46 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న పూరీ భాండాగారం

ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం ఓ అద్భుతమైన ఖజానా. జగన్నాథుని వెలకట్టలేని విలువైన ఆభరణాలను ఐదు కర్రపెట్టెల్లో ఉంచి, రహస్య గదిలో భద్రపరిచారు. పూర్వం అప్పుడప్పుడు దానిని తెరిచి సంపద లెక్కించేవారు. 1978 తర్వాత దానిని తెరవలేదు. దీంతో ఆ భాండాగారంపై వివాదాలెన్నో! అసలు తాళం ఏమైందనే అంశమే మొన్నటి ఎన్నికల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. చివరకు కొత్త ప్రభుత్వం దాన్ని తెరవాలని నిర్ణయించింది. సుమారు 46 ఏళ్ల తర్వాత ఈ నెల 14న తెరవనున్నారు. ఆభరణాల లెక్కింపుతో పాటు అవసరమైన వాటికి మరమ్మతులు చేపట్టనున్నారు. భాండాగారాన్ని తెరిచే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్‌ బిశ్వనాథ్‌ రథ్‌ కమిటీ రెండో దఫా సమావేశం మంగళవారం పూరీలో జరిగింది. 14న భాండాగారం తెరిచేలా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కమిటీలోని 16 మంది సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరం జస్టిస్‌ రథ్‌ విలేకరులతో మాట్లాడుతూ భాండాగారం తెరవడంతో పాటు సంపద లెక్కింపు, ఆభరణాల భద్రత, మరమ్మతులపై ప్రభుత్వానికి నివేదించనున్నట్లు వెల్లడించారు. రథయాత్ర పనిభారం వల్ల శ్రీక్షేత్ర పాలనాధికారి భాండాగారం డూప్లికేట్‌ తాళపుచెవిని కలెక్టరేట్‌లోని ట్రెజరీ నుంచి తీసుకురాలేదని, ఆయన 14న తమకు అందజేస్తారన్నారు. దాంతో తెరుచుకోకపోతే తాళంకప్ప పగలగొట్టి తలుపులు తెరవనున్నట్లు చెప్పారు.

మాది పర్యవేక్షణ బాధ్యతే
‘జగన్నాథుడికి చెందిన వజ్ర, వైఢూర్యాలు, గోమేధిక, పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణాభరణాలు, వెండి తదితరాల బరువు, నాణ్యత పరిశీలించడానికి నిపుణులు అవసరం. మా కమిటీ సభ్యులకు నగల నాణ్యతపై అవగాహన లేదు. మేం కేవలం పర్యవేక్షిస్తాం. భాండాగారానికి మరమ్మతులు చేయాల్సి ఉన్నందున నగల లెక్కింపు అక్కడే సాధ్యం కాదు. ఈ సంపదను మరోచోటికి తరలించి పటిష్ఠ భద్రత మధ్య లెక్కిస్తాం. మరమ్మతులపై అధ్యయనానికి మరో సంఘం అవసరమ’ని జస్టిస్‌ రథ్‌ వివరించారు. ‘ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో లెక్కింపు చేపడతాం. ఇది ఎప్పుడు పూర్తవుతుందో నిర్దిష్టంగా చెప్పలేం. అప్పటి వరకూ సంఘం సభ్యులందరూ శాకాహారం భుజిస్తూ, నియమ నిష్టలతో ఉంటారు. స్వామివారి దర్శనాలకు భక్తులు ఇబ్బంది పడకుండా ఆలయ పాలకవర్గం, ప్రభుత్వం చర్యలు తీసుకుంటాయ’ని జస్టిస్‌ రథ్‌ పేర్కొన్నారు.

1978లో భాండాగారంలోని సంపద లెక్కించేందుకు 70 రోజులు పట్టింది. లెక్కింపు తర్వాత ప్రకటించిన జాబితాలో స్వామి వారికి చెందిన పలు ఆభరణాల పేర్లు కనిపించలేదు. దీనిపై హైకోర్టులో ఓ వ్యాజ్యం దాఖలైంది. విచారణ జరిపిన న్యాయస్థానం భాండాగారం తెరిచి సంపద లెక్కించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్థించింది. ఈ క్రమంలో ఆభరణాల లెక్కింపు, గది మరమ్మతుల కోసం 2019లో నవీన్ పట్నాయక్ సర్కారు 13 మందితో కమిటీ ఏర్పాటు చేసింది. అదే ఏడాది ఏప్రిల్ 16న భాండాగారం తలుపు తెరిచేందుకు వెళ్లిన ఈ కమిటీ సభ్యులు.. తాళంచెవి కనిపించకపోవడంతో వెనుదిరిగారు. భాండాగారానికి సంబంధించిన డూప్లికేట్ తాళంచెవి పూరీ కలెక్టరేట్ ట్రెజరీలో ఉందని గుర్తించారు. ప్రస్తుతం ఈ తాళం చెవి సాయంతో గది తలుపులు తెరవనున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *