కమ్యూనిస్టుల సాయుధపోరు ఎవరిపైన?

– డా.మాసాడి బాపురావు

క్విట్‌ ఇండియా ఉద్యమానికి లాగానే, హైదరా బాద్‌ సంస్థాన ప్రజల విముక్తి ఉద్యమానికి కూడా కమ్యూనిస్టులు వెన్నుపోటే పొడిచారు. హైదరాబాద్‌ సంస్థానంలో నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కమ్యునిస్టుల పాత్ర గురించి పుంఖాను పుంఖాలుగా చరిత్ర పుస్తకాలు లభించడం మనం చూస్తూనే ఉంటాం. నిజాం వ్యతిరేక పోరాట మంటేనే కమ్యునిస్టులు సాగించిన తెలంగాణ రైతాంగ సాయుధపోరాటమే గుర్తు కొచ్చేంతగా ఊదరగొట్టేశారు. విధిలేక తెలంగాణ ప్రజలు అమాయకంగా నమ్మేస్తుంటారు కూడా. నాటి హైదరాబాద్‌ సంస్థానంలో 16 జిల్లాలుండగా వీరి పోరాట ప్రభావం కేవలం వరంగల్‌, నల్గొండ రెండు జిల్లాలలోనే నడిచింది. కొద్దిపాటిగా కరీంనగర్‌, హైదరాబాద్‌లోనూ ఈ రెండు జిల్లాల ఉద్యమాలతోనే, అది కూడా కమ్యునిస్టులు చేసిన ఉద్యమాలతోనే నిజాం తల వంచి దిగిపోయారని, రజాకార్లు తోక ముడిచారని గొప్పలు చెప్పుకొనే కమ్యునిస్టులు నిజాం తలవంచిన రోజు నిజాం పంచన ఎందుకు చేరారో చెప్పరు. నిజాం తల వంచడం, రజాకార్లు తోక ముడువడమే సాయుధ పోరాట లక్ష్యమైతే, మరి నిజాం తలవంచి రజాకార్లు తోకముడిచిన 1948 సెప్టెంబర్‌ 17 రోజున  పోరాటం ఎందుకు ఆగిపోలేదు.

భారత ప్రభుత్వానికి, మిలిటరీకి వ్యతిరేకంగా 1948, సెప్టెంబర్‌ 17 తర్వాత కూడా సాగించిన సాయుద పోరుపై  పార్టీ అగ్రనాయకుడు శ్రీ రావి నారాయణ రెడ్డి రచించిన ‘తెలంగాణ నగ్న సత్యాలు’ పుస్తకంలో ఎండగట్టిన విషయం ఎందుకు ప్రస్తావించరు. కమ్యునిస్టు పార్టీ ఆంధ్ర నాయకత్వంలో భారత ప్రభుత్వానికి, నిజాంలను గద్దెదించడానికి వచ్చిన మిలిటరీకి వ్యతిరేకంగా పోరాడడం అంటే  హిమాలయాల అంత పెద్ద తప్పు చేయడమేనని వారి అగ్రనాయకుడే నాయకత్వాన్ని చీల్చి చెండాడినా వారి పంథా మారలేదు.

ప్రజా పంథాని అనుసరించలేదు. ఈ పోరుతో ఆశించిన ఫలితాలు రాక పోగా సాయుధ పోరు ఒక వ్యక్తిగత హింసావాదంగా మారిందన్న రావి మాటలు అక్షరసత్యం కాదా? కేవలం నాలుగేళ్ల పాటు నిజాంవ్యతిరేక పోరాటం పేరుతో సాగించిన పోరులో సింహభాగం స్థానిక భూస్వాములకు వ్యతిరేకంగానే సాగింది. అన్ని పార్టీలతో కలిసి హిందూ భావజాలంతో ఏర్పడ్డ ఆంధ్రమహా సభలో చొరబడి కేవలం 11వ, 12వ ఆంధ్ర మహాసభ నాయకత్వాన్ని చేజిక్కించుకొని ఆంధ్ర మహాసభ సాగించిన పోరునంతా తమ ఖాతాలో వేసుకోవడా నికి విఫలయత్నం చేస్తూనే ఉన్నారు. నిజాం వ్యతిరేక పోరాటం అంటారు. తీరా ‘ఆపరేషన్‌ పోలో’’ ప్రారంభమవుతుందనగా నిజాం వంచన చేరి రజాకార్లతో ఆయుధాలు పంచుకొని, తెలంగాణ ప్రజల్ని విముక్తుల్ని చేసి నిజాం మెడలు వంచడానికి వచ్చిన భారత భద్రతాదళాలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం సాగించారు..

హైదరాబాద్‌ సంస్థాన ప్రజల కడగండ్లను మొదటి సారి ఒప్పుకున్న నెహ్రూ, భారత ప్రభుత్వం పోలీస్‌ యాక్షన్‌ కు సిద్ధపడుతున్నదని తెలియగానే 1948 మే 4న కమ్యూ నిస్టు పార్టీ నిజాం రజాకార్లతో కుమ్మక్కై ‘‘స్వతంత్ర భారత ప్రభుత్వం భూస్వామ్య బూర్జువా ప్రభుత్వమని, ఆ ప్రభుత్వ దళాలను హైదరాబాద్‌ సంస్థానానికి రానివ్వద్దని ‘ఆజాద్‌ హైదరాబాద్‌: (నిజాం కోరుకున్న విధంగానే) మన లక్ష్యమని’’ పత్రికా ప్రకటనలు గుప్పించారు కమ్యూనిస్టులు.

సంస్థాన ప్రజలను మోసం చేస్తున్నమంటూ, కమ్యూనిస్టు పార్టీ క్యాడర్‌, రావి నారాయణ్‌ రెడ్డి లాంటి అగ్రనేతలు మొత్తుకున్నా కమ్యూనిస్టు పార్టీ పిడివాదంతో నిజాం లొంగిపోయిన తర్వాత కూడా సాయుధపోరును భారత ప్రభుత్వ దళాలపై కొనసా గించింది. భూస్వాములకు వ్యతిరేకంగా సాగుతున్న సాయుధ రైతాంగ పోరాటమని చెప్పినప్పటికీ, సంస్థానమంతా 2680 మంది భూస్వాములుండగా 1960 ముస్లిం భూస్వాములు, 720 మంది హిందూ భూస్వాములు. మొత్తం భూమిలో నిజాం, అతని పాలెగాళ్ళ ఆధీనంలోనే 1/3వ వంతు భూమి ఉంది. మరి కమ్యూనిస్టులు అతి పెద్ద భూస్వామిగా నిజాంను ఎందుకు గుర్తించలేదు. వీరి సాయుధ పోరాటమంతా 7,8 మంది జాగీర్థార్ల పైనేనన్నది జగమెరిగిన సత్యం.నరమేధం సృష్టించి, చివరికి ‘మేము ఇక్కడి ప్రజల, ప్రజా ఉద్యమాల స్వభావాన్ని అర్థం చేసుకోలేక పోయామని 1972లో పుచ్చలపల్లి సుందరయ్య తన ఆత్మకథలో పేర్కొనడం కొసమెరుపు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *