కేదార్, బద్రీనాథ్‌లో హైందవేతరులకు ‘‘నో ఎంట్రీ’’.. ట్రస్ట్ పునరుద్ఘాటన

బద్రీ కేదార్ టెంపుల్ కమిటీ పరిధిలోకి వచ్చే ఏ ఆలయంలోకి కూడా హైందవేతరులను అనుమతించమని ట్రస్ట్ పునరుద్ఘాటించింది. అలాగే ఈ ట్రస్ట్ పరిధిలోకి వచ్చే ఆలయాల్లోకి సెల్ ఫోన్ కూడా నిషేధిస్తున్నట్లు కమిటీ అధ్యక్షుడు హేమంత్ ద్వివేది ప్రకటించారు. చార్ ధామ్ యాత్ర ఏప్రిల్ మాసంలో ప్రారంభమవుతుందని తెలిపారు. గంగోత్రి, యమునోత్రి ద్వారాలు ఏప్రిల్ 19న , ఏప్రిల్ 23 న బదరినాథ్ ద్వారాలు తెరుచుకుంటాయని తెలిపారు. ఇప్పటి వరకు ఈ చార్ ధామ్ యాత్ర కోసం 6,17,853 మంది నమోదు చేసుకున్నారని తెలిపారు.గత యేడాదితో పోలిస్తే, ఈ యేడాది యాత్రికుల సంఖ్య పెరిగిందన్నారు.
యాత్రికులకు సురక్షితమైన, సులభమైన మరియు సౌకర్యవంతమైన దర్శన ఏర్పాట్లు చేసేందుకు బీకేటీసీ ​​₹121 కోట్లకు పైగా బడ్జెట్‌ను కేటాయించిందని ఆయన తెలిపారు. పుణ్యక్షేత్రాల వద్ద తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, తాత్కాలిక శిబిరాలు మరియు వసతి సేవలను మరింత మెరుగుపరుస్తున్నట్లు పేర్కొన్నారు.
గతంలోనే ప్రకటించిన కమిటీ..
గతంలోనే ఈ విషయాన్ని ఆలయ కమిటీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే చార్ ధామ్ యాత్ర వచ్చే నెల నుంచే ప్రారంభం అవుతున్న నేపథ్యంలో హైందవేతరులకు నో ఎంట్రీ అన్న విషయాన్ని మరోసారి ప్రకటించింది.
బద్రీనాథ్, కేదారనాథ్ అనేవి అత్యంత పురాతన ఆలయాలు అని, వాటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను, సనాతన ధర్మ సంప్రదాయాలను కాపాడటం తమ ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్నారు. గత కొంత కాలంగా క్షేత్ర పరిసరాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కమిటీ అప్పట్లోనే ప్రకటించింది. అందుకే బద్రీనాథ్, కేదారనాథ్ మాత్రమే కాకుండా కమిటీ పరిధిలో వున్న మొత్తం 45 ఆలయాల్లో హైందవేతరుల ప్రవేశంపై నిషేధం విధించినట్లు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *