ముగిసిన నిజాం నిరంకుశ పాలన.. పొడిచిన తెలంగాణా కొత్తపొద్దు

నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవాలు

భాగం-3    

హైదరాబాద్‌ ‌సంస్థానంలో హిందువుల సంఖ్యతో సమంగా ముస్లింల జనసంఖ్యను పెంచాలనే ఉద్దేశ్యంతో పొరుగు రాష్ట్రాల నుండి లక్షలాది ముస్లింలను ఎన్నో ఆశలు చూపించి ఆకర్షించాడు. మతం మార్పిడిని ప్రోత్సహించాడు. హరిజనులకు సవర్ణులకు మధ్య తగాదాలు సృష్టించి, హరిజనులకు హిందువులకు మధ్యలో కల్లోలాలను సృష్టించాడు. రజాకార్లు ఇష్టానుసారం దోపిడీలు, గృహదహనాలు, మానభంగాలు చేయడం ప్రారంభించారు. నిజాం తన మంత్రి వర్గంలో విశ్వాసపాత్రులైన హిందువులను ఉంచాడు. భారతప్రభుత్వం అనుకూలంగా ఎన్ని సూచనలు చేసినా తిరస్కరించి తన పన్నాగాలు కొనసాగించాడు.ఏజెంట్‌ ‌జనరల్‌ఈలోగా భారత ప్రభుత్వం తన ప్రతినిధిగా ఏజెంట్‌ ‌జనరల్‌ ‌హోదాలో శ్రీ కె.యం. మున్షీని హైద్రాబాద్‌ ‌పంపించింది. ఆయనపట్ల నిజాం వ్యవహరించిన తీరు ముందే తెలుసుకున్నాం.

కొంతకాలం తర్వాత హైద్రాబాద్‌ ‌రియసత్‌ ‌ప్రధానమంత్రి అయిన లాయక్‌ ఆలీ చెరియాల ప్రాంత పర్యటనకు వచ్చాడు. ఇమ్మడి రాజిరెడ్డి నాయకత్వాన వెయ్యిమంది గ్రామస్థులు వెళ్ళి రజాకార్ల దాడుల గురించి చెప్పాడు. ఆయన అందరూ కలిసిమెలసి ఉండాలనీ నీతులు చెప్పి వెళ్ళిపోయాడు. ఇక లాభంలేదని ఆ ప్రాంతాలలో గ్రామీణులు తమ ఆత్మరక్షణకు ఆయుధాలు వగైరా సేకరించటం మొదలుపెట్టారు. భైరవునిపల్లి బురుజుపై వల్లపట్ల రామచంద్రరావు దేశ్‌ముఖ్‌ ‌నుండి సంపాదించిన ఫిరంగిని పెట్టారు. నాలుగైదు మణుగుల మందుగుండు సామగ్రి తయారుగా ఉండేది. అలాగే గ్రామంలో కంసాలి ఇనుప గుండ్లను తయారుచేసేపని మొదలుపెట్టాడు. బెక్కల్‌, ‌ధూళిమిట్ట, తోరసాల్‌, ‌జాలపల్లి, కొండాపూర్‌, ‌కుటిగల్‌, ‌సోలిపూర్‌, అం‌కుశీపూర్‌ ‌తదితర గ్రామాలు తమ రక్షణదళాలు ఏర్పాటు చేసుకు న్నాయి. వీటన్నింటికి భైరవునిపల్లి కేంద్ర బిందువుగా పనిచూస్తూ వచ్చింది. అందువల్ల ఈ గ్రామంపై రజాకార్లు తమ దృష్టిని కేంద్రీకరించారు. భువనగిరి డిప్యూటీ కలెక్టర్‌ ‌హాషిం కూడా భైరవునిపల్లి గ్రామస్థులను తిరుగుబాటుదార్లుగా భావించి దాడిచేయటానికి సిద్ధపడ్డాడు. ఈ గ్రామస్థుల ధైర్యం తనకు సవాలుగా కనిపించింది. ఇక్బాల్‌ ‌హాషం ఓటమిఈ డిప్యూటీ కలెక్టర్‌ ‌శాంతిస్థాపన నెపంతో తన పోలీసు బలగంతో గ్రామాలమీద పడ్డాడు. కొడకండ్ల గ్రామంలో దాదాపు నలభై మంది నిర్దోషులను కాల్చి చంపేశాడు. తర్వాత 150 మంది గల తన ముఠాతో భైరవునిపల్లి చేరుకున్నాడు. బురుజుపై నుండి ఈ ముఠాను పసిగట్టిన కాపలాదారులు నగారా మ్రోగించారు. చిన్న ఫిరంగి కాల్పులకు హాషిం ముఠా తట్టుకోలేక పోయింది.

తన ప్రయత్నం విఫలం కాగా హాషిం మరింత కసితో ఆ గ్రామాన్ని నేలమట్టం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. విజయవంతమైన తమ పోరాటం వల్ల భైరవునిపల్లి గ్రామస్థుల ధైర్యం మరింత పెరిగింది. రజాకార్ల ముఠాలను నిర్భయంగా ఎదుర్కొనగల మనే ధీమా హెచ్చింది. అయితే నిజాం సైన్యం ముందు తాము నిలువగలమా? అనే అంశాన్ని వాళ్ళు తీవ్రంగా ఆలోచించలేదు. సైన్యం వచ్చి చుట్టుముట్టనున్నదనే వార్త తెలిసినా గ్రామం ఖాళీచేసి అడవుల్లోకి పారిపోవాలనే ఆలోచనే వాళ్ళకు తట్టలేదు. తత్ఫలితంగా భైరవునిపల్లి సర్వనాశనం కాక తప్పలేదు.

అప్పటికి బాగా వెలుగు వచ్చేసింది. బురుజు పైన ఇద్దరు యువకులు లేచి నిలబడి చూస్తుండ గానే గుండు వచ్చి తగిలింది. మగుటం రామయ్య, భూమయ్య అనే ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడే కూలిపోయారు. అక్కడి గది వగైరా అంతా కూలి ముఖ్యమైన రక్షణ సామాగ్రి ధ్వంసమైపోయింది. గ్రామస్థులు ఇది రజాకార్ల దాడి కాదనే విషయాన్ని గ్రహించారు.ప్రతిఘటించి ప్రయోజనం లేదని బురుజు పైనుండి తెల్లజెండా చూపారు. అయినా నిజాం సైన్యం ఫిరంగి కాల్పులు జరుపుతూనే వచ్చింది. గ్రామంలో చొచ్చుకొని వస్తున్న సైనికులు అడవి జంతువులలాగా ప్రవర్తించారు. కనబడిన ప్రతి అమాయకుణ్ణి షూట్‌ ‌చేశారు. ఒకమూల నిలబడి సైనికులు పదిమంది యువకులపైకి చేతి బాంబులువేసి చంపివేశారు. అందులో విశ్వనాథ్‌ ‌భట్‌ ‌జోషి తదితరులు ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది నిరపరాధులైన గ్రామస్థులు హత్య చేయబడ్డారు. అందులో అప్పుడే ప్రసవించిన తల్లి కూడా ఉంది. తర్వాత శవాలను గుర్తిస్తున్నపుడు సజీవంగా ఉన్న శిశువు లభించింది. గ్రామంలో ప్రతిఘటనా శక్తి సర్వస్వం నాశనమై పోయింది. నిజాం ప్రభుత్వ అధికారులు, సైనికులు విజయోన్మాదంతో పాశవిక చర్యలకు దిగారు. నిజాంకు వ్యతిరేకంగా జరిగిన ఏదో పెద్ద తిరుగుబాటును అణచివేశామనే గర్వంతో విర్రవీగుతూ భైరవునిపల్లి నేలమట్టం చేశారు. ప్రతి ఇంట్లోకి వెళ్ళి యువకులను ఏరి పశువుల్లా బంధించి తీసుకువచ్చారు. స్త్రీలను బలాత్క రించారు. ఇళ్ళను దోచుకున్నారు. గడ్డివాములను తగులబెట్టారు. మత పిచ్చి ఎక్కి దుష్కృత్యాలు జరిపిన గూండాలకు ఈ నిజాం ప్రభుత్వం అధికారులకు మధ్య తేడాలేదు అనిపించింది. ఊరు అవతలికి 92 మంది యువకులను పట్టి తెచ్చి నిలబెట్టారు. వాళ్ళలో ఇద్దరు ముసలివాళ్ళు కూడా ఉన్నారు. అధికారులు తమ షూటింగ్‌ ‌నైపుణ్యాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమై నిల్చున్నారు. త్రీనాట్‌ ‌త్రీ రైఫిల్‌తో వరుసగా ఒకేసారి ఒకే గుండుతో ఎంతమందిని చంపవచ్చునో అంచనా వేసు కున్నారు. నాలుగు వరుసలలో ఒకరి వెనుక ఒకరిని నిలబెట్టారు. కట్టివేయబడిన యువకులు బలిపశువుల్లా నిలుచున్నారు. మొదట ఒక సైనికాధికారి కాల్పులు జరిపాడు.ఒకేగుండు వరుసగా నలుగురి శరీరాల గుండా దూసుకుపోయి మరోవైపు వెళ్ళింది. ఫలితంగా ఆ నలుగురు యువకులు నేలకూలిపోయారు. రెండోసారి ఒక పోలీసు అధికారి ఫైరింగ్‌ ‌చేయగా ముగ్గురు చనిపోయారు. ఇక సివిల్‌ అధికారులు తమ బలాన్ని ప్రదర్శించుకోవడానికి ముందుకు వచ్చారు. భువనగిరి డిప్యూటి కలెక్టర్‌ ‌హాషిం కసితో ఎనిమిది మందిని కాల్చి చంపాడు. ఇద్దరు ముసలివాళ్ళను వదలి దాదాపు అందరినీ స్టెన్‌గన్‌తో కాల్చి హత్య చేశారు. ఈ దారుణ హత్యాకాండలో రజాకార్ల సర్వసైన్యాధికారియైన ఖాసిం రజ్వీ ముఖ్య అనుచరుడైన మొహజ్జిం హుస్సేన్‌ (‌నల్గొండ) అత్యధికమైన భాగాన్ని పంచుకున్నాడు.తర్వాత గ్రామంలో హరిజనులను పిలిచి 90 మంది శవాలను నిరుపయోగంగా ఉన్న ఒక బావిలో పడవేయించి సామూహిక సమాధి చేశారు. గ్రామంలో చచ్చిన జనం ఈ లెక్కలోకి రాలేదు. 11 గంటల ప్రాంతంలో ఈ సైన్యం కుటిగల్‌ ‌గ్రామం గుండా తిరుగు ప్రయాణం సాగించింది. ఆ గ్రామంలో పట్వారీ నరసింహారావుతో సహా 25 మందిని హత్య చేశారు.

(సశేషం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *