ముగిసిన నిజాం నిరంకుశ పాలన – పొడిచిన తెలంగాణా కొత్తపొద్దు

నైజాం విముక్త స్వతంత్య్ర అమృతోత్సవాలు

హైదరాబాద్‌ సంస్థానాన్ని తన సొంత జాగీరుగా భావించిన నిజాం తెలంగాణా ప్రజలపట్ల చూపిన నిరంకుశత్వం, రజాకర్‌ల ద్వారా చేయించిన అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. 15 ఆగస్ట్‌, 1947న దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణా ప్రాంతం మాత్రం 17 సెప్టెంబర్‌, 1948నే నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తమై స్వతంత్ర భారత రాజ్యంలో విలీనమైంది. ఈ విమోచన పోరాటం సుదీర్ఘమైనది. తెలంగాణా ప్రజానీకం అంతా తప్పక తెలుసుకోవలసింది.

‘‘ఆజాద్‌ హైద్రాబాద్‌’’ నినాదం మారుమ్రోగు తోంది. అక్కడక్కడ నిజాం సంస్థానానికి చెందిన అసఫియా పతాకం గర్వంగా ఎగురుతోంది. ఖాన్‌సాబ్‌ రజాకార్ల ముఠాలకు సంబంధించిన సైనికులు నినాదాలు చేస్తూ సగర్వంగా ధ్వజానికి వందనాలు సమర్పిస్తున్నారు. ‘‘షాహె ఉస్మాన్‌ జిందాబాద్‌, ఆజాద్‌ హైద్రాబాద్‌ జిందాబాద్‌, కాయదెమిల్లత్‌ జిందాబాద్‌’’ అనే నినాదాలు సరిగ్గా 1947 ఆగస్టు 15 నాడే హైద్రాబాద్‌లో ప్రతిధ్వని స్తున్నాయి. హైద్రాబాద్‌ సంస్థానానికి చెందిన పాలకవర్గ మహమ్మదీయులు కోలా హలంగా తమ స్వతంత్ర హైద్రాబాద్‌ ఉత్సవాలను జరుపు కుంటున్నారు.

హిందువులకు ‘‘ఆజాద్‌ హైద్రాబాద్‌’’ అంటే ఏమిటో ప్రత్యక్షంగా తెలుసు. స్వతంత్ర ప్రతిపత్తి అనగానే హిందువుల ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు వాటిల్లినదనే అర్థం, శాశ్వతంగా ఆత్మాభిమానం మట్టిలో కలిసిపోతుందని భయం. ఆ రోజు భారతావని నాలుగు చెరగులా స్వతంత్ర భారత త్రివర్ణ పతాకం భారతీయులలో నూతనోత్తేజాన్ని ప్రస్ఫుటిస్తూ స్వేచ్ఛగా అడుగిడుతోంది. కాని ఆ భారతదేశంలో భూభాగమైన హైద్రాబాద్‌లో హిందువులు బానిస శృంఖలాలలో మగ్గుతున్నారు.

హిందువులు అధికసంఖ్యలో ఉన్నా వారికి సాధారణమైన ప్రాథమిక హక్కులు కూడా లేకుండా చేశాడు. హైద్రాబాద్‌ను సార్వభౌమాధికారాలు గల ఇస్లాం రాజ్యంగా రూపొందించాలని ప్రయత్నిం చాడు. లార్డ్‌ రీడిరగ్‌ హయాంలోనే నిజాం ‘‘విశ్వాస పాత్రుడైన మిత్రుడుగా’’ పరిగణన పొందాడు. ఆ నమ్మకంతోనే స్వతంత్ర ప్రతిపత్తి రాగాన్ని ఆలాపించటం మొదలు పెట్టాడు. కాని బ్రిటీషు ప్రభుత్వం చాకచక్యంగా తన ఉద్యోగులను కీలకస్థానాల్లో నియమించి నిజాం కలలను వమ్ముచేసింది.

ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో హైద్రాబాద్‌ పరతంత్ర ప్రజలు స్వేచ్ఛకోసం ఆందోళన ప్రారంభించారు. నిజాం దమన నీతిని చేపట్టి నిరంకుశంగా పాలనా యంత్రాంగాన్ని బిగించాడు. తనకు సహాయంగా ‘‘ఇత్తెహాదుల్‌ ముసల్మీన్‌’’ అనే మతసంస్థనొక దానిని సంపాదించాడు. మహమ్మదీయులు పాలకులని, హిందువులు పాలితులని నిజాం తమ సత్తాకు ప్రతీక అని ఆ సంస్థ ప్రచారం సాగించింది. ఈ మత సంస్థ రజాకార్లనే సైన్యాన్ని కూడా రంగంలోకి దింపింది. సంస్థానంలోకి ఇతర ప్రాంతాలలో మహమ్మ దీయులను రప్పించి సంఖ్యను పెంచు కుంటూ పోయాడు

సిడ్నీ కాటన్‌ వంటి విదేశీయుల సహాయంతో ఆయుధాలు సేకరించడం మొదలయింది. రహస్యంగా విమానాల ద్వారా ఆయుధాలు హైద్రాబాద్‌ చేరుతున్నాయి. హైద్రాబాద్‌లో కార్మాగారాలను ఆయుధాల ఫ్యాక్టరీలుగా మార్చివేశారు. నిజాం తన సైనిక బలాన్ని వృద్ధిచేస్తూ మరొకవైపు భారత ప్రభుత్వంతో సంధి మంతనాలు ఆడుతున్నాడు. హిందువులపై ద్వేషం వెదజల్లుతూ ‘‘జిహాద్‌’’ (మతయుద్ధం) పేరిట అత్యాచారాలు సాగించాడు. రజాకార్లు స్వేచ్ఛగా లూటీలు, మానభంగాలు చేస్తూ భయావహమైన వాతా వరణాన్ని సృష్టించారు.

రజాకార్లు తెలంగాణలో అనేక గ్రామాలపై పడి దోపిడీలు, మానభంగాలు, హత్యలు కొనసాగిస్తున్న ఆ భయంకర వాతావరణంలో అక్కడక్కడ ప్రజలు ధైర్యాన్ని కూడగట్టుకొని ఎదురుతిరిగారు. ఆ సమయంలోనే నిజాం ప్రభుత్వం ప్రజలను మభ్య పెట్టడానికి ‘‘శాంతి సంఘాలు’’ అనే వాటిని ఏర్పరిచి హిందువుల కళ్ళు కప్ప ప్రయత్నించింది. జనగామలో ఇలాంటి శాంతిసంఘంలోనే పరిశ్రమల శాఖ సూపర్‌వైజర్‌ శ్రీ ఎం.ఎన్‌.రెడ్డి, వ్యవసాయ శాఖ సూపర్‌వైజర్‌ శ్రీ శఠగోపాచార్యులు ఇద్దరు సభ్యులు ఈ సంఘాలలో హిందువులు కూడా ఉన్నారని నమ్మించడానికి ఈ తతంగం జరుగుతుండేది. అయితే హిందూ సభ్యులు నోరెత్తి రజాకార్లకు వ్యతిరేకంగా ఫిర్యాదుచేస్తే ప్రాణాలతో మిగలడం కష్టం. ఒకసారి శ్రీ శఠగోపాచార్యులు శాంతి సంఘ సమావేశంలో మితిమీరిపోతున్న రజాకార్ల చర్యలను ఖండిరచారు. మరుసటిరోజు ఆయనను జనగామ దారిలోకి తీసుకెళ్ళి కాల్చి చంపారు. శ్రీ ఎం.ఎన్‌. రెడ్డి నమ్రతతో ఈ ఆగడం గురించి ఫిర్యాదు చేశారు. కాని ఆయనను కూడా తుపాకీతో కాల్చేస్తామని అధికారులు బెదిరించారు. ఆ రోజుల్లో తిప్పర్తి ప్రాంతంలో ముస్లిం అధికారులు సివిల్‌ మిలిటరీ అనే భేదభావం లేకుండా ఆయుధాల అభ్యాసం చేస్తుండేవారు. హిందువులకు కాల్పులలో తర్ఫీదు ఇచ్చి హిందువులనే హత్య చేయించేవారు.  గ్రామాల్లో ‘‘శాంతి సంఘాలు’’ స్థాపించి ప్రజలకు రక్షణ కల్పిస్తామని నిజాం ప్రచారం చేస్తుండేవాడు. కాని ఆ శాంతిస్థాపన ఎంత భయానకంగా జరుగుతుండేదో శ్రీ ఎం.ఎన్‌. రెడ్డి ఒక సంఘటన ద్వారా వివరించి చెప్పారు.

ఒకరోజు ఆయన కొడకండ్ల రంగాపూర్‌ మార్గం గుండా వెళుతున్నాడు. ఒకచోట చింతచెట్టుకు అయిదు శవాలు వేలాడుతున్న దృశ్యం కనపడిరది. ఆయన వెంటనే దగ్గర్లో ఉన్న గ్రామవాసులను అడిగి అసలు విషయాన్ని తెలుసుకున్నారు. శవాలు వేలాడుతున్న ప్రాంతం ఇననూర్‌ పోలీస్‌ స్టేషన్‌ సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉండేది. ఆ అయిదు శవాలు బ్రాహ్మణులవి. అంతకుముందటి రోజే శ్రాద్ధ భోజనం చేసి ఏడుగురు బ్రాహ్మణులు తిరిగి వస్తున్నారు. తోవలో శాంతిని సంరక్షిస్తున్న రజాకార్ల ముఠా ఒకటి ఎదరురైంది. ఆ ఏడుగుర్ని పట్టుకున్నారు. ఇద్దరు బ్రాహ్మణులు మాత్రం తప్పించుకొని పారిపోయారు. మిగిలిన ఐదుగురు ప్రభుత్వ ఏజెంట్లని రజాకార్లు నిర్ధారణ చేసికొన్నారు.

(సశేషం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *