‘సమగ్ర వ్యవసాయ’ విధానంతో లక్షల్లో ఆర్జిస్తున్న నిర్మల్ రైతులు

మారుతున్న పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు ఖర్చుల నేపథ్యంలో వ్యవసాయం కూడా అత్యంత కష్టంగా మారుతోంది. దీంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే… రైతుల చైతన్యం కూడా ఈ మధ్య పెరుగుతోంది. ప్రత్యామ్నాయ మార్గాల వైపు కూడబలుక్కొని మారుతున్నారు. తాజాగా… నిర్మల్ జిల్లా రైతులందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. వ్యవసాయం ఇబ్బందులు ఎదుర్కోవడంతో నిర్మల్ రైతులందరూ ‘‘సమీకృత వ్యవసాయం’’ అన్న పద్ధతి వైపు వెళ్లిపోయారు. దీంతో కాస్త లాభాల బాట పడుతున్నామని వారు వివరిస్తున్నారు. అయితే.. ఈ సమీకృత వ్యవసాయంలో మహిళలదే కీలక పాత్ర. గత సంవత్సరం నుంచి అక్కడి రైతులు సమీకృత వ్యవసాయం వైపు మళ్లడంతో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. అలాగే సుస్థిర వ్యవసాయ రంగంలో ఆదర్శప్రాయులుగా నిలుస్తున్నారు.

ఈ సుస్థిర వ్యవసాయం ద్వారా వెటివర్ గడ్డి, సేంద్రీయ ఆకు కూరలు, చేపల పెంపకం, పౌల్ట్రీని కూడా ఇదే పద్ధతిలో చేస్తున్నారు. ఓ వైపు పర్యావరణ సమతౌల్యంతో పాటు ఆర్థికంగా కూడా బాగుగా అవుతున్నారు. రైతులందరూ ఈ పద్ధతి వైపు రావడంతో స్థానిక వ్యవసాయ అధికారులు కూడా మద్దతు పలుకుతున్నారు. రకరకాల కొత్త పద్ధతులను వారికి చెబుతున్నారు. ఇది కూడా రైతులకు కలిసొచ్చింది.

అయితే.. 10 గుంటల భూమిలో ఈ రైతులు వెటివర్ గడ్డిని సాగు చేస్తూ… అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఈ సమీకృత వ్యవసాయ విధానం ద్వారా నీటి సంరక్షణ, నేల సుస్థిరత, స్థిరత్వానికి ఎంతో ఉపయోగకారిగా వుంటుందని వివరిస్తున్నారు. ఈ వెటివర్ గడ్డి నీటి ప్రవాహాన్ని నిరోధిస్తుందని, దీని ద్వారా వ్యవసాయ భూమిలో వుండే లవణాలు, పోషకాలు అలాగే వుంటాయన్నది రైతులు చెబుతున్న మాట. దీంతో పాటు నీటి సంరక్షణకి కూడా ఉపయోగకారి. సంవత్సరంలోనే వెటివర్ పంటలు కోతకు సిద్ధంగా వున్నాయని, గత సంవత్సరంలో వెటివర్ వేశామని రైతులు వివరించారు. ఈ వెటివర్ మొక్కలను అమ్మి, రైతులు లాభాలు కూడా గడిస్తున్నారు.

మరోవైపు ఈ సమగ్ర వ్యవసాయం అన్న పద్ధతితో రైతులు లాభాల్లో వున్నారని అక్కడి వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. మంచి రాబడి కూడా వస్తోందన్నారు. వెటివర్ మొక్కలను బెంగళూరు నుంచి నిర్మల్ కి తెప్పించామని, అన్నింటినీ ఒకే దగ్గర సంరక్షించామని తెలిపారు. ఈ వెటివర్ మొక్కలకి నిత్యం శుభ్రంగా వుండే చేపల చెరువు నీటిని వాడుతున్నామని, దీంతో7 అడుగుల నుంచి 8 అడుగుల ఎత్తు వరకూ పెరుగుతున్నాయని తెలిపారు.

ఇక… సమగ్ర వ్యవసాయ విధానం ద్వారా పండించిన వాటికి మార్కెటింగ్ కూడా కల్పిస్తున్నారు అధికారులు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా కొనడానికి ముందుకు వచ్చాయి. తెలంగాణ ప్రాంతంలో సమగ్ర వ్యవసాయం విధానం నిర్మల్ లో సక్సెస్ అవ్వగా… మన దేశంలో తమిళనాడులో కూడా సక్సెస్ పంథాలో వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *