ముసిగిన నిజాం నిరంకుశపాలన…పొడిచిన తెలంగాణా కొత్తపొద్దు-2

భాగం-2

నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవాలు

ఆ ఐదుగుర్నీ వరుసగా చింతచెట్టు కొమ్మకు వేలాడదీశారు. వారి చేతులకి కట్టిన లావలి తాడు కాలకుండా క్రింద మంటలు పెట్టారు. ఆ మంటల్లో కాలి బ్రాహ్మణులు ప్రాణాలు వదిలారు. మిగతా హిందువులకు గుణపాఠంలా ఉండాలని ఆ శవాలను అలాగే వేలాడదీసి రజాకార్లు వెళ్ళి పోయారు. ఆ బ్రాహ్మణులలో ముగ్గురి నడుములకు ఉన్న వెండి మొలత్రాళ్ళు కాలి వంకర్లు పోయాయి. వాళ్ళకు సంభావనగా లభించిన వెండిరూపాయలు బూడిదలో దొరికాయి. ధోవతులు కాలి శవాలు నల్లగా మసిబారి భయంకరంగా కనపడుతున్న ఆ అమానుషమైన దృశ్యం చూసి ప్రజలు వణికి పోయారు.రాక్షస రాజ్యంరజాకార్ల ఈ పైశాచిక కృత్యాలు 1857లో నీల్‌ ‌చేసిన దురంతాలను మించిపోయాయి. బ్రిటీష్‌ ‌సైనికాధికారి నీల్‌ ‌భారతీయుల్ని చెట్లకు వేలాడదీసి ఉరితీసేవాడు. ఫిరంగులకు కట్టి పేల్చేవాడు. కాని ఇలా మంటల్లో కాల్చి భయంకరంగా చంపిన సంఘటనలు లేవు. ఈ రాక్షస కృత్యాలు రజాకార్ల ప్రత్యేకతను నిరూపించాయి. చివరికి రాక్షసులు కూడా ఇలాంటి పనులను ఉహించి చేసేవాళ్ళు కాదేమో!  రజాకార్లు, ప్రభుత్వ ఉద్యోగులు కలిసి రాత్రిపూట గ్రామాలపై బడి దోచుకునేవాళ్ళు. ఎలాంటి దయాదాక్షిణ్యాలు ఉండేవికావు. ఆడవాళ్ళ ముక్కుపోగులు, చెవుల కమ్మలు లాగి వాళ్ళ ముక్కులు, చెవులు తెగినా లెక్కచేయక దోచుకునే వాళ్ళు. ఆ రక్తసిక్తమైన భూషణాలను మూటలు గట్టి ఎం.ఎన్‌.‌రెడ్డి కార్యాలయంలోని టేబుళ్ళ కింద పడవేసేవారు. ఉదయమే అందరూ పంచుకునేవారు. ఈ దోపిడీపట్ల అభ్యంతరం చెప్పినా ప్రయోజనం ఉండేది కాదు. అందువల్ల ఎం.ఎన్‌.‌రెడ్డి లాంటి ఉద్యోగులు కుమిలిపోతుండే వారు. హిందువులు ఈ దుష్కృత్యాలను ఖండించినా ప్రభుత్వం తిరుగుబాటు అనే పేరుతో, శాంతిస్థాపన అనే నెపంతో క్రూరంగా హిందువులనే అణచివేస్తుండేది.

1947 ప్రారంభంలో మహమ్మదాలీ జిన్నా హైద్రాబాద్‌ ‌వచ్చి ఒక పెద్ద సభలో ప్రసంగించాడు. జనాన్ని రెచ్చగొట్టే విధంగా పరుషంగా మాట్లాడాడు. ‘‘కోడి మెడలను విరిచినట్లుగా హిందువులను విరిచేస్తాం. ముల్లంగి కాడల్లా త్రుంచివేస్తాం’’ అని మహా ఉద్రేకంగా మాట్లాడాడు.

‘తెగించిన గూఢచారిసభాస్థలం వేలాది ముస్లిం ప్రజలతో కిక్కిరిసి ఉంది. ఇస్లామియా గీతాలతో, నినాదాలతో వాతావరణం మార్మ్రోగుతోంది. మజ్లిసే ఇత్తెహదుల్‌ ‌ముసల్మీన్‌ అధ్యక్షుడు ఖాసిం రజ్వీ వందనం స్వీకరిస్తూ వేదికవైపు వస్తున్నాడు. సాయుధులైన రజాకార్లు రెండవవైపులా ఉన్నారు. ‘‘ఆలీజనాబ్‌ ‌సిద్దికె మిలత్‌’’, ‌రజాకార్ల ‘‘సాలెరె అజమ్‌’’ (‌సర్వసేనాధిపతి) ఖాసిం రజ్వీ వేదిక ఎక్కగానే జనం నినాదాలు చేశారు. ‘‘షాహె ఉస్మాన్‌ ‌జిందాబాద్‌, ఆజాద్‌ ‌హైద్రాబాద్‌ ‌పాయంబాద్‌ ‌సిద్దికె మిల్లత్‌ ‌ఖాసిం రజ్వీ జిందాబాద్‌’’ అనే నినాదాలు ప్రతిధ్వనించాయి. ఖాసిం రజ్వీ ఆవేశంతో ఉపన్యసిస్తూ హైద్రాబాద్‌ ‌సర్వస్వతంత్ర ప్రాంతంగా కొనసాగించాలన్న తమ నిశ్చయాన్ని వ్యక్తం చేశాడు. భారత ప్రభుత్వంతో జరిగిన యథా తథ స్థితి ఒప్పందం గురించి చెబుతూ రెసిడెన్సీ నివాసం ప్రసక్తి తీసుకువచ్చాడు. ఆ భవనంలో అప్పుడు భారత ప్రభుత్వ ఏజెంట్‌ ‌జనరల్‌గా శ్రీ కె.యం. మున్షీ బసచేస్తున్నారు. ఆ భవనం సార్వభౌమాధికారాలకు చిహ్నం కాబట్టి దానిలో మున్షీ ఉండడానికి వీల్లేదని, అతను మకాం మార్చని పక్షంలో రెసిడెన్సీ భవనాన్ని నేలమట్టం చేస్తామని రజ్వీ బెదిరించాడు. ముస్లిం జనం జయ జయ ధ్వానాలతో ఆమోదించింది. ఫలితంగా నిజాం ‘‘ప్రభువు’’ శ్రీ కె.యం. మున్షీని మకాం మార్చవలసిందని ఆదేశించాడు. బొలారంలో నివాసం ఏర్పర్చుకోమని హుకుం జారీ చేశాడు. రెసిడెన్సీ భవనంలో పోలీసు ప్రధాన కార్యాలయం వెలిసింది. ఇది ఒక విధంగా ఖాసి రజ్వీకి రాజకీయ మైన విజయం. నిజాం, రజ్వీల ఎత్తుగడ లలో ఇది మరొక మెట్టు.పూర్వ చరిత్ర1947 నాటి పరిస్థితి ననుసరించి ఇండియా ప్రభుత్వం ఆనాటి సంస్థానాలకు సౌకర్యాన్ని కలుగచేసింది. భారత్‌లో, పాకిస్తాన్‌లో విలీనం కాదలచుకొనని సంస్థానాలు స్వతంత్రంగా ఉండవచ్చుననే సౌకర్యం అది. ఈ మిషతో నిజాం తన హైద్రాబాద్‌ ‌సంస్థానాన్ని సర్వ స్వతంత్రంగా నిలుపుకోవాలని పన్నాగం పన్నాడు. కాని నిజాం చరిత్ర మరో చారిత్రక సత్యాన్ని వెల్లడించింది. గతంలో ప్రతి సామ్రాజ్య శక్తి ఎదుట నిజాం రాచరికం మోకరిల్లింది. తొలుత మరాఠా, ఆ తర్వాత ఫ్రెంచి చివరకు ఇంగ్లీషు వాళ్ళకు నమ్మిన బంటుగా వ్యవహరించాడు. ఇంగ్లీషు సామ్రాజ్యం భారతదేశంలో అస్తమిస్తున్నపుడు నిజాం తమను అసహాయులనుగా వదలి వెళ్ళిపోవద్దని ఇంగ్లీషు వాళ్ళను వేడుకొనడం దీనికి పరాకాష్ట.

శీఘ్రగతిని మారిపోతున్న రాజకీయ పరిస్థితు లలో నిజాం తన మతం అనే ముసుగులో స్వతంత్రంగా ఉండాలని తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించాడు. ఆయన యొక్క ఇస్లాం మూఢభక్తి, రాచరికమైన కటుత్వం అతనే రచించిన ఈ పద్యపాదాలలో వ్యక్తమవుతుంది.‘‘సలాతీనే సల్ఫ్ ‌సబ్‌ ‌హోగయే నజరె అజల్‌ ఉస్మాన్ముసల్మానోంకా తేరీ సల్తనత్‌ ‌సేహై నిశాన్‌ ‌బాకీ’’(ఇస్లాం సామ్రా జ్యాలు రాజకీయ పరిణామాలకు బలి అయిపో యాయి. కాని ఈనాడు హే ఉస్మాన్‌! ‌నీ రాజ్యమే ముస్లింలకు గుర్తుగా మిగాలిపోయింది.) ‘‘బంద్‌ ‌నాఖూస్‌ ‌హువా సున్‌కే నారాఏ తకిబీర్జల్‌ ‌జలా ఆహీ గయా రిశ్త ఏ జున్నార్‌పర్‌’’ (అల్లాహో అక్బర్‌ ఉద్ఘోషవల్ల శంఖనాదాలు ఆగిపోయాయి. యజ్ఞోప వీతాలు ధరించిన వాళ్ళపై ప్రళయం వచ్చిన ట్లుంది.) స్వతంత్ర భారత్‌లో విలీనం కావటం తనకు అవమానమని రాచరిక గౌరవానికి భంగకర మని భావించాడు నిజాం. రాజ్యాంగ సలహాల కోసం ప్రత్యేకించి ఇంగ్లండ్‌ ‌నుండి ప్రఖ్యాత న్యాయవాది మాలకన్‌ను అన్ని ఖర్చులు భరించి పిలిపించాడు. అతనికి ప్రతిరోజూ ఫీజు కింద విడిగా లక్షరూపాయలు చెల్లించాడు. తన పన్నాగానికి ఆధారంగా ముస్లిం ప్రజల్లో ఇస్లాం మతావేశాన్ని రేకెత్తించాడు. తన సంస్థానం చుట్టూ స్వతంత్ర భారత రాష్ట్రాలు ఉండడం ప్రమాదకరం. కావున తనకు రేవు పట్టణం అవసరం. అందుకు పోర్చుగీసు ప్రభుత్వం నుండి గోవాను ఖరీదు చేయాలనే ఆలోచన కూడా చేశాడు. తన కాంక్షలకు వ్యతిరేకంగా ఉన్న భారత ప్రభుత్వ వైఖరిని నిజాం గ్రహించాడు. తనకంటే ఎన్నో రెట్లు శక్తివంతమైన భారత సైన్యంతో తలపడటం సాధ్యం కాదు. అందువల్ల కొత్త ప్రయత్నాలు ప్రారంభించాడు.గెరిల్లా పోరాట పద్ధతిలో భారత సైన్యాన్ని ఎదుర్కోవడానికి తన సైనికుల సంఖ్యను పెంచసాగాడు. అవసరమైన ఆయుధాలను విదేశాల నుండి తెప్పించుకోవాలని తన సంస్థానంలోనే మరికొన్ని ఆయుధాలను తయారు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. సెకెండ్‌ ‌ఫ్రంట్‌గా రజాకార్ల దళాన్ని నిర్మించాడు. తన సరిహద్దుల రక్షణకు పఠాన్‌లు ప్రత్యేకించి చేర్చు కున్నాడు. విమానాల ద్వారా రహస్యంగా ఆయు ధాలు దిగుమతి చేసుకునే ఏర్పాట్లు చేసుకున్నాడు. బీదర్‌, ‌వరంగల్‌, ‌రాయచూర్‌లలో విమాన స్థావరాలను పునర్నిర్మించాడు.

(సశేషం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *