ఏప్రిల్ 15 నాటికి రామాలయ నిర్మాణం పూర్తి : నృపేణ్ మిశ్రా
ఈ సంవత్సరం ఏప్రిల్ 15 నాటికి అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తి అవుతుందని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హోలీ పండుగ కోసం కార్మికులు ఇంటికి వెళ్తుండటంతో ఆలయ నిర్మాణ పనుల్లో కాస్త జాప్యం ఏర్పడిందని అన్నారు. అలాగే గోస్వామి తులసీదాస్ (విగ్రహం ఆలయ ప్రాంగణానికి వస్తుందని, ఆ విగ్రహాన్ని ప్రతిష్టించాలని మేము ఆశిస్తున్నామమని అన్నారు. ఆలయంలో ఇంకా 20,000 క్యూబిక్ అడుగుల రాయిని వేయాల్సి ఉందని, ఆలయ నిర్మాణం ఏప్రిల్ 15 నాటికి పూర్తవుతుందని, మొదట చెప్పిన ఆలయ ఆకృతి ప్రాకారం అయోధ్య వెలుపల, లోపల ఉన్న దేవాలయాల లోని అన్ని విగ్రహాలు ఇక్కడకు వస్తున్నాయని, దాదాపు అన్ని విగ్రహాలు మార్చి 25, ఏప్రిల్ 15 మధ్య ప్రతిష్టించబడతాయని ఆయన చెప్పుకొచ్చారు.
కాగా ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత సుప్రీంకోర్టు అయోధ్య రామాలయం నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. దీంతో యూపీ ప్రభుత్వం ఆలయ నిర్మాణం కోసం శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టును ఏర్పాటు చేసింది. ఈ ట్రస్టు దేశవ్యాప్తంగా రామమందిర నిర్మాణం కోసం విరాళాలు ప్రజల నుండి సేకరించింది. అనంతరం వచ్చిన డబ్బుతో ఆలయ నిర్మాణం చేసి.. 2024 జనవరి 22న భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రధాన ఆలయంలో బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. నాటి నుంచి నేటి వరకు అయోధ్యలో పలు నిర్మాణ పనులు కొనసాగుతున్నప్పటికీ.. ప్రతి రోజు వేల సంఖ్యలో భక్తులు అయోధ్యను సందర్శిస్తున్నారు.