NCERT సిలబస్ లోకి ‘‘ఆపరేషన్ సిందూర్’’
కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. భారత సైన్యం పరాక్రమాలు, వీరత్వం, ధీరత్వాన్ని రాబోయే తరాలకు, విద్యార్థి లోకానికి పరిచయం చేయాలని నిర్ణయించింది. ఇందుకు గాను NCERT‘‘ఆపరేషన్ సిందూర్’’ పై ప్రత్యేక మాడ్యుల్ ను సిద్ధం చేస్తోంది.
దేశంలోని విద్యార్థులకు దేశభక్తి, జాతీయ భద్రత, సైనిక వ్యూహం, దౌత్యం ప్రాముఖ్యతను బోధించాలని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) ప్రత్యేక మాడ్యూల్‌ను సిద్ధం చేస్తోంది. ఈ మాడ్యూల్ రెండు భాగాలుగా విభజిస్తారు. ఒకటి 3- 8 తరగతుల విద్యార్థుల కోసం, మరొకటి 9 నుండి 12 తరగతుల విద్యార్థుల కోసం రూపొందిస్తారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సైన్యం చూపిన ధైర్యసాహసాలతో పాటు ఆదిత్య ఎల్1, చంద్రయాన్ అంతరిక్ష మిషన్లు, ఇటీవల శుభాన్షు శుక్లా ‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)’కు వెళ్లిన అంశాలను కొత్త సిలబస్‌లో చేర్చనున్నారు.
భావిభారత పౌరులైన విద్యార్థుల్లో దేశభక్తిని, జాతీయ భావనను పెంపొందించాలనే లక్ష్యంతో తాజాగా ఎన్‌సీఈఆర్‌టీ కీలక ముందడుగు వేసింది. ప్రిలిమినరీ స్థాయి నుంచి ఉన్నత స్థాయి విద్యార్థుల వరకూ ఆపరేషన్ సిందూర్ పై ప్రత్యేక సిలబస్ రూపకల్పనకు సన్నాహాలు చేస్తోంది. ఒక్కో మాడ్యూల్ 8 నుంచి 10 పేజీల వరకూ ఉంటుంది. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లో పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ అనుసరించిన వ్యూహాత్మక, సైనిక ప్రతిస్పందన, దౌత్యపరమైన చిక్కులు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలను పాఠ్యాంశాల్లో కవర్ చేస్తారు.