తెలిపారు. వైద్యంతో పాటు వనవాసీ పద్ధతులు, ఆచారాలు, సంప్రదాయాలను ఆకళింపు చేసుకోగలిగామని పేర్కొన్నారు.

పాము కాటు విషయంలో కాస్త నిర్లక్ష్యంగా వున్నారని, కొందరు చెప్పులు కూడా వేసుకోరని, దీనిని తాము గమనించామన్నారు. వనవాసులకు హ్యాండ్ వాష్ టెక్నిక్, శుభ్రత కూడా నేర్పించామన్నారు. అలాగే మలేరియా తీవ్రత, రక్తహీనత అధికంగా వున్నట్లు గుర్తించాంరు. అలాగే ఆల్కాహాల్ సేవించడం కూడా అధికంగా వున్నట్లు గుర్తించామని తెలిపారు.

సమారోప్ కార్యక్రమం

ఏకలవ్య ఫౌండేషన్ హాలులో జరిగిన సమారోప్ కార్యక్రమానికి సామాజిక సమరసతా వేదిక ప్రముఖ్ అప్పాల ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవ్వరి మీదా ఆధారపడకుండా తమంత తామే జీవించ గలిగే గ్రామాలు భారత్ లోనే అధికంగా వున్నాయన్నారు. భారత్ తో నడిచిన దేశాలు చాలానే వున్నాయి కానీ.. ఇప్పుడు అక్కడ కల్చర్ లేదన్నారు. కానీ భారత్ లో ఇప్పటికీ కల్చర్ సజీవంగానే వుందన్నారు. ఇదే భారత్ ప్రత్యేకమని, అందుకే ప్రపంచంలో భారత్ కి ప్రత్యేక స్థానముందన్నారు. ఇతర దేశాల్లో కుటుంబ వ్యవస్థ అనేదే లేదన్నారు. కానీ భారత్ లో మాత్రం కుటుంబ వ్యవస్థ సంపూర్ణంగా వుందని, దానిని నిలబెట్టుకోవాల్సిన అవసరం వుందని సూచించారు. రుగ్వేదం పుట్టిన దేశం భారత్ అని, సంగచ్ఛధ్వం, సంవదత్వం… అంటూ కలిసి నడుద్దాం కలిసి జీవిద్దాం అన్నది ఈ వేదం నుంచే పుట్టిందన్నారు. మార్గాలు వేర్వేరు అయినా… గమ్యం అందరిదీ ఒక్కటేనని మన సంప్రదాయం చెబుతోందని వివరించారు. ప్రపంచంలోని అందరి ఆత్మలను మేల్కొలిపిన వ్యక్తి వివేకానంద అని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొనే సోదరి నివేదిత భారత్ కి వచ్చి, సేవలు చేసిందన్నారు. మిగతా దేశాలన్నింటిదీ రక్త చరిత్రే అని, కానీ.. భారత్ మాత్రం అందరికీ స్నేహ హస్తమే అందిస్తుందన్నారు. మానవుడు తమ వ్యక్తిగత ఆనందం కోసం పనిచేయకూడదని, అందరి క్షేమాన్ని కాంక్షించాలన్నారు. వైద్య వృత్తి కూడా ఇదే చెబుతోందన్నారు. కరోనా సమయంలో ప్రపంచానికి భారత్ అన్నం పెట్టిందని, అలాగే మందులను కూడా సరఫరా చేసిందన్నారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో భారత్ లోని వైద్యులు అందరికీ నిర్భయంగా సేవలందిస్తూ.. ప్రజల్లో వున్న భయాలను తొలగించారని గుర్తు చేశారు. సమాజాన్ని రాజకీయ నేతలు బాగుచేయలేరని, ప్రజలే బాగు చేయాలన్నారు. సమాజం కోసం ప్రతి పౌరుడు రోజూ రెండు గంటల సమయం ఇవ్వాలని, గ్రామాలను దత్తత తీసుకొని వైద్యులు పనిచేస్తే… అనారోగ్యమే వుండదని అప్పాల ప్రసాద్ సూచించారు.

ముఖ్య లక్ష్యాలు ఇవే…

వైద్య విద్యను అభ్యసించే విద్యార్థుల్లో, ప్రాక్టీసింగ్ వైద్యుల్లో జాతీయ భావనలు, సేవా భావాన్ని జాగృతం చేయాలన్న లక్ష్యంతో నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ పనిచేస్తోంది. 1977 లో ఇద్దరు మెడికల్ విద్యార్థులు, కొంత మంది వైద్యులతో ఈ సంస్థ ప్రారంభమైంది. వనవాసీ పల్లెలు, మారుమూల ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ.. గ్రామీణ భారతాన్ని వీరికి పరిచయం చేయడమే ముఖ్య ఉద్దేశంగా నడస్తోంది. అయితే.. వీరు ఎక్కడ ఈ స్వాస్త్య యాత్ర చేసినా.. ఆ ప్రాంతంలోని రాజకీయేతర గొప్ప వ్యక్తుల పేర్లను జోడిస్తూ చేస్తారు. వనవాసి, నగరవాసి, గ్రామవాసి అన్న తేడాలేకుండా అందరూ భారత వాసులేనన్న స్ఫూర్తిని నింపడానికి ఈ సంస్థ కృషి చేస్తోంది. వనవాసీ క్షేత్రాలు, మారుమూల ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ.. రాత్రంతా అక్కడే బస చేసే యోజన ఆధారంగా వీరు పనిచేస్తారు. ధన్వంతరి పూజ, వివేకానంద జయంతి.. ఇలా ప్రముఖుల జయంతులను కూడా వీరు చేస్తుంటారు. రిషి కశ్యప్ స్వాస్త్య యాత్ర పేరుతో జమ్మూ కశ్మీర్ లో, ధన్వంతరి సేవా యాత్ర పేరుతో అసోంలో ప్రతి సంవత్సరం స్వాస్త్య యాత్రలు చేస్తూ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *