ట్యాంక్ బండ్ పై హఠాత్తుగా ఈ ఫ్లెక్సీలేమిటి?
వినాయక నిమజ్జనానికి, ట్యాంక్ బండ్ కి అవినాభావ సంబంధం వుంది. చిన్న చిన్న గణనాథుల మొదలు… అత్యంత పెద్దదైన ఖైరతాబాద్ గణేషుడు కూడా ట్యాంక్ బండ్ లోనే నిమజ్జనం. నిమజ్జనం రోజు సిటీలోని సగం మంది జనాభా ట్యాంక్ బండ్ పైనే వుంటారు. అంతటి ప్రాధాన్యమున్న ట్యాంక్ బండ్ పై నిమజ్జనాల సమయంలో ఓ పోస్టర్ కలకలం రేపుతోంది. ట్యాంక్ బండ్ లో గణేష్ నిమజ్జనాలకు తెలంగాణ ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టేసిందా? అన్న అనుమానాలు వస్తున్నాయి. నిజానికి అధికారికంగా కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు. కానీ… ‘‘ముఖ్య గమనిక… గౌరవ హైకోర్టు ఆదేశాల అనుసారం ట్యాంక్ బండ్ పై ఎలాంటి గణేష్ విగ్రహాల నిమజ్జనాలకు అనుమతి లేదు’’ అన్న ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ పోలీసుల పేరుతో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీలను ఎవరు పెట్టారు? అన్న దానిపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు.