సహజీవనం తప్పుడు విధానం : గడ్కరీ
సహజీవనం తప్పుడు విధానమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఇది సమాజ సిద్ధాంతాలకు వ్యతిరేకమని పేర్కొంటూ స్వలింగ సంపర్కుల వివాహాలతో సామాజిక వ్యవస్థ దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యూట్యూబ్ పోడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. బ్రిటన్‌లో అతి పెద్ద సమస్య సహజీవనమే అని, పెళ్లిని వ్యతిరేకించడం పెద్ద సమస్యగా మారినట్లు ఇటీవల బ్రిటీష్ పార్లమెంట్ వెళ్లినప్పుడు అక్కడ తమకు తెలిసిందని ఆయన చెప్పారు. ఐరోపాలో ప్రస్తుతం పెళ్లిళ్ల కంటే సహజీవనాన్నే జంటలు ఎక్కువగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఒకవేళ మీరు పెళ్లి చేసుకోకపోతే, అప్పుడు మీరెలా పిల్లల్ని కంటారని గడ్కరీ అడిగారు. ఒకవేళ పిల్లలు పుడితే, వాళ్ల భవిష్యత్తు ఏంటి ఆయన ప్రశ్నించారు.
సమాజ వ్యవస్థకు వ్యతిరేకంగా వెళ్తే, అది ప్రజలపై ఎటువంటి ప్రభావం చూపుతుందని ప్రశ్నించినట్లు గడ్కరీ తెలిపారు. సమాజం తనంతటే తాను నిర్ణయాలు తీసుకుంటుందని, కానీ దేశంలో లింగ నిష్పత్తి సమంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.భారత్ లో ఇబ్బందికరంగా మారుతున్న పురుషులు, స్త్రీల నిష్పత్తిపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని నితిన్ గడ్కరీ తెలిపారు. అలాగే వీరిద్దరి మధ్య నిష్పత్తి తేడా ఎక్కువగా ఉంటే ఎదురయ్యే సమస్యల గురించి కూడా ఆలోచించాలని హితవు చెప్పారు. ఒకవేళ 1500 మంది మహిళలు, 1000 మంది పురుషులు ఉంటే, అప్పుడు ఇద్దరు భార్యలకు పురుషుల అర్హులని ఆయన పేర్కొన్నారు. ఆదర్శ భారత దేశంలో విడాకుల్ని నిషేధించాలన్న వాదనను ఆయన ఖండించారు. సహజీవనం మంచిది కాదని చెబుతూ స్వలింగ వివాహాలు కూడా భారతీయ సంస్కృతిని చెడగొడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైవాహిక బంధంలో భార్యాభర్తలు ఇద్దరూ అర్ధం చేసుకుని ముందుకెళ్లాలని సూచించారు.