మత మార్పిళ్లు, గోహత్యలను పూర్తిగా అరికట్టాలి: సాధు సంతుల చింతన్ బైఠక్ డిమాండ్
దేశంలో విదేశీయుల సొమ్ముతో జరుగుతున్న మత మార్పిళ్లు, గోహత్యలను పూర్తిగా అరికట్టాలని సాధు సంతులు డిమాండ్ చేశారు. ఒడిస్సాలో జరుగుతున్న గోహత్యలు, గోవుల అక్రమ రవాణాపై కూలంకషంగా చర్చించిన సాధువులు.. దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి స్వామి జీవన్ముక్తానంద మహారాజ్ అధ్యక్షత వహించారు. పరమహంస స్వామి ప్రజ్ఞనానంద్, స్వామి శంకరానంద్ వంటి ప్రముఖ సాధువులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ.. ఆవుల అక్రమ రవాణాను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అరికట్టాలని, దీనికి సంబంధించిన చాలా చట్టాలున్నాయన్నారు. కానీ.. దురదృష్టవశాత్తు ఎవ్వరు కూడా వాటిని పాటించడం లేదని అన్నారు. రాష్ట్రంలో గోహత్య, అక్రమ రవాణా కేసులు పెరిగిపోవడానికి ఇది కూడా కారణమేనని అన్నారు. అందుకే రాష్ట్రంలో ఈ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని సాధువులు డిమాండ్ చేశారు.
ఇక రాష్ట్రంలో విదేశీ సొమ్ముతో క్రైస్తవ మిషనరీలు బలవంతపు మత మార్పిళ్లకు పాల్పడుతున్నాయని చింతన్ బైఠక్ వేదికగా సాధు సంతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మత మార్పిడులను అరికట్టేందుకు చట్టం చేసిన తొలి రాష్ట్రాలలో ఒడిశా కూడా ఒకటనని గుర్తు చేశారు. ఈ చట్టాలను అమలు చేయకపోవడం వల్లే మత మార్పిడులు జరుగుతున్నాయని, మిషనరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు స్వామి లక్ష్మణానంద సరస్వతీ హత్యపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని సాధువులు పునరుద్ఘాటించారు.