గుడ్ న్యూస్… సేంద్రీయ వ్యవసాయం “పంట పండింది”… పెరిగిన సేంద్రీయ వ్యవసాయం
ప్రపంచవ్యాప్తంగా సేంద్రీయ పంటల విస్తీర్ణం రెండు సంవత్సరాలతో పోలిస్తే పెరిగింది. 2021తో పోలిస్తే 2022 నాటికి సగటున 2.03 కోట్ల హెక్టార్లు పెరిగినట్లు వెల్లడైంది. ది వరల్డ్ ఆఫ్ ఆర్గానిక్ అగ్రికల్చర్ 2024 ను స్విట్జర్లాండ్‌కి చెందిన సేంద్రీయ వ్యవసాయ పరిశోధన సంస్థ, ఎఫ్‌ఐబీశ్రీల్, ఐఫోమ్ ఆర్గానిక్ ఇంటర్నేషనల్ విడుదల చేశాయి. ఈ సర్వేలో 199 దేశాల నుంచి సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయ గణాంకాలను సేకరించారు. గత 25 సంవత్సరాలుగా ఏటా ప్రపంచ సేంద్రీయ వ్యవసాయ గణాంకాలను ఈ సంస్థలు ప్రచురిస్తున్నాయి. భారత్ లో 77.8శాతం, గ్రీసులో 73 శాతం, ఆస్ట్రేలియాలో 48 శాతం సేంద్రీయ సాగు పెరిగిందని ఈ సర్వేలో తెలిసింది. అంతర్జాతీయ సేంద్రీయ వ్యవసాయోత్పత్తుల మార్కెట్ 2000 సంవత్సరంలో 15.1 బిలియన్ యూరోలుండగా, 2022 నాటికి దాదాపు 135 బిలియన్ యూరోలు అనగా 12.13 లక్షల కోట్లకు పెరిగింది. రిటైల్ అమ్మకాల్లో అమెరికా 56.6 బిలియన్ యూరోలతో అగ్రగామి కాగా, జర్మనీ, చైనా రెండు, మూడు స్థానాల్లో వున్నాయి.
ఈ నివేదిక ప్రకారం 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా 9.64 కోట్ల హెక్టార్లలో సేంద్రీయ వ్యవసాయం జరుగుతోంది. 2021 తో పోలిస్తే ఇది 26.6 శాతం ఎక్కువ.
2. సేంద్రీయ వ్యవసాయ విస్తీర్ణం 2022 లో 2 కోట్ల హెక్టార్లకు పైగా పెరిగింది. 5.3 కోట్ల హెక్టార్ల సేంద్రీయ సాగు విస్తీర్ణంతో ఆస్ట్రేలియా అత్యధిక విస్తీర్ణంలో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న దేశంగా నిలిచింది. 2022 లో ఆ దేశం 48.6 శాతం వృద్ధి సాధించింది.
3, 47 లక్షల సేంద్రీయ సేద్య విస్తీర్ణంతో భారత్ రెండో స్థానంలో వుంది. 2022 లో సేంద్రీయ వ్యవసాయ సేద్య విస్తీర్ణం 78 శాతం పెరిగింది.
4. ప్రపంచవ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయదారుల సంఖ్య 45 లక్షలు. నిజానికి 1999 లో 2 లక్షలుండగా… ఇప్పుడు పెరిగారు.
5. సేంద్రీయ సాగు ప్రాంతం సగానికి పైగా ఓషియానియా దేశాల్లో వుంది. 22 దేశాల్లోని వ్యవసాయ భూమిలో 10 శాతం లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగు జరుగుతోంది. అయినా మొత్తం సాగు భూమిలో ఇప్పటికీ సేంద్రీయ సాగు వైపు మళ్లింది 2 శాతమే.