మహేష్‌ బాబు సినిమా స్టోరీని తలదన్నే ఘటన

గ్రామసభ శక్తి: భాగం-1

మహేష్‌ బాబు నటించిన ‘మహర్షి’ సినిమా సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒక కార్పొరేట్‌ కంపెనీ తన ప్రాజెక్ట్‌ విస్తరణ కోసం గ్రామగ్రామాలను ఖాళీ చేయించడానికి ప్లాన్‌ చేయగా, తాము పుట్టి పెరిగిన పచ్చని పల్లెలను రక్షించుకునేందుకు గ్రామస్తులంతా ఏకమై పోరాటం చేసి విజయం సాధిస్తారు.

కానీ అది సినిమా.. ఇటువంటి పోరాటం నిజంగా జరిగిందా? అవును 10 ఏళ్ల క్రితమే అటువంటి ఘటన జరిగింది. అటవీప్రాంతంలో పచ్చని గ్రామాలపై కార్పొరేట్‌ కంపెనీ కన్ను పడిరది. అక్కడి వనవాసి ప్రజల భక్తి విశ్వాసాలను టార్గెట్‌ చేస్తూ, వారి జీవనాధారం దెబ్బతీసే విధంగా ప్రాజెక్టు ప్లాన్‌ చేయడంతో ఆ వనవాసీ ప్రజలు సహించలేకపోయారు. ఎలాంటి చదువూ లేకపోయినా, తమకున్న హక్కులు, తమకు తెలిసిన చట్టాలను ఆధారం చేసుకుని ఆ కార్పొరేట్‌ కంపెనీకి వ్యతిరేకంగా చేసిన సుదీర్ఘ పోరాటం, సాధించిన విజయం ‘మహర్షి’ సినిమా స్టోరీకి  ఏమాత్రం తీసిపోదు.

ఒడిశాలోని కలహంది, రాయగఢ జిల్లాల మధ్య, దట్టమైన అటవీప్రాంతంలో విస్తరించి ఉన్న నియమగిరి కొండలు చాలా పురాతనమైనవి. అక్కడి డోంగ్రియా కోండ్‌ అనే వర్గానికి చెందిన వనవాసీ ప్రజలు ఆ కొండలను అత్యంత పవిత్రమైనవిగా ఆరాధిస్తారు. అందుకు కారణం అక్కడ దొరికే ఆహారం, ఇతర సదుపాయాలతో అక్కడి ప్రజలే కాదు అక్కడి వన్యప్రాణులు కూడా సుఖంగా జీవిస్తున్నాయి.

నియమగిరి ప్రాంతంలో అపారమైన బాక్సయిట్‌ నిక్షేపాలున్న విషయం బయటి ప్రపంచానికి తెలిసింది. దీంతో 2010లో ప్రసిద్ధ కార్పొరేట్‌ కంపెనీ ‘వేదాంతా రిసోర్సెస్‌ లిమిటెడ్‌’ కన్ను ఆ ప్రాంతంపై పడిరది. ఆ ప్రాంతం లీజుకు తీసుకుని, అక్కడ బాక్సయిట్‌ తవ్వకాలు మొదలు పెట్టాలనుకుంది. కార్పొరేట్‌ కంపెనీలు తలచుకుంటే పర్మిషన్లు రావటం ఎంతసేపు? వెంటనే ఒడిశా ప్రభుత్వ మైనింగ్‌ కార్పొరేషన్‌ అనుమతిచ్చేసింది.

 అక్కడి ప్రజలు పరమపవిత్రంగా ఆరాధించే, వారి జీవనాధారమైన నియమగిరి కొండలు మొత్తాన్ని నాశనం చేసే విధంగా బాక్సయిట్‌ మైనింగ్‌ ప్రాజెక్ట్‌ రూపకల్పన జరిగింది. తమతో పాటు జీవించే వన్యప్రాణులు, వృక్ష జాతి మొత్తం ప్రమాదంలో పడిపోతుందని గ్రహించిన వనవాసి ప్రజలంతా ఒకే తాటిపైకి వచ్చారు. పోరాటం మొదలైంది. ఒకటి, తమ జీవించే హక్కు కోసం.. మరొకటి.. అదే రాజ్యాంగం కల్పిస్తున్న ఆరాధించే హక్కు కోసం. ఎక్కడికక్కడ వనవాసీ ప్రజలు ఆందోళనలు చేపట్టారు. వారిపై అనేక దాడులు జరిగాయి. అయినా వారు వెనుకడుగు వేయలేదు. చివరికి వ్యవహారం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది.

కేసును సుప్రీంకోర్టు క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజలకున్న విశేష అధికారాలను మరోసారి ప్రభుత్వాలకు గుర్తుచేసింది. ఆ అధికారం పేరే ‘గ్రామసభ’. నియమగిరి మైనింగ్‌ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపే ముందు ఒడిశా ప్రభుత్వం ‘గ్రామసభల’ ఆమోదం తీసుకోలేదని గుర్తించిన సుప్రీంకోర్టు, తమ ప్రతిపాదనలు మొత్తం గ్రామసభల ఎదుట పెట్టి, ప్రజలకు వాటిని వివరించి, గ్రామసభల ఆమోదం పొందితేనే ముందుకు వెళ్లాలని విస్పష్టంగా చెప్పింది.

 సుప్రీంకోర్ట్‌ ఆదేశాలతో ఒడిశా ప్రభుత్వం నియమగిరి కొండల ప్రాంతంలో చేపట్టబోయే బాక్సయిట్‌ మైనింగుకు సంబంధించి వేదాంతా రిసోర్సెస్‌ లిమిటెడ్‌తో చేసుకున్న ఒప్పందాలు, ఇతర సమాచారం మొత్తం అక్కడి ఏజెన్సీ గ్రామాల ప్రజల ఎదుట, అంటే గ్రామసభల ఎదుట పెట్టి ఆమోదం కోసం ప్రాధేయపడిరది. కానీ ఒక్కరు కూడా వాటిని ఆమోదించలేదు. దీంతో చేసేదేమీ లేక నియమగిరి ప్రాంతంలో బాక్సయిట్‌ తవ్వకాల కోసం  వేదాంతా రిసోర్సెస్‌ లిమిటెడ్‌తో చేసుకున్న  ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.

వనవాసీలు సాధించిన ఈ ప్రజావిజయం చరిత్రలో ఒక స్ఫూర్తిదాయకమైన పోరాటంగా నిలిచిపోతుంది.

ఇక్కడ మనకు అర్ధం కావాల్సిన ముఖ్యమైన అంశం.. ‘గ్రామసభ’.. అసలేమిటీ గ్రామసభ? దానికున్న విశేష అధికారాలేమిటి? అవి ప్రజలను ఏవిధంగా శక్తివంతం చేస్తాయి? అనేది తరువాతి సంచికలో తెలుసుకుందాం.

– ఏ.ఎస్‌. సంతోష్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *