ముగిసిన నిజాం నిరంకుశ పాలన.. పొడిచిన తెలంగాణా కొత్తపొద్దు

నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవాలు

భాగం-5

1947 ఆగస్టు 15 నాటి నుండి హైద్రాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ తన ఆందోళనను తీవ్రతరం చేసింది. సత్యాగ్రహంలో పాల్గొన్న దళాలను నిజాం అరెస్టు చేయించాడు. తీవ్రమైన దమనకాండను జరిపించాడు. నిజాం పోలీసులు, రజాకార్ల దళాలు ఇష్టానుసారంగా అత్యాచారాలు జరుపుతున్నారు. కాంగ్రెస్‌ జరుపుతున్న ఆందోళనను అమానుషంగా అణచివేయాలని అన్నిరకాల బల ప్రయోగాలు చేస్తున్నారు. జైళ్ళలో సత్యాగ్రహులపై లాఠీచార్జీ జరిపి అనేకమందిని గాయపరిచారు. 1948 జనవరి 11న నిజామాబాద్‌ జైలుకు బయటనుంచి గూండాలను తీసుకెళ్ళి రాజకీయ ఖైదీలను విపరీతంగా కొట్టించాడు.అప్పుడు లాయక్‌ ఆలీ మంత్రిమండలి నుండి శ్రీ రామాచార్య రాజీనామా చేశాడు. వేలాదిమంది రాజకీయ ఖైదీలు జైలు కటకటాల వెనుక క్రూర హింసలకు గురౌతున్నారు. స్వతంత్ర పోరాటంలో పాల్గొనాలని విద్యార్థులు విద్యాలయాలను బహిష్కరిస్తున్నారు. రజాకార్లు విచ్చలవిడిగా అభ్యుదయకాముకులైన ప్రజలపై, నాయకులపై అత్యాచారాలు జరుపుతున్నారు. ప్రాణ, మాన, ఆస్తి రక్షణ లేకపోవడం మూలాన ప్రజలు లక్షల సంఖ్యలో సంస్థానాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోతున్నారు. వందలాది మంది తుపాకీ గుండ్లపాలై ప్రాణాలు వదిలారు. సజీవ దహనాలు, ఆడవాళ్ల మానభంగాలతో సంస్థానం అల్లకల్లో లంగా ఉంది. ఈ అన్యాయాల్ని బయట పెట్టిన పత్రికల నోరు మూయించారు. ఈ దారుణ పరిస్థితుల్లో స్టేట్‌ కాంగ్రెస్‌ వెలుపలి నుంచి తన కార్యకలపాలను నిర్వహించటం ప్రారంభించింది.

రజాకార్ల కాలంలో కాకతీయ మహానగరం ఒక ఇంటి ఆవరణలో పంక్తిబద్ధంగా నిలుచుని ఉన్నారు స్వయంసేవకులు. ‘‘విజయీ విశ్వతిరంగా ప్యారా, రaండా ఊంఛా రహే హమారా’’ అని పతాక వందనం చేస్తున్నారు. ప్రాణాలు ధారవోసి నీ గౌరవాన్ని కాపాడుతామని జెండాకు అభివాదం చేస్తూ గీతం ఆలాపిస్తున్నారు. ధ్వజగీతం సమాప్తం కాగానే ఆ ఉదయం ‘‘ఇన్‌క్విలాబ్‌ జిందాబాద్‌’’, ‘‘భారత్‌ మాతాకీ జై’’, ‘‘మహాత్మా గాంధీకీ జై’’ అనే నినాదాలతో అక్కడి కోటలోని ప్రశాంత వాతావరణం మార్మ్రోగింది. 4, ఆగస్టు 1946, ఆదివారం నాడు వరంగల్‌ కోటలోని ఉత్తర భాగాన ఈ పతాక వందనం జరుగుతూ ఉన్నది. నిజాం సామంతుల సంస్థానంలో వరంగల్‌ ముఠాలో ఈ విధంగా జాతీయ పతాకాన్ని ఎగురవేస్తూ స్వేచ్ఛాగీతాలు ఆలపించడం ఆనాడు ఎవరికైనా ఆశ్చర్యాన్ని గొలిపే అంశం.

మునిగే వాడికి పూచికపుల్ల సహాయమన్నట్లు ముస్లింలు ‘‘తామే సంస్థాన పాలకుల’’మని ప్రకటించారు. నిజాం తమకు ప్రతీకమాత్రుడని, ఈ రియాసత్‌ సంస్థానంలో తమ ఆమోదం లేకుండా ఎలాంటి రాజకీయ సంస్కరణ లేదా మార్పు జరగడానికి వీలులేదని స్పష్టం చేశారు. ఈ ముస్లిం రాజకీయపక్షంగానే నవాబ్‌ బహదూర్‌ యార్‌జంగ్‌ నాయకత్వాన ‘‘మజ్లిస్‌ ఇత్తేహాదుల్‌ ముస్లిమీన్‌’’ సంస్థ ఏర్పడిరది. నిజాం దృష్టిలో ఇది రాజకీయ సంస్థ కాదు. అందువల్ల నిషేధం లేదు. కొద్దికాలంలోనే, నవాబ్‌ బహదూర్‌ యార్‌జంగ్‌ ప్రాబల్యం పెరిగింది. అతని పలుకుబడికి భయపడి నిజాం అతనిని విషప్రయోగం చేసి చంపించాడనే వదంతి ఉంది. నిజమేదైనా సంపూర్ణ ఆరోగ్య వంతుడైన ఆ నవాబ్‌ 1944 జూన్‌ 25న అకస్మాత్తుగా మరణించాడు. ఆ మరణం ఎలా జరిగిందో ఈనాటికీ ప్రశ్నగా నిలిచిపోయింది. నిజాం ఆ తర్వాత తన నిరంకుశాధికారాన్ని కాపాడుకోవటానికి ఈ మజ్లిస్‌నే ఉపయోగించు కున్నాడు. ఈ మత సంస్థ అంతర్గతమైన ఎన్నికలు, తదితర విషయాలపై నిజాం ఫర్మానాలు జారీ చేయడం మొదలుపెట్టాడు. సంస్థానంలో అల్పసంఖ్యాకులైన ముస్లింలు హిందువులపై అన్నివిధాల అధికారం చలాయించాలని ప్రయత్నించారు. ప్రభుత్వ ఉద్యోగాలు, ధనం అన్నీ తమ సొంత ఆస్తి వ్యవహరంలా ఉండేది. తాము పాలకులమని, హిందువులు పాలితులనే భావంతో వ్యవహరించేవారు. అధిక సంఖ్యాకులైన హిందువు లను బానిసలుగా చూస్తూ వారి కార్యకలపాలను కనిపెట్టి ఉండేవాళ్ళు. అందువల్ల వరంగల్‌ కోటలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని సహించలేక పోయాడు. ముఖ్యంగా సుబేదార్‌ హాబీబుల్లాఖాన్‌ మతోన్మాది. బహుక్రూరుడు. అందువల్ల తీవ్ర పరిణామాలు సంభవించాయి.

పోలీసు చర్యకు పూర్వం కొందరు యువకులు ఉద్‌గీర్‌ పరిసర గ్రామాలను కాపాడుతూ రజాకార్ల దుండగాలను ఎదిరించారు. సాహసంతో, క్రమ శిక్షణతో, సంఘటిత శక్తిగా రూపొందిన ఈ యువకులే ఆరు నెలలపాటు సాయుధులైన రజాకార్లను, నిజాం సైనికులను, రోహిల్లాలను, పఠాన్‌లను వీరత్వంతో, ప్రతీకారవాంఛతో ప్రతిఘటిస్తూ అనేక గ్రామాలను రక్షించారు. చాక చక్యంగా, ధైర్యంగా శత్రువులను ఎదుర్కొని ఎంతో మంది రజాకార్లను, పోలీసు అధికార్లను మట్టు పెట్టారు. గ్రామీణుల మనోధైర్యాన్ని నిలిపారు. బీదర్‌ జిల్లాలోని రజాకార్లకు, పోలీసులకు ఈ రైతుదళం సింహస్వప్నంగా పరిణమించింది. అందువల్లనే పోలీసు చర్య జరిగాక జిల్లా మొత్తంలో ఆడవాళ్ళు దంపుడు దగ్గర ఈ రైతు గెరిల్లాల సాహసకృత్యాలను పాటలుగా పాడుకొనేవారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *