నెల్లూరు రైతుల కొత్త ప్రయోగం… ‘కలబంద’ వేసి.. లాభాలు.. క్యూ కట్టిన ఫార్మా కంపెనీలు
నెల్లూరు జిల్లా రైతులు వాణిజ్య, ఉద్యానవన పంటలపై మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆ జిల్లా వ్యవాస య విధానం కొత్త రూపు సంతరించుకుంది. రిజర్వాయర్లలో నీరు బాగా వుండటంతో వాణిజ్య పంటల వైపు తాము మొగ్గుతున్నామని, కొత్త ప్రయోగాలు కూడా చేస్తున్నామని రైతులు పేరొకొంటున్నారు. తాజాగా… అక్కడి రైతులు కలబంద పంటను పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. ఉద్యానవన శాఖ కూడా చిన్న, సన్నకారు రైతులను కలబంద పంట వైపు బాగా ప్రోత్సహిస్తోంది. అందుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు, సూచనలు అందజేస్తోంది. ఈ కలబంద పంటకి ఎక్కువగా నీరు అవసరం కూడా లేదు. అతి తక్కువ నీరున్నా… ఈ కలబంద పంటను వేసుకోవచ్చు.
నెల్లూరు జిల్లాలోనూ పొదలకూరు, సైదాపురం, ఏఎస్ పేట మండలాల్లో కలబంద సాగు చేస్తున్నారు. అయితే.. మొదట్లో కాస్త ప్రయోగాత్మకంగానే వేశారు. కొంత సక్సెస్ కావడంతో రైతులు క్రమంగా పంట విస్తీర్ణాన్ని పెంచుతూ వచ్చారు. ఇప్పుడు బాగా పెంచారు. క్రమంగా కలబంద పంట కూడా పెరగడంతో పొదలకూరు మండలం ఇంకుర్తి గ్రామం, బుచ్చిరెడ్డి పాలెం మండలం మినగల్లు గ్రామంలో రెండు కలబంద మొక్కల ఆధారిత పరిశ్రమలు పనిచేస్తున్నాయి.
మరోవైపు అలోవేరా సాగుకు 25 వేల ప్రాథమిక పెట్టుబడి వుంటే సరిపోతుందని పంట వేసిన రైతులు చెబుతున్నారు. ఎకరానికి 7 వేల వరకు మొక్కలు పెట్టవచ్చు. అయితే.. ప్రారంభంలో దిగుబడి కాస్త తక్కువగానే వున్నా… తర్వాత తర్వాత అది పెరుగుతుందని, ఇది తమ అనుభవంలోకి వచ్చిందని అంటున్నారు. రాష్ట్ర స్థాయిలో వున్న ఫార్మా కంపెనీలు, కాస్మొటిక్ యూనిట్లు నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నాయి. కేవలం 25 వేల ప్రారంభ పెట్టుబడితో 70,000 వరకు సంపాదించినట్లు రైతులు చెబుతున్నారు.