కోటి మంది రైతులను సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లిస్తాం: బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఏడోసారి పార్లమెంట్‌లో తన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. మరీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. వచ్చే రెండు సంవత్సరాలలో కోటి మంది రైతులను సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లించేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. సుస్థిర విధానాలు, డిజిటల్‌ మౌలిక సదుపాయాలు, పంట దిగుబడుల పెరుగుదలకు తీసుకోనున్న నిర్ణయాలను కూడా వివరించారు. రసాయన ఎరువులు, పురుగుల మందులపై ఆధారపడటాన్ని తగ్గించడం కోసం, సుస్థిర వ్యవసాయ పద్ధతులను సాధించడం కోసం ప్రకృతి వ్యవసాయాన్ని తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు ప్రకటించారు. ‘‘సేంద్రీయ వ్యవసాయంతో నేల సారంతో పాటు జీవ వైవిధ్యం పెరగడమే కాకుండా రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గిపోతాయి. తద్వారా వారికి సేద్యంలో లాభాలు కూడా పెరుగుతాయి’’ అని ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా వివరించారు.

 

సాగు ఉత్పాదకత పెంచడమే లక్ష్యంగా కేంద్రం కేటాయింపులు చేసింది. మొత్తంగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు 1.52 లక్షల కోట్లు కేటాయించింది. వచ్చే రెండు సంవత్సరాలలో కోటి మంది రైతులు సేంద్రీయ వ్యవసాయంలోకి ప్రవేశించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వ్యవసాయంలో స్థిరమైన పద్ధతులు, డిజిటల్‌ మౌలిక సదుపాయాలు, ఉత్పత్తి పెంపుదలపై దృష్టి సారించామని, ఆ దిశగానే తమ కార్యక్రమాలు వుంటాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

వ్యవసాయ పరిశోధనలకు పెద్దపీట :

ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం తట్టుకోగలిగి, అధిక దిగుబడినిచ్చే కొత్త వంగడాల దిశగా వ్యవసాయ పరిశోధనలను ప్రోత్సహిస్తామని ప్రకటించారు. ఆ దిశగా తగిన నిధులు అందజేస్తామని మంత్రి తెలిపారు. ప్రైవేటు రంగాన్ని సైతం ఇందులో భాగస్వామ్యం చేస్తామని పేర్కొన్నారు. దీన్ని నిరంతరం ఆయా రంగాల్లోని నిపుణులు సహా ప్రభుత్వ అధికారులు పర్యవేక్షించేలా చర్యలు చేపడతామని వెల్లడిరచారు. ఇక.. వాతావరణ మార్పులను తట్టుకోగలిగే 109 రకాల అధిక దిగుబడి వంగడాలను విడుదల చేస్తామని ప్రకటించారు.

 

పప్పు ధాన్యాలు, నూనె గింజల సాగులో స్వయంసమృద్ధి సాధించడమే లక్ష్యంగా కేంద్రం పలు చర్యలు ప్రకటించింది. వీటి ఉత్పత్తి, నిల్వ, మార్కెటింగ్‌ను మరింత బలోపేతం చేస్తామని తెలిపింది. మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించిన విధంగా ఆముదం, వేరుశెనగ, నువ్వులు, సోయాబీన్‌, పొద్దుతిరుగుడు వంటి నూనెగింజల్లో స్వయం సమృద్ధి దిశగా ప్రత్యేక వ్యూహాన్ని అనుసరిస్తామని పేర్కొన్నారు.

ఇక కూరగాయల ఉత్పత్తి కోసం భారీ క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. అధిక వినియోగం వుండే ప్రాంతాల సమీపంలో వీటిని నెలకొల్పుతామని పేర్కొన్నారు. కూరగాయల సేకరణ, నిల్వ, మార్కెటింగ్‌ కోసం ప్రత్యేక సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేసేలా స్టార్టప్‌లను, సహకార సంఘాలు, రైతు సంఘాలను ప్రోత్సహిస్తామని ప్రకటించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *